అవినీతి ఎక్స్​ రే సిద్ధం

వందతరాలు భయపడాలి యువత వలసలెందుకు వెళుతున్నారు అవినీతి సొమ్ము కక్కించేవరకు నిద్దురపోను న్యాయమూర్తులను బెదిరించే స్థాయికి టీఎంసీ గుండాలు రేఖా పాత్రకు ఓటు వేసి గెలిపించాలన్న ప్రధాని మోదీ

May 28, 2024 - 19:05
 0
అవినీతి ఎక్స్​ రే సిద్ధం

కోల్​ కతా: అవినీతికి పాల్పడాలంటే వంద తరాలు కూడా భయపడాలని అలాంటి ఎక్స్​ రే ను రూపొందించామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. పశ్చిమ బెంగాల్​ లోని బరాసత్​ లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో మంగళవారం పాల్గొని ప్రసంగించారు. 

ఓ వైపు దేశంలోనూ మారుమూల ప్రాంతాలను సైతం అభివృద్ధి బాటలు పయనింప చేయాలని తాము కలలు కంటుంటే  ఈ అవినీతి దేశానికి పట్టిన చీడపురుగులా దాపురించిందన్నారు. భవిష్యత్తులో అవినీతిపై ఉక్కుపాదమేనన్నారు. దాంతో ఎవ్వరైనా అవినీతికి పాల్పడాలంటే వెన్నులో వణుకు పుట్టాలన్నారు. 
పదేళ్లలో దేశాభివృద్ధికి విశేష కృషి చేశామని ప్రధాని మోదీ వివరించారు. 

పశ్చిమ బెంగాల్​ యువత వలస వెళ్లాల్సిన దుస్థితి ఎందుకు దాపురించిందని ప్రశ్నించారు. కాంగ్రెస్​, వామపక్షాలు, టీఎంసీ లు ఈ ప్రాంతాన్ని దోచుకుతిన్నాయన్నారు. ఈ మూడు పార్టీలు నేరస్తులేనన్నారు. తాను ప్రజలకు స్పష్టంగా హామీ ఇచ్చానన్నారు. అవినీతిని సహించబోనని చెప్పానని అన్నారు. అవినీతి సొమ్ము తిన్నవాడి నుంచి పూర్తిగా కక్కించే వరకు నిద్దుర పోనని స్పష్టం చేశారు. 

రాజ్యాంగం కల్పించిన హక్కులను రాత్రికి రాత్రి మారుస్తూ నిర్ణయం తీసుకోవడం శోచనీయమన్నారు. ఇప్పుడు హైకోర్టు న్యాయమూర్తులనే ప్రశ్నించే, విమర్శించే స్థాయికి టీఎంసీ గుండాలు ఎదిగారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

హిందువులు కొట్టుకుపోతారని మాట్లాడతారా? అని మండిపడ్డారు. సాధు సంతులను అవమానిస్తారా? అని ధ్వజమెత్తారు. షాజహాన్​ షేక్​ లాంటి దురహంకారులను టీఎంసీ కాపాడుతోందన్నారు. సోదరి రేఖా పాత్రను గెలిపించి గుండరాజ్​ కు పూర్తిగా చెక్​ పెట్టాలన్నారు. 

వందలాది శరణార్థులకు పౌరసత్వం లభించడం దేశం మొత్తం చూస్తోందన్నారు. పౌరసత్వం ఇచ్చేందుకు ఏ శక్తి తమను ఆపలేదన్నారు. ఆయుష్మాన్​ భవతో ఎంతోమంది నిరుపేదలకు మేలు చేకూరుతుంటే పశ్చిమ బెంగాల్​ ప్రభుత్వం మాత్రం ఈ బృహత్తర పథకాన్ని ఎందుకు అమలు చేయడం లేదని ప్రధాని నరేంద్ర మోదీ ప్రశ్నించారు.