విపక్షాల ఆరోపణలు తిప్పికొట్టిన సీఈసీ రాజీవ్​ కుమార్​

CEC Rajeev Kumar refuted the allegations of the opposition

Jan 7, 2025 - 16:11
 0
విపక్షాల ఆరోపణలు తిప్పికొట్టిన సీఈసీ రాజీవ్​ కుమార్​

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ఎన్నికలపై విపక్షాలు చేస్తున్న ఆరోపణలను ఎన్నికల ప్రధానాధికారి రాజీవ్​ కుమార్​ తిప్పికొట్టారు. ఈసీపై ఆరోపణల్లో అసత్య, అనుచిత వ్యాఖ్యలు సరికాదన్నారు. పార్టీలు, రాజకీయ నాయకులు, వ్యక్తులు చేస్తున్న ఆరోపణలపై అనేకసార్లు వివరణ ఇచ్చామన్నారు. అయినా పదేపదే అవే ఆరోపణలు చేయడం దురదృష్టకరమని రాజీవ్​ కుమార్​ ఆవేదన వ్యక్తం చేశారు. ఈవీఎంలను హ్యాక్​ చేయలేరని స్పష్టం చేశారు. 2019లో సుప్రీం కోర్టు ఆదేశాల నేపథ్యంలో చర్యలు చేపట్టినా ఎలాంటి లోపం లేదన్న విషయాన్ని గుర్తు చేశారు. ఏ ఎన్నికల సంఘం వద్ద ఇంత డేటా నిక్షిప్తమై లేదన్నారు. డేటా పూర్తి భద్రంగా ఉంటుందన్నారు.

సాయంత్రం 5.30 గంటల తరువాత క్యూలో నిలబడ్డ వారందరికీ ఓటువేసే అవకాశం ఉంటుందన్నారు. అదే సమయంలో ఓటింగ్​ శాతం పెరిగే అవకాశం ఉందన్నారు. ఓటింగ్​ పూర్తయ్యాక ఈవీఎంలకు సీల్​ వేస్తామన్నారు. 17 సీ ఫారమ్​ లలో ఏజెంట్ల వివరాలతో వాటికి సీల్​ వేస్తామన్నారు. ప్రతీ పోలింగ్​ స్టేషన్ లో ఉన్నతాధికారులు, ఎన్నికల అధికారుల పర్యవేక్షణ ఉంటుందన్నారు. దొంగ ఓట్లు వేయడం, రిగ్గింగ్​ లాంటి ఆరోపణలు పూర్తి అవాస్తవమే అన్నారు. కౌంటింగ్​ లో పొరపాటు జరిగితే మరోసారి ఏజెంట్లను పిలిచి లెక్కిస్తామన్నారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొత్తం అన్ని పార్టీల ఏజెంట్లు కూడా పర్యవేక్షిస్తుంటారన్నారు. అయినా ఈసీపై ఆరోపణలు చేయడం తగదన్నారు. 

ఈవీఎంలపై అనేక ఆరోపణలపై వివరించారు. 78 రోజుల ముందు ఏజెంట్లకు అన్ని వివరాలు సమర్పించబడతాయన్నారు. మాక్​ పోలింగ్​ నిర్వహిస్తామన్నారు. ఈవీఎంలను సీల్​ చేస్తామని ఎన్నికలు ముగిసిన కౌంటింగ్​ జరిగే వరకు కూడా అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య ఈవీఎంలు ఉంటాయన్నారు. ఈవీఎంలను హ్యాక్​ చేయడం, వైరస్​, బగ్​ లు ప్రవేశపెట్టడం సాధ్యపడదని సాక్షాత్తూ హైకోర్టులు, సుప్రీంకోర్టులు కూడా చెప్పాయని గుర్తు చేశారు. పేపర్​ ప్రక్రియతో ఎన్నికల ప్రక్రియ మరింత ఆలస్యం అవుతుందని రాజీవ్​ కుమార్​ అన్నారు. ప్రతీ ఓటింగ్​ కేంద్రంలో సీసీ టీవీలు, భద్రత కట్టుదిట్టంగా ఉంటుందన్నారు. ఓటర్ల జాబితాలో పేర్లు తొలగించడం, చేర్చడం వంటి ఫిర్యాదులపై స్పందిస్తూ పూర్తి జాబితా పరిశీలన అనంతరమే చేపడుతున్నామన్నారు. ఇందులో ఎలాంటి ఆరోపణలకు తావు లేదన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతీ ఒక్కరికి ప్రశ్నించే హక్కు ఉంటుందన్నారు. అలాగని ఆధారం లేని ఆరోపణలు ఈసీపై చేయవద్దన్నారు. 2020 నుంచి 30 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగాయి. దేశంలోని అనేక పార్టీలకు ఒక్కో స్థానంలో ఒక్కో విధంగా సీట్లు లభించాయన్నారు. దీన్ని బట్టి ఈసీ పనితీరు, పారదర్శకత ప్రక్రియను అంచనా వేయవచ్చని రాజీవ్​ కుమార్​ అన్నారు. దేశవ్యాప్తంగా ఓటర్లు 99 కోట్లకు పైగా ఉన్నారని తెలిపారు. ఇందులో 48 కోట్ల మంది మహిళా ఓటర్లే ఉన్నారని తెలిపారు. ఢిల్లీ ఓటర్లు నిష్పక్షపాతంగా ఓటు వేస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు.

ఎన్నికల్లో తాయిలాలు, తనిఖీలు, నగదు పంపకాలపై ఏ ఒక్కరినీ మినహాయించేది లేదన్నారు. ఎవ్వరెన్ని ఆరోపణలు చేసినా ఈసీ ఎవ్వరినీ వదలబోదన్నారు. అన్నిచోట్ల, అనుమానం ఉన్న ప్రతీ ఒక్కరి వద్ద తనిఖీలు చేస్తామన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియామావళి నిబంధనలు అమల్లో ఉన్నన్నీ రోజులు కఠినంగానే వ్యవహరిస్తామని సీఈసీ రాజీవ్​ కుమార్​ స్పష్టం చేశారు.