ఉపాధి కల్పనలో మహిళల భాగస్వామ్యానికి ప్రాధాన్యతనీయాలి

కేంద్ర ఆర్థిక శాఖకు సీఐఐ అభ్యర్థన

Jan 5, 2025 - 17:56
 0
ఉపాధి కల్పనలో మహిళల భాగస్వామ్యానికి ప్రాధాన్యతనీయాలి

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్​ 2025–26లో ఉపాధి కల్పన, కార్మిక సంస్కరణల అమలు, శ్రామికశక్తిలో మహిళల భాగస్వామ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) ప్రభుత్వాన్ని కోరింది. ఆదివారం సీఐఐ డైరెక్టర్​ జనరల్​ చంద్రజిత్​ బెనర్జీ ఓ ప్రకటన విడుదల చేశారు. ఉత్పాదకత, ఉపాధి కల్పనలను సమం చేయాల్సిన అవసరం ఉందన్నారు. వృద్ధి చెందుతున్న భారత్​ కు ఈ విధానం ద్వారా మరింత వృద్ధి చేకూరుతుందన్నారు. ఈ విషయంపై కమిటీని ఏర్పాటు చేయాలని కోరారు.

ఉద్యోగ కల్పనను మరింత పెంచేందుకు, కొత్త ఉపాధిని ప్రోత్సహించేందుకు సెక్షన్ 80జెజెఎఎ స్థానంలో కొత్త విభాగాన్ని పరిశ్రమల సంఘం సిఫార్సు చేసింది. ఈ ప్రతిపాదనలో కొత్త ఉద్యోగులను నియమించుకునే వ్యాపారాలకు పన్ను మినహాయింపు లభించాలని విన్నవించింది. నిర్మాణం, టెక్స్‌టైల్స్, టూరిజం, తక్కువ -నైపుణ్యం కలిగిన తయారీ వంటి కార్మిక -ఇంటెన్సివ్ రంగాలకు మద్ధతు లభిస్తుంది. దీంతో స్వేచ్ఛావాణిజ్య ఒప్పందాలు మరిన్ని జరిగే అవకాశం ఉందని బెనర్జీ తెలిపారు. అదే సమయంలో గ్రామీణ ప్రాంతాల కోసం కళాశాల విద్యావంతులైన యువతను నిమగ్నం చేసేందుకు ఇంటర్న్​ షిప్​ కార్యక్రమాన్ని పెద్ద యెత్తు ప్రారంభించాలని సూచించారు. దీంతో మహిళల ఆర్థిక సాధికార కూడా గణనీయంగా మెరుగుపడుతుందన్నారు.