మహారాష్ర్టలో సీఎం ప్రచారం
ఆరు గ్యారంటీలపై నోరెళ్లబెడుతున్న ప్రజలు
రెచ్చగొట్టే ప్రసంగాలు
నిరుద్యోగులపై నిర్లక్ష్యమే
రైతులను నిలువునా ముంచుతున్నారు
నా తెలంగాణ, హైదరాబాద్: తెలంగాణ ప్రజలకు ఉత్తుత్తి హామీలు, కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలంగాణ నుంచి మూటలుగా ఈ ప్రభుత్వం పాలన కొనసాగుతుందని తెలంగాణ రాష్ర్ట బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు ఇతర రాష్ర్టాల ఎన్నికల ప్రచారాల్లోకి ఏకంగా సీఎం వెళ్లి హామీలన్నీ అమలవుతున్నాయని చెప్పడం ఆయన అబద్ధపు పాలనకు నిదర్శనాలని విమర్శించారు. రాహుల్, రేవంత్ ల పాలనకు ఆహా, ఓహో అంటూ కాంగ్రెస్ నేతలు వత్తాసు పలకడం మరింత విడ్డూరంగా ఉందన్నారు. రాహుల్ పొగడ్తలకు రేవంత్ జబ్బలు చరుచుకుంటున్నారని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ కేసీఆర్ అడుగు జాడల్లోనే సీఎం రేవంత్ కూడా నడుస్తున్నారని ఆరోపించారు. ఆరు గ్యారంటీలపై కేవలం తెలంగాణ ప్రజలే గాక దేశ వ్యాప్త ప్రజలు కూడా రేవంత్ మాటలను గమనించి నోరెళ్లబెట్టుకున్నారని విమర్శించారు.
అబద్ధ ప్రచారాలు..
శుక్రవారం బేగంపేటలోని టూరిజం ప్లాజాలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఏ రాష్ర్టంలోనూ ఇచ్చిన గ్యారంటీలు, హామీల అమలు ఊసే లేదన్నారు. రెచ్చగొట్టే ప్రసంగాలు, అబద్ధాలు, దోపిడీ, తెలంగాణ సమాజాన్ని అవమానించేలా రేవంత్ రెడ్డి వ్యవహారం ఉండడం సిగ్గుచేటని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. ఏం మొహం పెట్టుకొని మహారాష్ర్టలో ప్రచారం చేస్తూ ఇన్ని అబద్ధాలాడుతున్నారని నిలదీశారు.
నిరుద్యోగుల ఆందోళనలు కనిపించడం లేదా?..
నిరుద్యోగులు నోటిఫికేషన్లు, జాబ్ క్యాలెండర్ కోసం ఆందోళన చేస్తుంటే కనిపించడం లేదా? అని నిలదీశారు. ఒక్కరికి ఉద్యోగం ఇవ్వకుండా గతంలో జరిగిన పరీక్షల్లో ఉత్తీర్ణులై నియామక పత్రాలు అందుకున్న వారిని ఉద్యోగాల్లో చేర్చుకొని వాటిని తమ ఖాతాల్లో కలిపేసుకుంటున్నారని ఆరోపించారు.
కేంద్రం ఇస్తుంటే రాష్ర్టం తాత్సారం ఎందుకు?..
ధాన్యం కొనుగోలుపై రైతన్నల గగ్గోలు కనిపించడం లేదా అని నిలదీశారు. ఓ వైపు కేంద్రం మొత్తం భరిస్తున్నా, రాష్ర్ట ప్రభుత్వం ఎందుకు ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో తాత్సారం చేస్తుందని నిలదీశారు. రైతు రూ. 2 లక్షల రుణమాఫీ, కౌలు రైతులకు రూ. 15వేలు, రైతు కూలీలకు రూ. 12వేలు, రైతులకు రైతు భరోసా, ధాన్యానికి బోనస్ అంటూ మోసం చేశారే తప్ప ఏ ఒక్క హామీని నిలబెట్టుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పాలనలో అడుగడుగునా రైతన్నలను మోసం చేశారన్నారు.
పోలీసు వ్యవస్థా నిర్వీర్యం..
పోలీసు వ్యవస్థను కూడా పూర్తిగా నిర్వీర్యం చేశారని ఆరోపించారు. గతంలో బీఆర్ఎస్ కేసీఆర్, ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డిలు ఇద్దరూ కలిసి పోలీసు వ్యవస్థను తమ కనుసైగలతో ఆడిస్తున్నారని ఆరోపించారు. శాంతిభద్రతల పర్యవేక్షణలో పూర్తిగా విఫలమయ్యారని మండిపడ్డారు. హిందువులను రెచ్చగొట్టే విధంగా దేవాలయాలపై దాడులు జరుగుతుంటే ప్రభుత్వం, పొలీసులు తిరిగి దాడులు చేసిన వారి మీద గాకుండా ఆందోళన చేసిన హిందువుల మీద హత్యానేరాల కింద కేసులు నమోదు చేయడం ఏంటని నిలదీశారు. ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్, రాహుల్ గాంధీ ఆదేశాలతో పోలీసుల బదిలీలు కూడా జరుగుతున్నాయని కేంద్రమంతి కిషన్ రెడ్డి ఆరోపించారు.
పూర్తిగా దిగజారిన ప్రభుత్వ ప్రతిష్ఠ..
భూసేకరణ చేపట్టకుండా సీఎం సొంత నియోజకవర్గం కొడంగల్ ఫార్మాసిటీకి భూ సేకరణలో రైతులపై కేసులు పెట్టి జైలుకు పంపించడంతో ప్రభుత్వ ప్రతిష్ఠ పూర్తిగా దిగజారిందన్నారు. తెలంగాణలోని ప్రజలపై రూ. 8 లక్షల అప్పుల భారం ఉందన్నారు. అనాలోచిత చర్యలతో రియల్ రంగాన్ని పూర్తిగా కుదేల్ చేశారని ఆరోపించారు. వ్యాపార, వాణిజ్య రంగాల విశ్వాసాన్ని పోగొట్టుకునేలా చేశారని విమర్శించారు. దీంతో తెలంగాణకు పెట్టుబడులు వచ్చే పరిస్థితి లేదన్నారు.
బీఆర్ఎస్, కాంగ్రెస్ ఇద్దరి డీఎన్ఎలు ఒక్కటే..
బీఆర్ ఎస్, కాంగ్రెస్ ఇద్దరి డీఎన్ ఎలు ఒకటేనని ఒకరిపై ఒకరు డూప్ ఫైటింగ్ పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టించడమే వారికి పరిపాటిగా మారిందన్నారు. పెన్షన్ల పెంపు లేక వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు ఎదురుచూపులు తప్పడం లేదన్నారు. ప్రస్తుతం ఉన్న పెన్షన్లకే డబ్బులు లేవని ఆరోపించారు. మూసీని కొబ్బరినీళ్లలా మారుస్తామన్న కేసీఆర్ ఏమీ చేయకుండానే వెళ్లారని, ప్రస్తుతం రేవంత్ మూసీ ప్రక్షాళన పేరుతో పేదల ఇళ్లు కూల్చడం, నల్లగొండలో రైతులను రెచ్చగొట్టడం తప్ప చేసిందేమీ లేదన్నారు. ఇళ్లు కూల్చొద్దని వేడుకుంటే బుల్‌డోజర్లతో తొక్కిస్తారా అని మండిపడ్డారు. మూసీ నిద్దుర సీఎం రేవంత్ సవాల్ కు తాను సిద్ధమేనని అన్నారు. మూడు నెలలపాటు నిద్రపోయేందుకు తాను సిద్ధంగా ఉన్నానని మరోమారు కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి సవాల్ విసిరారు.