చీకట్లో దేశాన్ని దోచుకుంటారా?

నోరు తీపి చేసుకుందాం మనేర్​ లడ్డూలు తిందాం జూన్​ 4న సిద్ధం కావాలి

May 25, 2024 - 13:00
 0
చీకట్లో దేశాన్ని దోచుకుంటారా?
  • దళితుల ఓట్లతో లబ్ధి పొందాలని విపక్షాల కుట్రలు
  • మత ప్రాతిపదిక రిజర్వేషన్లకు వ్యతిరేకం
  • వారిని మళ్లీ బానిసలుగా చేసే కుట్ర
  • దేశ కీర్తి, ప్రతిష్ఠలు ఇనుమడింప చేశాం
  • పాటలీపుత్ర ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మోదీ

పాట్నా: విపక్షాలు చీకట్లో దేశాన్ని దోచుకునేందుకు కుయుక్తులు పన్నాయని ప్రధాని పేర్కొన్నారు. జూన్​ 4న మనేర్​ లడ్డూలు తింటానని, మీరందరూ కూడా ఈ లడ్డూలు తినేందుకు సిద్ధంగా ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాక నోరు తీపి చేసుకుందామన్నారు. దళిత ఓటు బ్యాంకును తమకు అనుకూలంగా మలచుకొని వారిని దెబ్బతీయాలని, వారికి నష్టం చేకూర్చాలని కాంగ్రెస్​, కూటమి పార్టీలు కుట్రలు పన్నాయని ప్రధాని మోదీ అన్నారు. 

శనివారం బిహార్​ లోని పాటలీపుత్రలో నిర్వహించిన ఎన్నికల బహిరంగ సభలో ప్రసంగించారు. బిహార్​ ను ఈ విపక్ష పార్టీలు తీవ్ర అగాధంలోకి, అంధకారంలోకి నెట్టాయన్నారు. కానీ ఎన్డీయే ప్రభుత్వం వచ్చాక బిహార్​ ను అభివృద్ధి ట్రాక్​ లో తీసుకొచ్చిందని పేర్కొన్నారు. రానున్న ఐదేళ్లలో బిహార్​ కు మంచి రోజులు రాబోతున్నాయని తెలిపారు. దేశ విచ్ఛిన్న పార్టీలు ప్రజలను మభ్య పెడుతూ లబ్ధి పొందాలని కుట్రలు పన్నుతున్నాయన్నారు. ఇందుకోసం తమను దూషించే పనిని నెత్తికెత్తుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

రాముడిపై వ్యతిరేకత ఉన్న పార్టీలు దేశాన్ని ఏం ఉద్ధరిస్తాయని ప్రశ్నించారు. రిజర్వేషన్ల పేరు చెబుతూ దళితులకు నష్టం వాటిల్లే చర్యలకు పాల్పడుతున్నాయన్నది అందరూ గుర్తెరగాలన్నారు. ఎస్సీ,ఎస్టీ,ఓబీసీ వర్గాలకు నష్టం చేకూరనీయనని పునరుద్ఘాటించారు.  ఎట్టి పరిస్థితుల్లోనూ మత ప్రాతిపదికన రిజర్వేషన్లను కల్పించమన్నారు. వీరిని కాంగ్రెస్​, కూటమి పార్టీలు బానిసలుగా చేయాలని చూస్తున్నాయని విమర్శించారు. 

ఆర్జేడీ, కాంగ్రెస్​ పార్టీలు యాదవ, కుర్మీ, కుష్వాహా, కల్వార్​, తెలి, సూరి, కాను, నిషాద్​, పాశ్వాన్​, రవిదాస్​, ముసాహర్​ కుటుంబాల హక్కులను దోచుకున్నాయని తెలిపారు. వారి హక్కులను వారికి కల్పించి తీరుతామని మోదీ స్పష్టం చేశారు. చీకట్లో ఈ దొంగలు దేశాన్ని దోచుకోవాలని, దేశ ప్రజలను దోచుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఇంతపెద్ద నిర్ణయాన్ని ఎవ్వరితో సంప్రదించకుండా ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. బాబా సాహేబ్​ అంబేద్కర్​ రాసిన రాజ్యాంగాన్నే అవమానిస్తారా? అని ప్రశ్నించారు. ఆర్జేడీ, కాంగ్రెస్​ లు జిహాదీలకు మద్దతునీయడం శోచనీయమని ప్రధాని మోదీ అన్నారు.
 
ఈ పార్టీలు ఐదేళ్లలో దేశానికి ఐదుగురు ప్రధానులను చేయాలని పగటి కలలు కంటున్నాయని విమర్శించారు. ఎస్పీ, టీఎంసీ, ఆప్​, కాంగ్రెస్​, ఆర్జేడీలు ముందువరుసలో ఉన్నాయన్నారు. ఈ పార్టీలు మతతత్వం, కులతత్వం, కుటుంబ రాజకీయాలకు కేరాఫ్​ లుగా ఉంటాయని పేర్కొన్నారు. వీటితో జాగ్రత్తగా ఉండాలన్నారు. ఇలాంటి వారు దేశానికి, బిహార్​ కు ఏమైనా మేలు చేయగలరా? అని ప్రశ్నించారు. అవినీతి, అక్రమాల్లో ఈ పార్టీలను మించిన వారు లేరన్నారు. జైలుకు వెళ్లి బెయిల్​ పై వచ్చినా వీరి బుద్ధి మారడం లేదని అన్నారు. 

గత పదేళ్లలో దేశ కీర్తి ప్రతిష్ఠలు ఎక్కడి నుంచి ఎక్కడకు తీసుకువెళ్లామో ప్రతీ ఒక్కరూ గమనించాలన్నారు. ప్రపంచవ్యాప్తంగా భారత్​ పేరు మారుమోగిపోయేలా చేశామన్నారు. ధైర్యంతో నిర్ణయాలు తీసుకుంటున్నామన్నారు. సుందర, అభివృద్ధి భారత నిర్మాణం కోసం మోదీ పనిచేస్తున్నారని తెలిపారు. శత్రుదేశాలకు కూడా దడపుట్టేలా చేయగలిగామన్నారు. సూదుర గ్రామాల్లో కూడా నీరు, విద్యుత్​, గ్యాస్​, విద్య, వైద్యం అన్ని రకాల మౌలిక సదుపాయాలను కల్పించామని ప్రధాని మోదీ అన్నారు. 60 ఏళ్లుగా ఈ పార్టీలు అధికారంలో ఉండి దేశానికి, బిహార్​ ను చీకట్లో ఉంచాయన్నారు. వీరు అభివృద్ధిని ఎందుకు చేపట్టలేకపోయారని ప్రధాని మోదీ ప్రశ్నించారు.