కుంభమేళాకు అన్ని ఏర్పాట్లా!

All arrangements for Kumbh Mela!

Jan 12, 2025 - 15:35
 0
కుంభమేళాకు అన్ని ఏర్పాట్లా!

అన్ని దారులు అటు వైపే
బస్సులు, రైళ్లు, విమానాల ద్వారా 40కోట్ల మంది భక్తులు

నా తెలంగాణ, సెంట్రల్​ డెస్క్​: ప్రయాగ్​ రాజ్​ మహాకుంభ్​ మేళాకు తరలివచ్చే భక్తులు 40 కోట్లకు పైగా ఉంటారని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం భారీ ఏర్పాట్లను చేసింది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చే భక్తుల కోసం పెద్ద ఎత్తున రవాణా సౌకర్యం కల్పించింది. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు ఈ కుంభమేళా కొనసాగనుంది. జాన్​ పూర్​ మార్గం నుంచి 21 శాతం, రేవా నుంచి 18 శాతం, వారణాసి మార్గం నుంచి 16 శాతం, కాన్పూర్​ నుంచి 14 శాతం, మీర్జాపూర్​ నుంచి 12 శాతం, లక్నో మార్గంలో 10 శాతం, ప్రతాప్​ గఢ్​ నుంచి 9 శాతం మంది భక్తులు జాతరకు విచ్చేస్తారని ప్రభుత్వం అంచనా వేస్తుంది. ఈ నేపథ్యంలో జాతర ప్రాంతానికి వచ్చే భక్తులను 10 కిలోమీటర్ల ముందే నిలిపివేయనున్నారు. వారి వాహనాల పార్కింగ్​ కోసం 102 స్థలాలను సిద్ధం చేశారు. 70 శాతం పార్కింగ్​ సదుపాయాన్ని ఐదు కిలోమీటర్ల లోపే కల్పించారు. 10 కి.మీ. నుంచి లోపలికి వెళ్లేందుకు ప్రభుత్వం ప్రత్యేక రవాణా సౌకర్యం ఏర్పాటు చేసింది.  10 కిలోమీటర్ల దూరంలో ఉన్న పార్కింగ్​ పూర్తి శాటిలైజ్డ్​ బేస్​ గా కొనసాగనుంది. పార్కింగ్​ లో తాగునీరు, ప్రథమ చికిత్స, దారి తెలిపే హెల్ప్​ లైన్లు, మరుగుదొడ్లు, ప్రసాదాల వితరణ కౌంటర్లు కూడా ఉండనున్నాయి. 

రోడ్డు మార్గం..
మహాకుంభ్​ మేళాకు 83 శాతం మంది రోడ్డు మార్గాన రానున్నట్లు ప్రభుత్వం అంచనా వేసింది. ఇందులో ఆయా రాష్ర్టాల రవాణా మంత్రిత్వ శాఖలు ఏర్పాటు చేసిన వాహణాలు బస్సులు, కార్లు, ఇతర వాహనాల ద్వారా రానున్నారు. ఇక కుంభమేళా ప్రాంతానికి చేరుకునేందుకు 500 చిన్నపాటి షెటిల్​ సర్వీస్​ బస్సులను అందుబాటులో ఉంచారు. 

రైలుమార్గం..
రైళ్లలో 15 శాతం మంది రైళ్లలో రానున్నారు. ఆయా రాష్ర్టాల నుంచి నుంచి రైళ్లకు అదనంగా యూపీ ప్రభుత్వం కూడా మూడు వేళ్ల ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. ఈ రైళ్లన్నీ నేరుగా ప్రయాగ్​ రాజ్​ మేళాకు చేరుకోనున్నాయి. ప్రయాగ్​ రాజ్​ రైల్వే స్టేషన్​ తోపాటు ఆయా రైళ్లు ఎనిమిది ప్రత్యేక స్టేషన్లలో ఆగనున్నాయి. ఇందుకోసం ప్రత్యేక డివిజన్లను కూడా యూపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. భక్తులతో వెళ్లేటప్పుడు ఈ రైళ్ల మార్గాలు వేర్వేరుగా ఉండనున్నాయి. కుంభమేళాకు హాజరుకానున్న భక్తుల కోసం రైల్వే శాఖ ప్రత్యేకంగా టోల్​ ఫ్రీ నెంబర్​ 1800 4199 139ని జారీ చేసింది. అన్ని రకాల రైల్వే ప్రయాణాలకు విచారణలకు సంబంధించిన సమాచారం ఈ నెంబర్​ లో లభ్యం కానుంది. 

విమానాల ద్వారా..
విమాన మార్గం ద్వారా 2 శాతం భక్తులు మేళాకు హాజరవనున్నారు. వీరి కోసం అయోధ్య విమానాశ్రయం నుంచి నేరుగా మేళా స్నానఘట్టాల వరకు చేరుకునేందుకు లగ్జరీ బస్సులను ఏర్పాటు చేశారు. దేశంలోని 25 నగరాల నుంచి ప్రత్యేక విమానాలు నేరుగా అయోధ్య విమానాశ్రయానికి నడపనున్నారు. ఢిల్లీ, ముంబాయి, లక్నో, రాయ్​ పూర్​, బెంగళూరు, కోల్​ కత్తాల నుంచి రాకపోకలు కొనసాగించనున్నాయి. అహ్మాదాబాద్​, భోపాల్​, చెన్నై, లక్నో, రాయ్​ పూర్​, బెంగళూరుల మీదుగా కూడా పలు విమానాలు రానున్నాయి. జమ్మూ అండ్​ కశ్మీర్​, జైపూర్​, గుహవాటి, నాగ్​ పూర్​, పూణే, డెహ్రాడూన్​, ఇండోర్​, పాట్నాల నుంచి ప్రత్యేక విమానాలు రాకపోకలు కొనసాగించనున్నాయి. గతంలో ప్రయాగ్​ రాజ్​ ఉదయం నుంచి సూర్యుడు అస్తమించే వెలుగులోనే విమానాలు రాకపోకలు సాగించేవి. ప్రస్తుతం ఈ విమానాశ్రయాన్ని విస్తరించడంలో రాత్రి పూట కూడా నిరంతరాయంగా రాకపోకలు కొనసాగనున్నాయి. విమానాశ్రయాన్ని పూర్తి హైటెక్​ తరహాలో రూపొందించడంతో విదేశాల నుంచి నేరుగా ఇక్కడ విమానాలు ల్యాండ్​ కానున్నాయి. 15 నుంచి 20 రోజులలోపే అడ్వాన్స్​ బుకింగ్​ చేసుకోవాలని పలు విమానయాన సంస్థలు ప్రకటించాయి. ఇప్పటికే అన్ని టిక్కెట్లు బుక్​ అయిపోయాయని ప్రకటించాయి. తత్కాల్​ టిక్కెట్లు లభించవని తేల్చి చెప్పేశాయి. 

టెంట్​ (తాత్కాలిక నివాసం)..
భక్తులకు తాత్కాలిక నివాసం కోసం భారీ టెంట్లు 2000 వరకు ఏర్పాటు చేశారు. దీని అద్దె రూ. 3వేల నుంచి రూ. 30వేల వరకు సౌకర్యాలను బట్టి ఉండనుంది. ఇవేగాక ప్రయాగ్​ రాజ్​ వ్యాప్తంగా 42 లగ్జరీ హోటళ్లు, జాతర ప్రాంతంలో 100 లగ్జరీ హోటళ్లు, షెల్టర్లు, 10వేల స్వచ్ఛంద సంస్థలు ఏర్పాటు చేసి షెడ్లు ఉన్నాయి. మేళా ప్రాంతంలో మొత్తం ఒక లక్ష  టెంట్లు, లగ్జరీ టెంట్లు 2 వేలు, స్వచ్ఛందంగా ఏర్పాటు చేసినవి 40వేల టెంట్లు, ఇతర ప్రాంతాల్లో స్నాన ఘట్టాల వద్ద ఏర్పాటు చేసిన లగ్జరీ టెంట్లు 4వేలు, మేళా ప్రాంతంలో పూజనీయ స్థలాల కోసం ఏర్పాటు చేసిన టెంట్లు వంద, 9 రైల్వే స్టేషన్ల వద్ద ఒక లక్షమంది భక్తులు నిలిచే టెంట్లను ఏర్పాటు చేశారు. ఇవి గాక స్టేషన్​ చుట్టు పక్క ప్రాంతాల్లో 50 హోటళ్లు, 204 అతిథి గృహాల, 90 ధర్మశాలలను ఏర్పాటు చేశారు. 

సందర్శనీయ స్థలాలు..
అత్యంత దూరం నుంచి వచ్చే భక్తులు కుంభమేళాను సందర్శించి, పుణ్య స్నానాలు ఆచరించాక మరిన్ని సందర్శనీయ స్థలాలున్నాయి. వీటిలో ప్రముఖమైనవి లైయింగ్​ హనుమాన్​ దేవాలయం, శ్రీ అక్షయవత్ దేవాలయం(ఇక్కడే శ్రీరాముడు, సీతా, లక్ష్మణుడు విశ్రాంతి స్థలం, పాటల్​ పురి ఆలయం, మంకమేశ్వర ఆలయం (శివుడు, వినాయకుడి నల్లరాతి విగ్రహాలు), నాగవాసి ఆలయం (వాస్తుశిల్పాలు), శంకర్​ విమాన మండపం (ఆదిశంకరాచార్యులు, కామాక్షి దేవి, తిరుపతి బాలాజీ), చంద్రశేఖర్​ ఆజాద్​ పార్క్​, స్వరాజ్​ భవన్​, ఖుస్రో బాగ్​, నిషాద్రాజ్​ పార్క్​ తదితరాలు దర్శనీయ స్థలాలు.

వివాహ భోజనంబు..
ప్రయాగ్​ రాజ్​ లో భక్తుల ఆహారానికి కూడా ప్రత్యేక ఏర్పాట్లు, సౌకర్యాలు కల్పించారు. అన్ని శాఖాహార వంటకాలే ఉండనున్నాయి. నాణ్యమైన పంటలతో కూడిన రుచికర​ అన్ని రాష్​ర్టాలకు చెందిన భోజనాలు ఇక్కడ ఏర్పాటు చేయనున్నారు. అన్ని వంటకాలతో కూడిన పచ్ఛళ్లు కూడా ఇక్కడ లభించనున్నాయి. తీపి వంటకాలు ఇష్టం ఉన్నవారి కోసం అన్ని రకాల తీపి వంటకాలు కూడా లభ్యం కానున్నాయి. వంటకాలలో ఉపయోగించే నూనె, నెయ్యి ఇతర పదార్థాలను పూర్తి స్వచ్ఛతను నిర్దరించిన తరువాత మేళా ప్రాంతానికి పంపేందుకు ప్రత్యేక డిపార్ట్​ మెంట్​ నే ఏర్పాటు చేయడం విశేషం.