బంగ్లా ఆసుపత్రుల్లో ప్రాణాంతక బ్యాక్టీరియా

Deadly bacteria in Bangla hospitals

Jan 12, 2025 - 18:11
 0
బంగ్లా ఆసుపత్రుల్లో ప్రాణాంతక బ్యాక్టీరియా

యూనస్​ కు నివేదిక అందించినా చర్యలు శూన్యం
సైంటిఫిక్​ జర్నల్​ అధ్యయనంలో వెల్లడి
యూఎన్​ డబ్ల్యూహెచ్​ వో హెచ్చరికలు బేఖాతరు
నాలుగు ప్రధాన ఆసుపత్రుల్లో శాంపుల్స్​ సేకరణ, విశ్లేషణ, ఫలితాలు వెల్లడి
యాంటీబయోటిక్స్​ ను తట్టుకునే స్థాయికి ఎదిగిన బ్యాక్టీరియా

నా తెలంగాణ, సెంట్రల్​ డెస్క్​: బంగ్లాదేశ్​ ఆసుపత్రుల్లో రోజురోజుకు పరిస్థితులు దిగజారుతున్నాయి. ఫిబ్రవరి 2023 జూన్​ మధ్య సైంటిఫిక్​ జర్నల్​ అధ్యయనంలో పలు ఆశ్చర్యగొలిపే విషయాలు వెలుగుచూశాయి. ఢాకాలోని నాలుగు ప్రధాన ఆసుపత్రులలో మల్టీ డ్రగ్​ రెసిస్టెంట్​ బ్యాక్టీరియా ప్రమాదకర స్థాయిలను వెల్లడించింది. ఈ అధ్యయన ఫలితాలు అత్యంత ఆందోళనకరంగా ఉన్నాయి. అధ్యయనానికి నేతృత్వం వహించిన శాస్ర్తవేత్త అబ్దుస్​ సలామ్​ పలు విషయాలతో కూడిన నివేదికను బయట పెట్టారు. ఆసుపత్రుల్లో వస్తున్న ఇన్ఫెక్షన్లకు చికిత్స చేయడం కూడా కష్టమేనని నివేదికలో వెల్లడించారు. 

ఈ అధ్యయనం ప్రకారం ఢాకాలోని ఆసుపత్రుల పరిసరాల నుంచి నలుసు పదార్థాలలో ‘బయోఎరోసోల్స్ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్’ అనే పరిశోధన నిర్వహించారు. ఢాకా మెడికల్ కాలేజీ హాస్పిటల్, బంగబంధు షేక్ ముజీబ్ మెడికల్ యూనివర్శిటీ, ఖ్వాజా బద్రుద్దుజా మోడ్రన్ హాస్పిటల్, మొన్నో మెడికల్ కాలేజ్ హాస్పిటల్ నుంచి పలు శాంపిల్స్ ను సేకరించారు. ఈ ఆసుపత్రుల గాలిలో ఉండే పర్టిక్యులేట్ మ్యాటర్ (పీఎం)లో అనుమానాస్పద బ్యాక్టీరియాను కనుగొన్నారు. గాలిలో కనిపించే 11 రకాల బ్యాక్టీరియాలలో స్టెఫిలోకాకస్ ఆరియస్, ఇ. కోలి, సూడోమోనాస్ ఎరుగినోసా వంటి బ్యాక్టీరియాలు ఉన్నాయి.

ఈ బ్యాక్టీరియా న్యుమోనియా, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, బ్లడ్ ఇన్ఫెక్షన్ వంటి తీవ్రమైన వ్యాధులకు కారణమవుతుంది. భయంకరమైన విషయం ఏమిటంటే చాలా బ్యాక్టీరియా అనేక యాంటీబయాటిక్స్‌కు నిరోధకతను కలిగి ఉన్నట్లు కనుగొన్నారు. అంటే యాంటీబయోటిక్స్​ మందులు కూడా ఈ బ్యాక్టీరియాపై ప్రభావం చూపలేవు. ఆస్పత్రుల గాలిలో పీఎం2.5, పీఎం10 స్థాయిలు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ప్రమాణాల కంటే చాలా రెట్లు ఎక్కువగా ఉన్నాయి. ఢాకా మెడికల్ కాలేజీ హాస్పిటల్‌లో PM2.5 స్థాయిలు 220.60 మిల్లీ గ్రాములగా నమోదయ్యాయి. ఈ పరిణామాలు అంతర్జాతీయ ప్రమాణాల కంటే చాలా ఎక్కువ. ఈ మైక్రోస్కోపిక్ కణాలు ఊపిరితిత్తుల ద్వారా నేరుగా రక్తాన్ని చేరి శరీరాన్ని ప్రభావితం చేస్తాయి.

ఈ నేపథ్యంలో యూఎన్​ డబ్ల్యూహెచ్​ ఓ ఈ ఉపద్రవాన్ని ప్రాథమిక ముప్పుగా పరిగణిస్తుంది. యాంటీబయోటిక్స్​ రెసిస్టెన్స్​ కారణంగా ప్రతీఏటా బంగ్లాలో 8 లక్షల మరణాలు సంభవిస్తున్నాయి. పాత ఫర్నిచర్​, రద్దీ ఎక్కువ, తక్కువ వెంటిలేషన్​ వంటివి ఈ బ్యాక్టీరియా విజృంభించేందుకు కారణాలుగా నిలుస్తున్నట్లు గుర్తించారు. 

పరిష్కారం ఎలా?..
ఆసుపత్రుల్లో ఇన్‌ఫెక్షన్లు రాకుండా కఠిన నిబంధనలు అమలు చేయాలి. యాంటీబయాటిక్స్ వాడకాన్ని ఖచ్చితంగా పర్యవేక్షించవలసి ఉంటుంది. పర్యావరణంలో ఎఎంఆర్​ ని పర్యవేక్షించడానికి కొత్త ప్రణాళికలు రూపొందించాలి. ఢాకాలోని ఆసుపత్రుల్లో గాలిలో కలిసిపోతున్న ఈ ముప్పు స్థానిక సమస్య మాత్రమే కాదు. బదులుగా ఇది ప్రపంచ ఆరోగ్య సంక్షోభంలో భాగం. సకాలంలో కఠిన చర్యలు తీసుకోకపోతే, ఈ అదృశ్య శత్రువు మరింత ప్రమాదకరమైన రూపాన్ని తీసుకునే అవకాశం లేకపోలేదు. వెంటనే ఆసుపత్రుల్లో సరైన గాలి, వెలుతురు ఉండేలా చర్యలు తీసుకోవాలి. ఫర్నిచర్​ ను పూర్తిగా మార్చాలి. రద్దీకి అనుగుణంగా సరైన చర్యలు తీసుకోవాలి. ఆసుపత్రుల ప్రాంగణాల్లో శుచి శుభ్రతను పాటించాలి. 

ఆసుపత్రుల్లో భద్రతపై గతంలోనే బంగ్లా తాత్కాలిక ప్రభుత్వం యూనస్​ కు నివేదిక సమర్పించినా ఇంతవరకూ చర్యలు తీసుకున్న దాఖలాలు కనిపించడం లేదు. పైగా బంగ్లా ఉపద్రవాలకు కారణభూతంగా నిలుస్తున్నారు. పాక్​ తో జతకట్టి తమదేశ ప్రజాస్వామ్య విలువలకు తిలొదకాలిచ్చారు. ప్రస్తుతం ఆ దేశ ప్రజానీకాన్నే ప్రమాదం అంచున నిలిపారనే ఆరోపణలు మిన్నంటుతున్నాయి. తక్షణమే ఈ వైరస్​ పై చర్యలు తీసుకోకుంటే భవిష్యత్​ లో జరిగే తీవ్ర పరిణామాలకు తాత్కాలిక యూనస్​ ప్రభుత్వమే ప్రధాన కారణంగా నిలుస్తుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.