23వరకు కవితకు రిమాండ్
మధ్యం కుంభకోణంలో ఎమ్మెల్సీ కవిత కు జ్యుడీషియల్ రిమాండ్ ను కోర్టు పొడిగించింది.
న్యూఢిల్లీ: మధ్యం కుంభకోణంలో ఎమ్మెల్సీ కవిత కు జ్యుడీషియల్ రిమాండ్ ను కోర్టు పొడిగించింది. కస్టడీ మంగళవారంతో పూర్తి కావడంతో ఉదయం తీహార్ జైలు అధికారులు రౌస్ అవెన్యూ కోర్టులో కవితను హాజరుపరిచారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు కవితకు ఈ నెల 23వ తేదీ వరకు రిమాండ్ ను పొడిగిస్తూ నిర్ణయం వెలువరించింది. అధికారులు ఎమ్మెల్సీని తీహార్ జైలుకు తరలించారు. కాగా కవిత బయట ఉంటే సాక్ష్యాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని ఈడీ తరఫు న్యాయవాదులు కోర్టులో వాదించారు. ఇంకా దర్యాప్తు కొనసాగుతోందన్నారు. ఈడీ లాయర్ల వాదనతో ఏకీభవించిన కోర్టు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.మరోవైపు కవిత తరఫు న్యాయవాది మాట్లాడుతూ.. 2022 నుంచి దర్యాప్తు కొనసాగుతోందని కేసు దర్యాప్తులో ఎలాంటి ఆటంకాలు లేవన్నారు. కాగా కోర్టులో ఎమ్మెల్సీ మాట్లాడేందుకు అనుమతించాలని న్యాయవాది కోర్టుకు విన్నవించారు. మాట్లాడేందుకు నిరాకరిస్తూ అప్లికేషన్ దాఖలు చేసుకోవాలన్నారు. కోర్టులో భర్త, మామను కలిసేందుకు అవకాశం ఇవ్వాలని కోర్టుకు విన్నవించారు. కోర్టు అందుకు అనుమతిచ్చింది.
కవిత లేఖ..
మరోవైపు జైలు నుంచి కవిత లేఖ రాశారు. మద్యం కుంభకోణంలో తన పాత్ర లేకున్నా ఈడీ తనను అరెస్టు చేసి వేధిస్తోందని ఆరోపించారు. సుప్రీంలో కఠిన చర్యలు తీసుకోబోమని చెప్పి అరెస్టు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రతిపక్ష నేతలపైనే కేసులు నమోదు చేస్తూ తమ దారికి తెచ్చుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. తమకు న్యాయవ్యవస్థ ఉపశమనం కలిగిస్తున్నట్లు భావిస్తున్నామని పేర్కొన్నారు. తన కుమారుడు పరీక్షలకు సిద్ధపడుతున్న సమయంలో తల్లి అరెస్టు చేయడం దారుణమన్నారు. దీంతో తన కుమారుడి విద్యపై వ్యతిరేక ప్రభావం పడే అవకాశం ఉందని లేఖలో ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు.తన బెయిల్ అభ్యర్థనను మరోమారు పరిశీలించాలని కోర్టుకు లేఖలో విజ్ఞప్తి చేశారు.