నేరగాళ్లను వెనక్కు పట్టుకొస్తాం
భారత్ పోల్ ను ప్రారంభించిన కేంద్రమంత్రి అమిత్ షా
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: భారత్ నుంచి పారిపోయిన నేరగాళ్లను వెనక్కు పట్టుకొచ్చే వరకూ విశ్రమించబోమని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. మంగళవారం న్యూ ఢిల్లీలో భారత్ పోల్ పోర్టల్ ను ప్రారంభించారు. ఈ పోర్టల్ ను రూపొందించడంలో అధికారుల విశేష కృషికి అభినందనలు తెలిపారు. అనంతరం దీనికి సంబంధించిన విశిష్టతలను మీడియాకు వివరించారు. ఈ విధానం ద్వారా నేరుగా ఇంటర్ పోల్ తో అనుసంధానం అవుతామన్నారు. ఇక భారత్ లో నేరం చేసి ఆయా దేశాల్లో నక్కిన నేరస్థులను పట్టుకోవడం మరింత సులభతరంగా మారనుందన్నారు. ఈ విధానంతో ప్రపంచదేశాల్లో ఎక్కడ ఉన్నా నేరస్థులను భారత్ కు రప్పిస్తామన్నారు. ఈ విధానం ద్వారా అన్ని దర్యాప్తు సంస్థల సమాచారం ఒకే వేదికపైగా రానుందన్నారు. దీంతో సమాచారం అందజేత, ఇంటర్ పోల్ సహాయం, నేరస్థుల డేటా, పారిపోనీయకుండా పకడ్భందీ చర్యలు, వారిని తీసుకొచ్చే చర్యలు మరింత పటిష్టం అవుతాయన్నారు. తద్వారా నేరస్థులను త్వరగా భారత్ కు తీసుకువస్తామన్నారు. ఈ పోర్టల్ ద్వారా 195 దేశాలతో సమన్వయం చేసుకుంటామన్నారు. రెడ్ కార్నర్ నోటీసులు, రియల్ టైమ్ ఇంటర్ ఫేస్, ఆయా దేశాల చట్టాల తీర్పులు, వాటిపై సమీక్ష తదితరాల ద్వారా నేరస్థులను వేగంగా వెనక్కు రప్పిస్తామన్నారు. ఈ పోర్టల్ లో 19 రకాల డేటాబేస్ అందుబాటులో ఉంటుందన్నారు. డ్రగ్స్ అక్రమ రవాణా, ఆయుధాల స్మగ్లింగ్, మానవ అక్రమ రవాణా, దాడులు, ఆర్థిక, సైబర్ నేరాలు వంటి సమాచారం ఉంటుందన్నారు. దీంతో దర్యాప్తు సంస్థు మరింత చురుకుగా పనిచేస్తూ సమయభావాన్ని గణనీయంగా తగ్గించగలుగతాయన్నారు. ఈ విధానం ద్వారా భారత్ లోని అన్ని ఏజెన్సీలను ఒక నోడల్ ఏజెన్సీగా రూపొందించి అన్ని రాష్ర్టాల పోలీసులకు శిక్షణను ఇచ్చే బాధ్యతను సీబీఐకి అప్పగించారు.