అంబేద్కర్ స్ఫూర్తితో మోదీ పాలన
– గత పదేళ్ల కాలంలో బాబా సాహెబ్ కలలు సాకారం: కిషన్ రెడ్డి – ఆయన సందర్శించిన అడిక్ మెట్ ప్రాంతం ప్రవిత్రమైనది – అంబేద్కర్ సొంత ప్రాంతాలను కేంద్రం పంచతీర్థాలుగా అభివృద్ధి చేసింది – రాజ్యాంగ నిర్మాత జయంతి వేడుకలో పాల్గొన్న కేంద్ర మంత్రి
నా తెలంగాణ, హైదరాబాద్: అంబేద్కర్ ఆశయాలకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు. దేశంలో అంబేద్కర్ స్ఫూర్తితో పేద ప్రజల శ్రేయస్సు కోసం, బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి కోసం మోదీ సర్కారు కృషి చేస్తోందని తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఆయన అడిక్ మెట్ లో అంబేద్కర్ సందర్శించిన లలితనగర్ లో నిర్వహించిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. దేశంలో విద్య, కనీస వసతులు, హక్కుల విషయంలో అంబేద్కర్ నిరంతరం పోరాటం చేశారని గుర్తు చేశారు. దేశంలో అనేక ప్రాంతాలను సందరిస్తూ.. అంబేద్కర్1943లో హైదరాబాద్ నగరానికి విచ్చేసి మూడు బస్తీల్లో పర్యటించారన్నారు. అందులో భాగంగానే అడిక్ మెట్ లోని లలితానగర్ కు అంబేద్కర్ రావడం అంటే ఇక్కడివారికి సంతోషకరమైన విషయమన్నారు. స్వాతంత్ర్యోద్యమం జరుగుతున్న సమయంలో ఉస్మానియా యూనివర్సిటీ, మొజంజాహీ మార్కెట్ లో పర్యటించి అనేక విషయాలపై చర్చించి ప్రజలను చైతన్యం చేశారన్నారు. పేదవాళ్లలో అతిపేదవాళ్లకు ప్రభుత్వ పథకాలు, సంక్షేమ ఫలాలు అందేలా పనిచేయాలని అంబేద్కర్ చెప్పిన మాటలను కేంద్రమంత్రి గుర్తు చేశారు.
ఆయన ఆలోచన విధానాలను..
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గత పది సంవత్సరాల నుంచి నిర్విరామంగా పేదల కోసం కృషి చేస్తున్నదని కిషన్ రెడ్డి తెలిపారు. ఫలితంగానే బాబా సాహెబ్ కలల సాకారం అవుతున్నాయన్నారు. అంబేద్కర్ ఆశయాల సాకారం కోసం మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. అంబేద్కర్ ఆలోచన విధానాలను మోదీ ప్రభుత్వం అమలు పరుస్తోందని తెలిపారు. అన్ని రంగాల్లో దళితులకు, ఆదివాసులకు, బలహీన వర్గాలకు మోదీ ప్రభుత్వం సముచిత స్థానం కల్పిస్తూ వస్తున్నదన్నారు. ‘సబ్ కా సాత్ సబ్ కా వికాస్’ అనే నినాదంతో మోదీ అన్ని వర్గాలకు న్యాయం చేస్తున్నదన్నారు.75 సంవత్సరాల స్వతంత్ర దేశంలో మొదటి సారి ఆదివాసీ మహిళను రాష్ట్రపతి చేసింది మోదీ ప్రభుత్వమేనని గుర్తు చేశారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన పర్యటించిన అడిక్ మెట్ లోని లలితనగర్ ప్రాంతానికి వచ్చి ఆ మహనీయుడికి నివాళులర్పించే కార్యక్రమంలో భాగస్వామ్యం కావడం ఆనందంగా ఉందని వివరించారు. డాక్టర్ అంబేద్కర్ జీవితంగా ముడిపడిన చారిత్రాత్మక స్థలాలను భారత ప్రభుత్వం పంచతీర్థాలుగా ప్రకటించి అభివృద్ధి చేసిందన్నారు