ఉగ్రవాదాన్ని పెంచిపోషించారు
దాడులు చేస్తే విదేశాలకు వెళతారా? దేశాన్ని ఏం రక్షించుకుంటారు? ఆకలితో అల్లాడే దేశాలు ప్రస్తుతం సంబంధాలు కోరుకుంటున్నాయి రక్షణ రంగాలకు స్వేచ్ఛనీయరా? కాంగ్రెస్, ఆర్జేడీలు అవినీతి, కుటుంబ పార్టీలు శత్రువులకు దడ పుట్టిస్తాం బిహార్సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
పాట్నా: ఆకలిమంటలతో అల్లాడే దేశాలు కూడా కాంగ్రెస్ హయాంలో భారత్‌లో ఉగ్రవాదాన్ని పెంచి పోషించాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. తమ ప్రభుత్వం వచ్చాక ఉగ్రవాదానికి సరైన రీతిలో జవాబు చెప్పగలిగామని, శత్రు దేశాలు ప్రస్తుతం భారత్‌తో సంబంధాలను కోరుకుంటున్నాయని ప్రధాని మోదీ తెలిపారు. ఉగ్రవాదులు దాడి చేసి వెళ్లిపోతే అప్పటి ప్రభుత్వం విదేశాలకు వెళ్లి ఫిర్యాదు చేసేదన్నారు. కానీ తమ హయాంలో పూర్తి మార్పు తీసుకువచ్చామన్నారు. రక్షణ, సాయుధ, పోలీసు బలగాలకు పూర్తి స్వేచ్ఛనిచ్చామన్నారు. ఉగ్రవాదులకు ధీటైన జవాబును వారి ఇంటిలోకి వెళ్లి కూడా ఇచ్చి వచ్చేంత ధైర్యవంతులు మన సైనికులని ప్రధాని మోదీ పేర్కొన్నారు. బిహార్జమూయ్లో గురువారం జరిగిన ఎన్నికల బహిరంగ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించారు. కాంగ్రెస్, ఆర్జేడీ పార్టీలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమదేశంలో ఉగ్రదాడి జరిగితే తామే సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉంటుందన్న చిన్న విషయాన్ని కూడా తెలుసుకోలేని కాంగ్రెస్ దేశాన్ని ఏం రక్షించగలుగుతుందని ప్రశ్నించారు. ఇక కుటుంబం, అవినీతే ధ్యేయంగా ఉన్న మరో పార్టీ ఆర్జేడీ అన్నారు. దేశాన్ని అభివృద్ధి వైపు నడిపించే విషయంలో ఓ వైపు బీజేపీ, ఎన్డీయే కూటమి పార్టీలున్నాయని తెలిపారు. మరోవైపు అవినీతి, కుటుంబ తత్వ పార్టీలు ఇంకోవైపు ఉన్నాయన్నారు. సుసంపన్నమైన భారత్ నిర్మాణానికి బీజేపీ, ఎన్డీయే పార్టీలు కట్టుబడి ఉన్నాయని ప్రధాని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ హయాంలో భారతదేశ కీర్తి, ప్రతిష్ఠలు అడుగంటేలా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమదేశంలోనే తమ ప్రజల మానప్రాణాలను కాపాడుకోలేని దుస్థితిలో కాంగ్రెస్ పాలన చేసిందన్నారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా భారత్‌కు గడ్డుకాలం ఎదురైందన్నారు. మన సైనికులకు కూడా పూర్తి స్వేచ్ఛనీయకుండా అడ్డుకుందని మండిపడ్డారు. కానీ ప్రస్తుతం పరిస్థితుల్లో పూర్తి మార్పు తీసుకువచ్చామన్నారు. రానున్న కాలంలో భారత్‌పై శత్రుదేశాలు కన్నెత్తి చూడాలంటే వెన్నులో వణుకుపుట్టేలా చేస్తామన్నారు. 2024 ఎన్నికలు బిహార్, దేశ భవిష్యత్‌కు కీలకం కానున్నాయని అన్నారు. బిహార్ కలలను సాకారం చేసుకునే దిశగా ప్రజలు అరుణ్ భారతికి ఓట్లు వేయాలని పిలుపునిచ్చారు.