ఖబడ్దార్ కాంగ్రెస్
దాడులపై కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి హెచ్చరిక
బీజేపీ కార్యాలయంపై కాంగ్రెస్ గూండాల దాడి
స్టేట్ ఆఫీస్ పై రాళ్లు విసిరిన కాంగ్రెస్ ఉన్మాదులు
విచక్షణ కోల్పోయిన అధికార పార్టీ నేతలు
కార్యాలయం ముట్టడికి యత్నం
అడ్డుకున్న బీజేపీ కార్యకర్తలు
దాంతో కర్రలతో దాడి చేసిన రౌడీ మూకలు
బీజేపీ దళితమోర్చా కార్యకర్త తలకు గాయం
పలువురు బీజేపీ నాయకులకు గాయాలు
పోలీసుల ప్రేక్షక పాత్రపై కేంద్ర మంత్రుల ఫైర్
నా తెలంగాణ, హైదరాబాద్: తాము తలచుకుంటే హస్తం పార్టీ నేతలు రోడ్లపై తిరుగుతారా? అని తెలంగాణ రాష్ర్ట బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి హెచ్చరించారు. యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు గూండాలు, రౌడీళ్లా వ్యవహరిస్తారా? పిరికి చర్యలకు పాల్పడతారా? అని మండిపడ్డారు. పోలీసుల సమక్షంలోనే దాడులకు పాల్పడుతుంటే వారు ప్రేక్షక పాత్ర వహించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం కోసం దేశంలో ద్వేషపూరిత, కక్ష్యపూరిత రాజకీయాలతో మతకల్లోలాలను సృష్టించిన దుర్మార్గమైన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వానిదని ఆరోపించారు. అసమర్థ పాలనతో ప్రజల్లో ఆదరణ కోల్పోతున్న హస్తం పార్టీ దుర్మార్గపు చర్యలకు తెరతీసిందని మండిపడ్డారు.
మంగళవారం నాంపల్లిలోని బీజేపీ రాష్ర్ట కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తల దాడిని తెలంగాణ రాష్ర్ట బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. దాడిపై స్పందించారు. ఇలాంటి దుర్మార్గమైన రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ అయిన కాంగ్రెస్ పార్టీ తన తీరును మార్చుకోకపోతే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ప్రజాస్వామ్యంలో హింసా రాజకీయాలకు, భౌతిక దాడులకు మేం పూర్తి వ్యతిరేకమన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఇలాంటి కక్షపూరిత, ద్వేషపూరిత రాజకీయాలు రాష్ట్రంలో పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి దాడులను ఆపకపోతే.. ఆ తర్వాత తలెత్తే పరిస్థితులకు సిద్ధంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీని హెచ్చరించారు. బీజేపీ కార్యాలయంపై దాడి ముఖ్యమంత్రికి తెలియకుండా జరగదని ఖబడ్దార్, అసహనం కోల్పోయి మీరు చేస్తున్న చర్యలకు వ్యతిరేకంగా బీజేపీ కార్యకర్తలు తిరగబడితే.. దేశంలో కాంగ్రెస్ కు ఉన్న కొద్దిపాటి నాయకులు తిరగలేని పరిస్థితులు ఏర్పడతాయని కిషన్ రెడ్డి హెచ్చరించారు.
బిదురి వ్యాఖ్యలతో ఉద్రిక్తత..
బీజేపీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యాలయంపై కాంగ్రెస్ రౌడీ మూకలు దాడికి దిగారు. బీజేపీ మాజీ ఎంపీ రమేశ్ బిదురి ఇటీవల ప్రియాంక గాంధీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ కాంగ్రెస్ శ్రేణులు బీజేపీ కార్యాలయం ముట్టడికి యత్నించారు. దీంతో బీజేపీ కార్యకర్తలు కాంగ్రెస్ నాయకులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ నాయకులు బీజేపీ కార్యాలయంపై కోడిగుడ్లు, రాళ్లతో దాడి చేశారు. బీజేపీ నాయకులు కాంగ్రెస్ శ్రేణులపై తిరగబడ్డారు. కర్రలతో నిలువరించారు. ఈ దాడిలో బీజేపీ కార్యకర్త తలకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఇది ముమ్మాటికీ పోలీసుల వైఫల్యమని బీజేపీ ఆరోపిస్తోంది. ఇక్కడ వరకు ఎలా రానిచ్చారు అని ప్రశ్నించింది.
అధికారం మదంతో దాడి..
తెలంగాణలోని కాంగ్రెస్ శ్రేణులు మంగళవారం మధ్యాహ్నం 12 గంటల తర్వాత గాంధీ భవన్ నుంచి నాంపల్లి బీజేపీ కార్యాలయానికి భారీగా చేరుకున్నారు. బీజేపీ కార్యాలయం ముట్టడికి ప్రయత్నించారు. ఈలోపు బీజేపీ శ్రేణులు ప్రతిఘటించడంతో తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొంది. కాంగ్రెస్ దాడిని బీజేపీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, రాజాసింగ్ స్పందించారు.
పోలీసుల వైఫల్యం..
కాంగ్రెస్ నేతల బీజేపీ కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చిన పోలీసులు ముందస్తుగా ఎటువంటి చర్యలు చేపట్టలేదు. ర్యాలీగా బయలుదేరిన కాంగ్రెస్ కార్యకర్తలను ముందుగానే అడ్డుకుని ఉంటే ఈ దాడి జరిగేది కాదు. ఈ దాడికి కారణం పోలీసులు వైఫల్యం అనే చెప్పాలి. అంత దాడి జరుగుతున్న పోలీసులు చోద్యం చూస్తున్నారు తప్ప అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. ఈ దాడిలో బీజేపీ కార్యకర్తలు , నాయకులు తీవ్రంగా గాయపడ్డారు.
బీజేపీ తలచుకుంటే కాంగ్రెస్ కనబడదు: బండి సంజయ్..
10 మంది కార్యకర్తలొచ్చి దాడులు చేస్తుంటే బీజేపీ చూస్తూ ఊరుకోబోదు. బీజేపీ కార్యకర్తలు తలుచుకుంటే.. గాంధీభవన్ సహా కాంగ్రెస్ కార్యాలయాల పునాదులు కూడా మిగలవు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని అధికార పార్టీ కార్యకర్తలు రాళ్లతో దాడులు చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తోంది? రాళ్ల దాడులను కాంగ్రెస్ పార్టీ ప్రోత్సహించాలనుకుంటోందా? పిల్లలు, వృద్ధులకు రాళ్లు తగిలితే పరిస్థితి ఏ విధంగా ఉండేదో తెలియదా? బీజేపీ కార్యకర్తల సహనాన్ని చేతగానితనంగా భావించొద్దు. తప్పుడు వ్యాఖ్యలు ఎవరు చేసినా ఖండించాల్సిందే. చట్టపరంగా తగిన చర్యలు తీసుకోవాల్సిందే.. అంతేగాని చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని భయపెట్టాలని చూస్తే.. ఊరుకునేది లేదు. తక్షణమే దాడికి పాల్పడ్డ కార్యకర్తలను అరెస్ట్ చేయాలి.
ఈ ఘటనపై రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలి: ఎమ్మెల్యే రాజాసింగ్..
ఇటువంటి హింసాత్మక చర్యలు ప్రజాస్వామ్య సమాజంలో ఆమోదయోగ్యం కాదు. కాంగ్రెస్ నాయకత్వం యొక్క నిరాశను ఎత్తి చూపుతున్నాయి. ఈ సిగ్గుమాలిన ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి బేషరతుగా క్షమాపణలు చెప్పాలి. కాంగ్రెస్ వ్యూహాలకు బీజేపీ బెదరదు అని, ఇలాంటి రెచ్చగొట్టే చర్యలకు పూనుకుంటే బీజేపీ కూడా దీటుగా తీసుకుంటుంది.