యవ్వనం, స్నేహం బలమైన బంధాలు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: యువతతో తనకు ఉన్న స్నేహపూర్వక బంధం గొప్పదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. యవ్వనం, స్నేహం అనేవి బలమైన బంధాలుగా తాను భావిస్తున్నట్లు తెలిపారు. ఇవే భారత్ యువ నాయకత్వానికి అత్యంత ఆవశ్యకమన్నారు. వీలైనంత త్వరగా యువత రాజకీయాల్లోకి అడుగిడి దేశ భవితను సువర్ణాక్షరాలతో లిఖించాలన్నారు. ఆదివారం స్వామి వివేకానంద జయంతి సందర్భంగా భారత మండపంలో జరిగిన ‘వికాస్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ –2025’ అనే కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు.
యువశక్తి దేశంలో అద్భుతమైన మార్పు తీసుకువస్తుందని తాను నమ్ముతున్నట్లుగా పేర్కొన్నారు. ఈ వేదిక ఒక స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందన్నారు. యువశక్తిని ఏకం చేస్తుందన్నారు. యువతపై స్వామి వివేకానందకు అపారమైన నమ్మకం ఉండేదన్నారు. ప్రతీ సమస్యకు పరిష్కారం ఉన్నట్లు దేశ సమస్యలకు పరిష్కారం చూపగల సత్తా ఉన్నవారు యువతేనని మోదీ స్పష్టం చేశారు. స్వామి ఆశయాలను నెరవేర్చాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ప్రపంచంలో ఎన్నో దేశాలు, సమూహాలు, సమాజాలు ఉన్నాయని తెలిపారు. వాటన్నింటిలో యువశక్తి అత్యధికంగా ఉన్న భారత్ ముందువరుసలో ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. బ్రిటీష్ వారికి యువశక్తి లేకున్నా ప్రపంచాన్ని ఎలా ఎలగలిగారో గుర్తుంచుకోవాలన్నారు. అయినా భారత్ తమ స్వాతంత్ర్య కలను నిలబెట్టుకుందన్నారు. 1930వ దశకంలో ఆర్థిక అగాధంలో కూరుకున్న అమెరికా ఆ తరువాతి కాలంలో ప్రపంచంలోనే అత్యంత శక్తివంతంగా ఎదగడంలో, సంక్షోభం నుంచి బయట పడడంలో యువతదే కీలకపాత్ర అని మోదీ పేర్కొన్నారు.
నేడు అనేక రంగాలలో భారతదేశం నిర్ణీత సమయానికి ముందే తన లక్ష్యాలను సాధిస్తోందని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు. వ్యాక్సిన్ గురించి ప్రపంచం ఆందోళన చెందుతున్న కరోనా సమయంలో శాస్త్రవేత్తలు ఈ వ్యాక్సిన్‌ను సమయానికి ముందే తయారు చేసి తమ దేశ సత్తా చాటారని హర్షం వ్యక్తం చేశారు. చంద్రయాన్ ద్వారా అత్యున్నత స్థానానికి ఎదుగుతున్నామని తెలిపారు. ఆర్థికంగా, సామాజికంగా, సంస్కృతి, సాంప్రదాయాల పరంగా ఎదగడమే బలంగా ఉన్నట్లుగా చెప్పారు. విద్య ద్వారానే యువతో స్కిల్డ్ పవర్ ఏర్పడుతుందని గుర్తించాలని ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు.