కర్ర స్తంభం.. విరిగితే ప్రమాదం
విద్యుత్ అధికారులకు మొరపెట్టుకున్నా స్తంభం ఏర్పాటులో నిర్లక్ష్యం విధి లేని పరిస్థితుల్లో కర్ర స్తంభాన్ని ఏర్పాటు చేసుకున్న రైతు
నా తెలంగాణ, డోర్నకల్: మహబూబాబాద్ జిల్లా కురవి మండలం బలపాల శివారు భద్రయ్య కు చెందిన వ్యవసాయ భూమిలో నుంచి వ్యవసాయ మోటర్లకు సరఫరా చేసే విద్యుత్ తీగలు కిందకు వేలాడుతూ ప్రమాదకరంగా మారాయి. ఈ విషయాన్ని పలుమార్లు అధికారులకు వివరించి ఆర్జీలు సైతం పెట్టుకున్నాడు. ఓ పోల్ ఏర్పాటు చేయాలన్న విన్నపాలను అధికారులు పట్టించుకోలేదు. వీరికి చెప్పి ఇక లాభం లేదని ‘దున్నపోతు మీద వర్షం పడ్డ’ చందంగా ఉందని వాపోతూ తనే కష్టపడి ఓ కర్ర పోల్ ను ఏర్పాటు చేసుకున్నాడు. ఈ దృశ్యం కాస్త మంగళవారం మీడియా కంట్లో పడింది. రైతును దీనిపై వివరణ కోరగా విషయం పూర్తిగా తెలిపాడు. అయితే ఈయన ఏర్పాటు చేసుకున్న కర్ర పోల్ గాలి దుమారం వల్ల కింద పడే పరిస్థితులున్నాయి. అధికారులు ఇప్పటికైనా స్పందించి ఓ కరెంట్ పోల్ ను ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.