భైరవ ద్వీపం 30 సంవత్సరాలు పూర్తి
బాలకృష్ణ కెరీర్ లో బాహుబలి
మన టాలీవుడ్ లో కొన్ని సినిమాలను ఎప్పటికీ మరచిపోలేము, మన చిన్నతనం లో చూసిన ఆ సినిమాలు మన మదిలో ఎప్పటికీ చెరిగిపోని ముద్రలు వేస్తుంటాయి.
అలాంటి సినిమాలలో ఒకటి నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన భైరవ ద్వీపం. 1994 ఏప్రిల్ 14న విడుదలైన ఈ మూవీ అంచనాలను మ్యాచ్ చేస్తూ సూపర్ హిట్ అయ్యింది.
బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది.ప్రేక్షకులకి ఈ మూవీ కొత్త అనుభూతిని అందించి ప్రశంసలు అందుకుంది. అలనాటి మేటి జానపద చిత్ర రాజం ‘పాతాళ భైరవి’(1951) స్పూర్తితో రూపుదిద్దుకున్న ఈ కమనీయ, రమణీయ దృశ్యకావ్యాన్ని చందమామ విజయా కంబైన్స్ పతాకంపై బి.వెంకటరామిరెడ్డి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించారు.
నందుల వెల్లువ
9 విభాగాల్లో ఈ మూవీ నంది అవార్డు పురస్కారాలను కూడా అందుకుంది. బాలకృష్ణ కి జోడీగా రోజా నటించగా.. బాలయ్యకి తల్లిగా కేఆర్ విజయ నటించారు. విజయ్ కుమార్, కైకాల సత్యనారాయణ, సంగీత, విజయ రంగ రాజు, శుభలేఖ సుధాకర్, గిరిబాబు, బాబూ మోహన్, మిక్కిలినేని, సుత్తి వేలు, కోవై సరళ, వినోద్, పద్మనాభం వంటి వారు ఈ మూవీలో కీలక పాత్రలు పోషించారు. రంభ, రవళి స్పెషల్ సాంగ్స్ లో మెరిశారు. అంతా బానే ఉంది కానీ.. ఈ మూవీ విడుదల రోజున పెద్ద రచ్చ జరిగిందట. విషయం ఏంటంటే ఈ మూవీ క్లైమాక్స్ లో బాలయ్య వింత అవతారంలో కనిపిస్తారు. శాపానికి గురవ్వడం వలన ఆయన పాత్రకి ఆ రూపం వచ్చినట్టు చూపిస్తారు. కానీ బాలయ్య ఫ్యాన్స్ ఆ గెటప్ ను జీర్ణించుకోలేకపోయారు. థియేటర్ల లో కుర్చీలు విరగొట్టి.. షోలు ప్రదర్శించకుండా అడ్డుపడ్డారు.అయితే తర్వాత రోజు దర్శకనిర్మాతలు ప్రత్యేక ఇంటర్వ్యూ పెట్టి.. దానికి వివరణ ఇచ్చి అభిమానులకి క్షమాపణల్ని తెలియజేసారు. ఆదివారంతో ఈ చిత్రం విడుదలై 30 వసంతాలు పూర్తిచేసుకుంది.
బాలయ్య కెరీర్ లోనే సుపర్ హిట్
బాలయ్య కెరీర్ లో ఎన్నో మాస్ హిట్స్ ఉండొచ్చు, ఎన్నో ఇండస్ట్రీ హిట్స్ ఉండొచ్చు, రాబొయ్యే రోజుల్లో ఆయన ఇండస్ట్రీ ని షేక్ చెయ్యొచ్చు.కానీ భైరవ ద్వీపం లాంటి క్లాసిక్ చిత్రాన్ని మాత్రం మళ్ళీ తియ్యలేదు అని అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.
బాలయ్య తో ఆదిత్య 369 లాంటి సైన్స్ ఫిక్షన్ సినిమాని తీసిన సింగీతం శ్రీనివాసరావు గారే, మూడేళ్ళ తర్వాత మళ్ళీ ఆయన భైరవ ద్వీపం లాంటి సినిమాని తీసారు.ఇలాంటి వెండితెర అద్భుతాలు ఆ రోజుల్లో కేవలం సింగీతం శ్రీనివాసరావు గారే తీసేవారు.
ఆయన విజన్ కనీసం 20 ఏళ్ళు అడ్వాన్స్ గా ఉంటుంది.
బాలయ్య బాబు తో ఎవరైనా మాస్ మసాలా సినిమాలు తియ్యాలని అనుకుంటున్నారు.కానీ సింగీతం శ్రీనివాసరావు మాత్రం కాస్త డిఫరెంట్ గా అలోచించి, ఇలాంటి విన్నూతన ప్రయత్నాలు చేసి సఫలం అయ్యారు.ఇక భైరవ ద్వీపం చిత్రం లో బాలయ్య తన నట విశ్వరూపాన్ని చూపించారు అనే చెప్పాలి.
ఈ స్థాయి నటన ఆయన తరం లోని స్టార్ హీరోలెవ్వరూ కూడా చెయ్యలేరు, ఒక్క సీనియర్ నందమూరి తారకరామారావు మాత్రమే ఇలాంటి పాత్రలు మరియు సినిమాలు చెయ్యగలరు. ఆ స్థాయి చిత్రం ఇది.అప్పట్లో భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఆ రోజుల్లోనే 5 కోట్ల రూపాయిల బడ్జెట్ తో తెరకెక్కింది.కానీ ఫుల్ రన్ లో ఈ సినిమా దాదాపుగా 9 కోట్ల రూపాయిల షేర్ ని రాబట్టింది.
ఆరోజుల్లో ఈ సినిమాని జనాలు ఎగబడి చూసారో, టీవీ లో నేటి తరం ఆడియన్స్ కూడా అదే విధంగా చూస్తుంటారు.
బాలయ్య అభిమానులను కాకుండా సాధారణ ప్రేక్షకులను, మీకు ఇష్టమైన బాలయ్య సినిమా ఏమిటి అని అడిగితే, వాళ్ళు చెప్పే రెండు మూడు చిత్రాల పేర్లలో భైరవ ద్వీపం చిత్రం కూడా ఒకటి ఉంటుంది.ఇప్పుడంటే లేటెస్ట్ టెక్నాలజీ వచ్చింది కాబట్టి, బాహుబలి లాంటి సినిమాలను తియ్యగల్తున్నాము.కానీ ఆ రోజుల్లోనే ఇలాంటి సినిమాలు తెరకెక్కించడం అంటే సాధారణమైన విషయం కాదు.
ఇక ఈ సినిమాలోని పాటలు కూడా మంచి హిట్ అనే సంగతి అందరికీ తెలిసిందే.ముఖ్యంగా నరుడా ఓ నరుడా ఏమి కోరిక అంటూ సాగే పాట ఇప్పటికీ బయట వినిపిస్తూనే ఉంటుంది.
ముఖ్యంగా ఈ పాటలోని విజువల్స్ చూస్తే సింగీతం శ్రీనివాస రావు విజన్ ఎలాంటిదో అందరికీ అర్థం అవుతుంది.ఆ రోజుల్లోనే ఆయన ఇలా ఎలా ఆలోచించగలిగాడు అనిపిస్తుంది.
మాధవపెద్ది సురేష్ అందించిన సంగీతం ఈ సినిమా స్థాయిని మరింత పెంచింది. చిత్రంలో సందర్భోచితంగా వచ్చే ప్రతీ గీతం సినిమాకి మరింత ఊపిరిపోసింది. “విరిసినది వసంతగానం”, “ఎంత ఎంత వింత మోహమో”, “ఘాటైన ప్రేమ ఘటన”, “నరుడా ఓ నరుడా”, “శ్రీ తుంబుర నారద” ఇలా పాటలన్నీ సంగీతపరంగానూ, సాహిత్యపరంగాను సంగీత ప్రియులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
భైరవద్వీపం – కొన్ని విశేషాలు
బాలకృష్ణ, రోజా కాంబినేషన్‌లో వచ్చిన తొలి చిత్రమిదే. ఆ తర్వాత వీరిద్దరి కలయికలో బొబ్బిలి సింహం, పెద్దన్నయ్య వంటి జనరంజక చిత్రాలతో పాటు గాండీవం, మాతో పెట్టుకోకు, శ్రీకృష్ణార్జున విజయం, సుల్తాన్ వంటి సినిమాలు కూడా రూపొందాయి.
అలాగే… రంభ కూడా తొలిసారిగా బాలయ్యతో స్క్రీన్ షేర్ చేసుకున్న సినిమా ఇదే కావడం విశేషం. ఆ తర్వాత బాలయ్య, రంభ జంటగా ‘మాతో పెట్టుకోకు’ రూపుదిద్దుకుంది. అదే విధంగా… `శ్రీకృష్ణార్జున విజయం`లో ఓ ప్రత్యేక గీతంలో రంభ కనువిందు చేసింది. ఈ మూడు చిత్రాలలోనూ రోజా కూడా నటించడం విశేషం.
బాలకృష్ణ, సింగీతం శ్రీనివాసరావు కాంబినేషన్ లో రెండో సినిమా ఇది. సైంటిఫిక్ (‘ఆదిత్య 369’), జానపదం (‘భైరవద్వీపం’), పౌరాణికం (‘శ్రీకృష్ణార్జున విజయం’)… ఇలా డిఫరెంట్ జానర్‌లలో వీరి కాంబినేషన్ మూవీస్ రావడం విశేషం.
బాలకృష్ణ, మాధవపెద్ది సురేష్ కలయికలో వచ్చిన తొలిచిత్రమిదే. ఆ తర్వాత బాలయ్య కాంబినేషన్‌లో ‘మాతో పెట్టుకోకు’, ‘శ్రీకృష్ణార్జున విజయం’ వంటి చిత్రాలకు సురేష్ సంగీతం అందించాడు.
పూర్తిస్థాయి 3డి గ్రాఫిక్స్ తో నిర్మించిన తొలి భారతీయ జానపద చిత్రరాజం భైరవద్వీపం.
వైజాగ్ లో 100 రోజులు హౌస్ పుల్స్ తో శతదినోత్సవం జరుపుకున్న ఏకైక జానపద సినిమా.
తిరుపతిలో 5 ఆటలతో శతదినోత్సవం జరుపుకున్న ఏకైక జానపద చిత్ర రాజం
ఆంధ్ర , కర్ణాటక, ఒరిస్సా … ఇలా మూడు రాష్ట్రాల్లో శతదినోత్సవం జరుపుకున్న ఏకైక సినిమా .
పుల్ ట్యాక్స్ లో సీడెడ్, ఈస్ట్, వెస్ట్, ఉత్తరాంధ్ర, నెల్లూరు, కర్ణాటక, ఒరిస్సా లలో ఆల్ టైం రికార్డు షేర్ వసూల్ చేసిన ఏకైక సినిమా