వేతన జీవుల బకాయిలకు మొక్షమెన్నడో?
When is the release of dues for employees and teachers?
ఉద్యోగ విరమణ అనంతరం కూతురి వివాహం, సొంత ఇల్లు నిర్మించుకోవడం, పిల్లల చదువులు వంటి కలలతో ఉద్యోగి ప్రణాళికలు రూపొందిస్తున్న క్రమంలో ఆ ఆశలన్నీ కల్లలుగానే మిగులుతాయా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మూడేళ్ల అనంతరం ఈ ఏడాది మార్చి నుంచి ఉద్యోగ విరమణలు మొదలయ్యాయి. ఉద్యోగ విరమణ చెందిన ఆనంతరం ఉద్యోగికి ప్రభుత్వం చెల్లించాల్సిన బెనిఫిట్స్ మొత్తాన్ని ఎప్పటికి చెల్లిస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఇటీవల పదవీ విరమణ పొందిన ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.
ప్రభుత్వ ఉద్యోగంలో చేరిన ఉద్యోగ,ఉపాధ్యాయులు 58 సంవత్సరాల వయస్సు రాగానే ఉద్యోగ విరమణ చేయడం ఆనవాయితీగా వస్తున్నది. కానీ ఆ ఆనవాయితీకి బ్రేక్ వేస్తూ గత రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ విరమణ వయస్సును 61 సంవత్సరాలకు పెంచుతూ 2021లో జీవో45 ను విడుదల చేసింది. ఈ క్రమంలో 2024 డిసెంబర్ నాటికి 61 సంవత్సరాల వయస్సు పూర్తిచేసుకున్న ఉద్యోగ, ఉపాధ్యాయులు కలిసి రాష్ట్ర వ్యాప్తంగా సుమారు ఎనిమిది వేలకు పైగా ఉన్నారు. రిటైరైన ఉద్యోగులకు రావాల్సిన పెన్షన్ తో పాటు జీపీఎఫ్, జీఐఎస్, జీవిత బీమా, గ్రాట్యుటీ, కమ్యూటేషన్, లీవ్ ఎన్ క్యాష్ మెంట్ తదితర మొత్తాలను రిటైరయ్యే నాటికి ఉద్యోగి మూలవేతనం ఆధారంగా ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది. ఇటీవల కాలంలో స్వచ్ఛంద పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు కూడా ప్రభుత్వం కేవలం నెలవారీ పింఛను మాత్రమే మంజూరు చేస్తున్నది తప్ప వారికి రావాల్సిన బెనిఫిట్స్ చెల్లించకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. ప్రభుత్వం తమకు ఎప్పుడు చెల్లిస్తుందో అన్న అనుమానాలు వారికి కలుగుతున్నాయి.
ప్రభుత్వ సర్వీసుకు గుర్తింపు ఇదేనా..
ఇప్పటికే సంవత్సరాల తరబడి ఉద్యోగులకు చెల్లించాల్సిన లీవ్ ఎన్ క్యాష్ మెంట్, మెడికల్ రియింబర్స్ మెంట్ బిల్లులు, జీపీఎఫ్ లోన్లు, పార్ట్ ఫైనల్, జీవిత బీమా మొత్తాలను చెల్లించకుండా ప్రభుత్వం పెండింగ్ లో పెట్టింది. తాము దాచుకున్న డబ్బులు తమ అవసరాలకు అందకుండా పోతున్నాయే అని వేతనజీవులు అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల రంగారెడ్డి జిల్లాలో ఒక గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు తాను దాచుకున్న ప్రభుత్వ బీమా మొత్తాన్ని చెల్లించాల్సిందిగా 2022 డిసెంబర్ 8న దరఖాస్తు చేసుకోగా ప్రభుత్వం ఆ మొత్తాన్ని గత నెల 5న చెల్లించింది. అంటే ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉందో వేరే చెప్పనక్కర్లేదు. తాము 30 సంవత్సరాలకు పైగా చేసిన ప్రభుత్వ సర్వీసుకు గుర్తింపు ఇదేనా అని ఉద్యోగులు వాపోతున్నారు.
గత పీఆర్సీ బకాయిలు
గత ప్రభుత్వం రెండు నెలల పీఆర్సీ బకాయిలను వాయిదాలలో చెల్లిస్తామని పెండింగ్ లో పెట్టింది. అందులో నేటికీ ఒక వాయిదా కూడా జమకాని ఉద్యోగులు కోకొల్లలు. మార్చి 31కి ఆర్థిక సంవత్సరం ముగిసి పోవడంతో ఆ బకాయిల సంగతేమిటో అర్థంగాక ఉద్యోగ, ఉపాధ్యాయులు అయోమయంలో ఉన్నారు. గతంలో అవసరాల నిమిత్తం లీవ్ ఎన్ క్యాష్ మెంట్ కు ఒక నెల ముందుగా దరఖాస్తు చేసుకుంటే ఆ మొత్తం ఖాతాలో జమయ్యేది. ప్రస్తుత పరిస్థితుల్లో ఒక ఏడాది ముందుగా దరఖాస్తు చేసినా.. మొత్తం అందే పరిస్థితులు కనిపించడం లేదు. కోరి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువగా నష్టపోయింది ఉద్యోగ, ఉపాధ్యాయులే అంటే అది ఏ మాత్రం అతిశయోక్తి కాదేమో! తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో కీలకపాత్ర పోషించిన ఉద్యోగ, ఉపాధ్యాయుల ను ప్రెండ్లీ గవర్నమెంటు పేరుతో నిర్లక్ష్యం చేసిన మాట అక్షరసత్యం. 33 నెలల పీఆర్సీ బకాయిలను చెల్లించకుండా వేతన జీవులకు ఆర్థికంగా నష్టం కలిగించింది.
ప్రస్తుత సర్కారైనా..
ప్రస్తుతం ప్రభుత్వం ఉద్యోగులకు 2022 జులై, 2023 జనవరి, జులై, 2024 జనవరి నాలుగు డీఏలు చెల్లించాల్సి ఉంది. ఇటీవల నిర్వహించిన క్యాబినెట్ మీటింగులో కనీసం రెండు డీఏలైనా చెల్లిస్తారన్న ఆశలపై ప్రభుత్వం నీళ్లు చల్లింది. లోక్ సభ ఎన్నికలు ముగిసిన వెంటనే కేంద్ర ప్రభుత్వం మరో డీఏను కూడా ప్రకటిస్తుంది. కానీ రాష్ట్రంలో మాత్రం.. బకాయిలకే సరిపోతున్నది. కొన్ని నెలల క్రితం కొలువుదీరిన నూతన సర్కారు వేతన జీవులకు నెల మొదటి రోజునే జీతాలు చెల్లించే ఆనవాయితీని పునరిద్దరించడం బాగుంది. అదేవిధంగా పెండింగ్ లో ఉన్న బిల్లులన్నీ చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆ దిశగా ఉద్యోగ,ఉపాధ్యాయ సంఘాలన్నీ ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకురావాలని వేతన జీవులు కోరుతున్నారు. కేంద్ర ప్రభుత్వం డీఏను ప్రకటించిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కూడా తమ ఉద్యోగ,ఉపాధ్యాయ పెన్షనర్లకు డీఏను ప్రకటించే ఆనవాయితీ గతంలో ఉండేది. ఆ ఆనవాయితీని తిరిగి పునరుద్ధరించాలని ఉద్యోగులు కోరుతున్నారు. పీఆర్సీ కమిటీ నివేదికను వెంటనే తెప్పించుకుని మెరుగైన ఫిట్ మెంట్ తో పీఆర్సీని మంజూరు చేసి ఉద్యోగుల స్నేహపూర్వక ప్రభుత్వమని నిరూపించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. బకాయిల పద్ధతికి చరమగీతం పాడుతూ ఉద్యోగ విరమణ బకాయిలను వెంటనే చెల్లించేలా సీఎం చొరవ తీసుకుంటారని ఆశిస్తూ..
– సుధాకర్.ఏ.వి
రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి,
స్టేట్ టీచర్స్ యూనియన్, తెలంగాణ
9000674747