రామాలయ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తారా?
కాంగ్రెస్, కూటమిపై మండిపాటు ఆలయానికి వస్తే ఆరేళ్లపాటు బహిష్కరిస్తారా? యూపీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
లక్నో: రామలయ నిర్మాణ వ్యతిరేక పార్టీ కాంగ్రెస్, ఇండి కూటమి అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఉత్తరప్రదేశ్ పీలిబీత్ లో జరిగిన ఎన్నికల సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం ప్రసంగిస్తూ కాంగ్రెస్ పై విమర్శ బాణాలు ఎక్కు పెట్టారు. రామాలయానికి వ్యతిరేకంగా కాంగ్రెస్, కూటమి పార్టీలను దేశ ప్రజలు ఎన్నటికీ క్షమించబోరని చెప్పారు. దేశంలోనే గొప్ప ఆలయ నిర్మాణం అయోధ్య అన్నారు. రాముని ప్రాణప్రతిష్ఠ చూసేందుకు ఓ వైపు దేశంలోని ప్రజలంతా పోటీ పడుతుంటే మరోవైపు ప్రతిపక్ష పార్టీలకు ఆహ్వానాలు పలికినా రాకపోవడం వారి అవివేకానికి నిదర్శనమన్నారు. రాముడిని అవమానించారని దుయ్యబట్టారు. ప్రాణప్రతిష్ఠకు ఓ నాయకుడు వస్తే అతన్నీ ఆరేళ్ల పాటు కాంగ్రెస్ బహిష్కరించిందని గుర్తు చేశారు.
దేశాన్ని తలవంచనీయం..
దేశాన్ని తలవంచనీయకూడదనే గొప్ప సంకల్పంతో దేశ ప్రజలతో కలిసి తాము పనిచేస్తున్నామని తెలిపారు. మరోవైపు కాంగ్రెస్ ముందు దేశాన్ని తలవంచనీయాలనే కుట్రతో ఉందని మండిపడ్డారు. ఇలాంటి నాయకుల వల్ల దేశ, విదేశాల్లో భారత కీర్తి ప్రతిష్ఠలకు భంగం వాటిల్లుతుందని తెలిపారు. మరోవైపు హిందువుల ఓట్లను అభ్యర్థిస్తూ మేనిఫెస్టో పేరుతో మభ్యపెడుతోందన్నారు. ఈ విషయాన్ని ప్రజలు గుర్తుంచుకొని సరైన సమయంలో సమాధానం చెప్పాలన్నారు. దేశాన్ని విభజించే కుట్రతో కాంగ్రెస్, కూటమి పార్టీలు ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తమది రైతు సంక్షేమ ప్రభుత్వం..
దేశంలోని చెరకు రైతుల కష్టాలను పూర్తిగా రూపుమాపగలిగామని ప్రధాని మోదీ అన్నారు. చెరకుతో ఇథనాల్ ను తయారు చేసే నూతన విధానం వల్ల ఆ రైతులకు మరిన్ని లాభాలు చేకూరుతాయని తెలిపారు. తమది రైతు సంక్షేమ ప్రభుత్వమని పునరుద్ఘాటించారు. కాంగ్రెస్ పాలనలో రైతులు తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యాని గుర్తు చేశారు. యూరియా బ్లాక్ మార్కెట్ కు తరలించేవారని పేర్కొన్నారు. యూరియా అందించమని రైతులు డిమాండ్ చేస్తే వారిపై విచక్షణా రహితంగా లాఠీచార్జీలు చేశారని తెలిపారు. రూ. 3000కు బస్తా దొరకడం కూడా గగనమైపోయిందన్నారు. కానీ నేటి బీజేపీ ప్రభుత్వం రూ. 300లకే రైతులకు యూరియా బస్తాలను అందజేస్తుందని వివరించారు. పిలిభిత్ రైతుల బ్యాంకు ఖాతాల్లోకే రూ. 850 కోట్లు చేరాయని ప్రధాని మోదీ తెలిపారు.
భారత్కు సాధ్యం కానిది ఏదీ లేదు..
ప్రపంచం మొత్తం కష్టాల మధ్య కొట్టుమిట్టాడుతోందన్నారు. భారతకు మాత్రం సాధ్యం కానిది ఏదీ లేదని సత్తా చాటుకుంటోందని కొనియాడారు. కరోనా లాంటి కీలక సమయంలో కూడా వ్యాక్సిన్లు, మందులను అందించి ప్రపంచదేశాలకు ఆదుకుందని మోదీ తెలిపారు. ప్రపంచంలో ఎక్కడ సంక్షోభం ఏర్పడ్డ భారత్ ఆపన్నహస్తం అందించేందుకు వసుదైక కుటుంబం నినాదంతో ముందుకు పోతోందని తెలిపారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ప్రపంచదేశాల్లో భారత్ ను చేతగానీ దేశంలో చూపెట్టాలని తహతహలాడుతోందని మండిపడ్డారు. వారి చర్యలను ఉపేక్షించబోమని ప్రధాని స్పష్టం చేశారు.
ఓటే బలమైన శక్తి..
ప్రపంచంలోనే బలమైన శక్తి ఓటు అని తెలిపారు. ఓటు ద్వారా నీతి నిజాయితీ దేశ సంక్షేమానికి పాటుపడే వ్యక్తిని ఎన్నుకోవాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. అప్పుడే దేశాభివృద్ధి, సంక్షేమం సాధ్యమని తెలిపారు.
జాబిలిపై త్రివర్ణం రెపరెపలు..
చంద్రుడిపై కూడా త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించిన ఘనత భారత్ దే అన్నారు. మన వైజ్ఞానికుల కష్టాన్ని, శ్రమను కొనియాడారు. భారత్ లో జీ–20 నిర్వహణ అభినందనీయమని, సంతోషించదగ్గ విషయమని తెలిపారు.