కెనడా ప్రధాని రేసులో అనితా ఆనంద్!
Anita Anand in the race for Prime Minister of Canada!
నా తెలంగాణ, సెంట్రల్ డెస్క్: కెనడా ప్రధాని రేసులో భారత సంతతి అనితా ఆనంద్ (57) ఉన్నారు. ఈమెకు తొలిసారిగా 2019లో మంత్రివర్గంలో లిబరల్ పార్టీ నుంచి స్థానం దక్కింది. న్యాయవాద వృత్తి, పలు విశ్వవిద్యాలయాల్లో విద్యనభ్యసించారు. లిబరల్ పార్టీ తరఫున అనేక పదవులను చేపట్టి తనదైన శైలిలో బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తూ సమస్యలను ధైర్యంగా ఎదుర్కొన్నారనే పేరును సొంతం చేసుకున్నారు. జస్టిన్ ట్రూడో రాజీనామా అనంతరం తదుపరి ప్రధాని పేరుపై చర్చలు జోరుగా సాగుతున్న నేపథ్యంలో అనితా ఆనంద్ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తుంది. ఈమెతోపాటు ప్రధాని రేసులో మాజీ ఆర్థిక మంత్రి, ఉప ప్రధాని క్రిస్టియా ఫ్రీలాండ్, లిబరల్ పార్టీ నేత మార్క్ కార్నీ, లిబరల్ పార్టీ డొమినిక్ లెబ్లాంక్, మెలనీ జోలీలు ప్రధానంగా ప్రధాని రేసులో ఉన్నారు.
అనితా ఆనంద్ తల్లి పంజాబ్, తండ్రి తమిళనాడుకు చెందినవారు. ఈమె కెనడాలో జన్మించింది. రవాణా, రక్షణ మంత్రిగా గుర్తింపు తెచ్చుకున్నారు. పలు కీలక సంస్కరణలను ధైర్యంగా చేపట్టి ప్రసిద్ధి గాంచారు. కోవిడ్ సమయంలో వ్యాక్సినేషన్ అందజేత, ఉక్రెయిన్ సంఘర్షణలను నిలుపుదల చేయాలనే ప్రయత్నాన్ని కూడా ఈమె చేశారు. దీంతో అనితా ఆనంద్ కు కూడా ప్రధాని పదవి దక్కే అవకాశం లేకపోలేదనే వాదనలున్నాయి. ఏది ఏమైనా భారతీయ సంతతి వ్యక్తి అనితా ఆనంద్ కు పీఎం పదవి దక్కితే భారత్–కెనడా మధ్య నెలకొన్న అంతర్గత విబేధాలు పూర్తిగా సమసిపోయినట్లేనని నిపుణులు భావిస్తున్నారు.