యువరాజు భాష నక్సలైట్లది మూడు పార్టీలు ఒక గూటి పక్షులు

అపార సంపదను దోచుకున్నాయి సైనికుల భూములను స్వాహా చేస్తారా? జంషెడ్​ పూర్​ సభలో ప్రధాని నరేంద్ర మోదీ

May 19, 2024 - 13:59
 0
యువరాజు భాష నక్సలైట్లది మూడు పార్టీలు ఒక గూటి పక్షులు

రాంచీ: కాంగ్రెస్​, జేఎంఎం, ఆర్జేడీలు ఒకే గూటి పక్షులని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. ఝార్ఖండ్​ లో ఉన్న అపారమైన సంపదను ఈ మూడు పార్టీలు దోచుకుంటున్నాయని మండిపడ్డారు. అవినీతికి ఆనకొండలు ఈ పార్టీలని ప్రధాని ధ్వజమెత్తారు. వీరికి అభివృద్ధి తెలియదని, యువరాజు నక్సలైట్ల భాష మాట్లాడుతున్నాడని మోదీ విమర్శించారు. రాష్ర్టంలోని పేద ప్రజల సొమ్మును ఈ రెండు పార్టీలు దోచుకుతింటున్నాయని మండిపడ్డారు. దేశ సరిహద్దులను కాపాడే సైనికుల భూములను కూడా ఈ దుష్టశక్తులు స్వాహా చేశాయని మండిపడ్డారు. 

ఆదివారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఝార్ఖండ్​ లోని జంషెడ్‌పూర్‌ ఘట్‌శిలలో ఎన్నికల ప్రచార సభలో ప్రసంగించారు. ప్రత్యర్థులను టార్గెట్ చేశారు. యువరాజు నక్సలైట్ల భాషలో మాట్లాడుతూ.. పరిశ్రమ వర్గాలు, పెట్టుబడులతో వస్తున్నవారిని బెదిరిస్తూ వసూల్లకు పాల్పడేలా మాట్లాడుతున్నారన్నారు. ఝార్ఖండ్​ అపారమైన ఖనిజ సంపదకు పెట్టింది పేరన్నారు. ఈ సంపదంతా నిరుపేదలదని స్పష్టం చేశారు. దీంతో వీరు తమ ఖజానాలు మాత్రమే నింపుకుంటున్నారని నిరుపేదల మంచి చెడ్డలు ఏ మాత్రం వీరికి పట్టవన్నారు. కాంగ్రెస్​ పార్టీ వల్ల దేశానికి తీవ్ర ముప్పు పొంచి ఉందని ప్రజలంతా ఈ మూడు పార్టీలతో అప్రమత్తంగా ఉండాలని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

ఈ పార్టీలతో రాజ్యాంగానికి కూడా ముప్పు పొంచి ఉందన్నారు. ఎస్సీ,ఎస్టీ, ఓబీసీ లాంటి నిరుపేద వర్గాలకు ఇచ్చిన రిజర్వేషన్లను పూర్తిగా రద్దు చేసే యోచనలో వీరున్నారని మండిపడ్డారు. ఎట్టిపరిస్థితుల్లోనూ మోదీ ఉన్నంతవరకు మతపరమైన రిజర్వేషన్లను అనుమతించబోమన్నారు. అంబేద్కర్​ రాజ్యాంగాన్ని గౌరవించుకుంటామని మోదీ పునరుద్ఘాటించారు. 

ఎప్పుడు తమ కుటుంబాల సంక్షేమం కోసమే ఆలోచించే ఈ పార్టీలు నిరుపేదలు ఏం మేలు చేస్తాయని మండిపడ్డారు. కుటుంబ తరాల రాజకీయాలు దేశానికి అత్యంత ప్రమాదకరమన్నారు. కోవిడ్​ లాంటి కీలక సమయంలో దేశ ప్రజల ఆరోగ్య విషయాలు, అన్న పానీయాలను సోనియాగాంధీ ఎప్పుడైనా అడిగారా? అని ప్రశ్నించారు. ఇప్పుడు తన కుమారుడికి రాయ్​ బరేలీ ఇవ్వాలని అంటున్నారని ఎద్దేవా చేశారు. నిరుపేదల సంక్షేమం పట్టని వారు దేశ ప్రజలకు ఏం మేలు చేస్తారని ప్రశ్నించారు.

ఇక్కడ కేంద్ర సంస్థల దాడుల్లో నోట్ల కట్టలు బయటపడింది అందరూ చూసే ఉంటారని అదంతా ఎవరివని ప్రశ్నించారు. నిరుపేదల రక్తాన్ని ఈ జలగలు పీలుస్తున్నాయన్నారు. ఇదంతా అమాయక గిరిజనులు, దళితులు, వెనుకబడ్డ వర్గాలదన్నారు. ఈ రాష్ర్టంలో పేదలు మరింత పేదలుగా మారుతున్నా వారి అభివృద్ధికి ఏం చర్యలు తీసుకోలేదని విమర్శించారు. ప్రస్తుతం దేశంలో ఝార్ఖండ్​ అనగానే కుప్పలు తెప్పలుగా టీవీల్లో కరెన్సీ నోట్లు దర్శనమిస్తున్నాయని తెలిపారు. ఈ అవినీతి పార్టీలు రాష్ర్టం పేరు, ప్రఖ్యాతులను భ్రష్టు పట్టించాయన్నారు. 

ఎట్టి పరిస్థితుల్లోనూ వీరి చర్యలను ఉపేక్షించబోమని ప్రధాని పేర్కొన్నారు. ఝార్ఖండ్​ లో ప్రతీ నిరుపేద చెంతకు అన్ని రకాల మౌలిక సదుపాయాలు దరి చేరాలని, అభివృద్ధి దిశలో ఈ రాష్ర్టం పయనించాలన్నదే తమ కోరిక అన్నారు. అందుకే బీజేపీకి అవకాశం ఇవ్వాలని ప్రధాని మోదీ విజ్ఞప్తి చేశారు.