సిక్కిం మేనిఫెస్టో విడుదల

ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధే లక్ష్యం ఎన్నికల ప్రచార సభలో బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ. నడ్డా

Apr 11, 2024 - 18:08
 0
సిక్కిం మేనిఫెస్టో విడుదల

గ్యాంగ్ టక్​: సిక్కిం అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ మేనిఫెస్టో విడుదల చేసింది. ఈ మేనిఫెస్టోలో ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి ప్రధాని నిరంతరం చేస్తున్న కృషిని వివరిస్తూ దేశంలోని ప్రతి మూలకు కనెక్టివిటీ ఉండాలనేది ఆయన విజన్ గా పేర్కొన్నారు. సిక్కిం రాజధాని గ్యాంగ్‌టక్‌లో పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా గురువారం బీజేపీ మేనిఫెస్టోను విడుదల చేశారు. మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలో బీజేపీ ఇన్‌ఛార్జ్ దిలీప్ జైస్వాల్, సిక్కిం అధ్యక్షుడు డాక్టర్ థాపా, ఇతర నాయకులున్నారు.

ఈ సందర్భంగా జేపీ నడ్డా మాట్లాడుతూ గత 10 ఏళ్లలో సిక్కింలో వచ్చిన మార్పులను ప్రజలు చూశారని తెలిపారు. సిక్కింలోని 32 అసెంబ్లీ, ఒక లోక్‌సభ స్థానానికి ఏప్రిల్ 19న ఎన్నికలు జరగనున్నాయని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో అభివృద్ధి విజన్​ తో ముందుకు వెళుతున్న నరేంద్ర మోదీ ప్రభుత్వాన్నే ఎన్నుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈశాన్య  రాష్ట్రాల అభివృద్ధికి ప్రధాని రూ. 5 లక్షల కోట్లను ఇచ్చారని తెలిపారు. గత ప్రభుత్వం ఈశాన్య రాష్ట్రాలను పట్టించుకున్న పాపాన పోలేదని మండిపడ్డారు. సిక్కింలో దాదాపు రూ.55 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రధాని ప్రారంభించి, శంకుస్థాపన చేశారని తెలిపారు. 

సిక్కిం ప్రజలు ఇక ప్రాంతీయ పార్టీలకు గుడ్​ బై చెప్పే సమయం ఆసన్నమైందని తెలిపారు. పర్వత రాష్ట్రాలలో కమలం వికసింప చేయాలని విజ్ఞప్తి చేశారు. 

మేనిఫెస్టోలోని ప్రధానాంశాలు..

–  ఆర్టికల్ 371 ఎఫ్ స్ఫూర్తిని, అంశాలను కాపాడుకోవడం. సిక్కింలో నివసించే ఏ పౌరుడైనా భారతీయ పౌరుడిగా గుర్తింపునీయడం.  1961 రిజిస్టర్‌లో నమోదైన వ్యక్తులకు కూడా సిక్కిం అసలు నివాసితులతో సమానమైన ప్రయోజనాలు అందించడం. 

–  కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో ప్రపంచ స్థాయి మేనేజ్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్, ఐఐఎం ఏర్పాటు. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్‌ నిర్మాణం. 

– రాష్ట్రంలోని యువతకు సాధికారత కల్పించేందుకు, పర్యాటక రంగానికి ప్రోత్సాహం. రాష్ట్రంలో హోటల్ మేనేజ్‌మెంట్ ఇనిస్టిట్యూట్‌ నిర్మాణం.

–  పీఎం కిసాన్ యోజన కింద రైతులకు ఏడాదికి రూ.9,000, ప్రస్తుతం ఏటా రూ.6,000 సాయం అందించటం. 

– వ్యవసాయ ఆధారిత మౌలిక సదుపాయాల కల్పన కోసం బీజేపీ రూ. 500 కోట్ల నిధి ఏర్పాటు. వ్యవసాయాధారిత మౌలిక సదుపాయాలు సృష్టించడం, రైతులకు ప్రయోజనం చేకూర్చడం. 

– సిక్కింలో రీజినల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ మెడికల్ సైన్సెస్‌ ఏర్పాటు. రాష్ట్రంలో 15 వేల ల‌క్పతీ దీదీల సృష్టి లక్ష్యం. 

– వచ్చే ఐదేళ్లలో సిక్కింలో మహిళలు, యువతకు 25 వేల ఉద్యోగాల కల్పన. అమ్మ క్యాంటీన్లను మహిళలే నిర్వహించే ఏర్పాట్లు, తక్కువ ధరకే ఆహారం అందజేతపై చర్యలు. 

– సిక్కిం గతిశక్తి మాస్టర్ ప్లాన్ కింద, బహుళ-మోడల్ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం. ఏడు రోడ్‌వేలు, రైల్వేలు, విమాన కనెక్టివిటీని మెరుగుపరచడాలని బీజేపీ తన మేనిఫెస్టోలో పొందుపరిచింది.