నా తెలంగాణ, నిర్మల్: ఇటీవలి భారీ వర్షాలు, వరదలతో సమస్యలను ఎదుర్కొంటున్న నిర్మల్ జిఎన్ఆర్ కాలనీ ప్రజలకు అన్ని విధాలుగా అండగా ఉంటామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు హామీ ఇచ్చారు.
భారీ వర్షాల నేపథ్యంలో పట్టణంలోని జిఎన్ఆర్ కాలనీలో స్థానిక శాసనసభ్యులు ఏలేటి మహేశ్వర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, ఎస్పీ జానకి షర్మిల లతో కలిసి మంత్రి మంగళవారం పర్యటించారు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ, భారీ వర్షాలు వరదలతో ఇబ్బందులను ఎదుర్కొంటున్న కాలనీ ప్రజల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అధైర్యపడవద్దని, ప్రభుత్వం ప్రజలకు, రైతులకు అండగా ఉంటుందని తెలిపారు. సమస్యలను శాస్త్రీయంగా అధ్యయనం చేసి సాంకేతిక నిపుణులతో చర్చించి నివేదికను సిద్ధం చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు.
సమస్యను రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి, త్వరితగతిన పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. జిల్లాలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు నెలకొల్పి స్థానిక యువతకు ఉపాధి కల్పించేందుకు కృషి చేస్తానని తెలిపారు. భారీ వర్షాల హెచ్చరికలను దృష్టిలో ఉంచుకొని ముందస్తుగా కాలనీ ప్రజలను ప్రజలను పునరావాస కేంద్రానికి తరలించిన జిల్లా అధికార యంత్రాంగాన్ని మంత్రి అభినందించారు.
గత కొన్ని సంవత్సరాలుగా వరదల కారణంగా కాలనీ ప్రజలు ఎదుర్కొంటున్న నష్టాలు, సమస్యలపై ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను మంత్రి తిలకించారు. అంతకు ముందు స్థానిక ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి జిఎన్ఆర్ కాలనీ వాసులు ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రికి వివరించారు.