వడ్డీలు కట్టేందుకే మళ్లీ అప్పులు చేస్తున్నం

ఇచ్చిన హామీల మేరకు వాస్తవ బడ్జెట్‌ రూపొందించాం. అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

Feb 16, 2024 - 14:46
 0
వడ్డీలు కట్టేందుకే మళ్లీ అప్పులు చేస్తున్నం

నా తెలంగాణ, హైదరాబాద్‌: ఆరు గ్యారంటీలకు బడ్జెట్‌లో రూ.53 వేల కోట్లు కేటాయించామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఓటాన్‌ ఎకౌంట్‌ బడ్జెట్‌పై చర్చ సందర్భంగా అసెంబ్లీలో ఆయన సమాధానమిచ్చారు. రాష్ట్రంపై మొత్తం రూ.7.11లక్షల కోట్ల అప్పుల భారం ఉందన్నారు. ఇప్పటికే చేసిన అప్పులకు వడ్డీలు కట్టేందుకు మళ్లీ అప్పులు చేయక తప్పట్లేదన్నారు. ఎఫ్‌ఆర్‌బీఎం పరిధి మేరకు రుణాలు తీసుకుని ముందుకెళ్తామని స్పష్టం చేశారు. ‘‘రైతుభరోసా కోసం బడ్జెట్‌లో రూ.15,075 కోట్లు, ఇందిరమ్మ ఇళ్ల కోసం రూ.7,740 కోట్లు కేటాయించాం. నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇళ్లు నిర్మిస్తాం. ‘గృహజ్యోతి’ కింద ఉచిత విద్యుత్‌ కోసం రూ.2418 కోట్లు, రూ.500కు గ్యాస్‌ సిలిండర్‌ కోసం రూ.723 కోట్లు, సాంఘిక సంక్షేమం కోసం రూ.5,815 కోట్లు, గిరిజన సంక్షేమం కోసం రూ.2,800 కోట్లు, పంచాయతీరాజ్‌శాఖ కోసం రూ.40వేల కోట్లు కేటాయించాం. బడ్జెట్‌, బడ్జెట్‌ యేతర రుణాలను ఎఫ్‌ఆర్‌బీఎం కింద చూస్తామని కేంద్రం చెప్పింది. సామాజిక సమానత్వంలో భాగంగా బడ్జెట్‌లో కేటాయింపులు చేశాం. తెలంగాణలో ఆర్థిక, సామాజిక అసమానతలు ఉన్నాయి. అసమానతలు తొలగించేందుకు కృషి చేశాం. గతంలో కేటాయింపులకు నిధులు అందని పరిస్థితి. పథకాలు, హామీల మేరకు వాస్తవ బడ్జెట్‌ రూపొందించాం. గతంలో ఏటా 20శాతం పెంచుకుంటూ పోయారు. గత ప్రభుత్వం వాస్తవాలకు దూరంగా బడ్జెట్‌ ప్రవేశ పెట్టింది.

యువత కలల సాకారం..

పదేళ్లుగా గ్రూప్-1 ఉద్యోగాల కోసం యువత ఎదురుచూసింది. టీఎస్‌పీఎస్సీని ప్రక్షాళన చేసి అదనపు సిబ్బందిని ఇచ్చాం. ఇప్పటికే రూ.40కోట్లు మంజూరు చేశాం. గ్రూప్‌-1లో 503 పోస్టులకు అదనంగా 64 పోస్టులు మంజూరు చేశాం. పోలీసు నియామక సంస్థ ద్వారా 13,444 పోస్టుల భర్తీ పూర్తి చేశాం. యువత కలల సాకారం కోసం ప్రభుత్వం కృషి చేస్తోంది’’ అని భట్టి విక్రమార్క తెలిపారు.