BRS: ఎంపీ ఎన్నికల్లో  ఏం చెప్పి ఓట్లు అడుగుదాం?

What should we say and ask for votes in MP elections? BRS party high command is worried

Feb 22, 2024 - 16:01
 0
BRS: ఎంపీ ఎన్నికల్లో  ఏం చెప్పి ఓట్లు అడుగుదాం?
  • బీఆర్​ఎస్​ అధినేత మల్లగుల్లాలు

  •  కృష్ణా నీళ్ల లొల్లి విషయంలో పారని పాచికలు

  •  బీజేపీ, బీఆర్​ఎస్​ పొత్తు దుష్ప్రచారమూ బెడిసికొట్టింది

  •  ఎజెండా లేకుండా జనంలోకి వెళ్లడం ఎలా?

  •  బీఆర్​ఎస్​ భవిష్యత్​ పై కమ్ముకున్న నీలి నీడలు

  •  చేజారుతున్న పార్టీ కేడర్.. ఇతర పార్టీలకు వలసలు​

నా తెలంగాణ, పొలిటికల్​ బ్యూరో: మార్చి రెండో వారంలో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్​ విడుదల కానుందనే అంచనాల నేపథ్యంలో పార్టీలన్నీ సిద్ధమవుతున్నాయి. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ఇప్పటికే ముగియగా.. పార్లమెంట్​ ఎన్నికల్లో మెజార్టీ ఎంపీ సీట్లు సాధించడంపై రాష్ట్రంలో ప్రధాని పార్టీలు దృష్టి కేంద్రీకరించాయి. అయితే ఈ ఎన్నికలు ప్రాంతీయ గులాబీ పార్టీ ఉనికికు ప్రశ్నార్థకంగా మారాయి. పదేండ్లు అంతా తామై ఏలిన బీఆర్​ఎస్​ నాయకులను మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు గద్దె దించారు. ఇప్పుడు ఎంపీ ఎన్నికల్లో ఉనికిని కాపాడుకునేందుకు ఆ పార్టీ అధిష్టానం వేస్తున్న పాచికలేమీ పారడం లేదు. దీంతో ‘ప్రజలకు ఏం చెప్పి ఓట్లు అడుగుదాం?’ అనే ప్రశ్న వారిని కలవరపెడుతున్నది. ఎంపీ ఎన్నికల్లో ప్రజల్లోకి వెళ్లేందుకు ఆ పార్టీకి ఎజెండా ఏమీ లేకపోవడంతో గులాబీ అధినేత కేసీఆర్ మల్లగుల్లాలు పడుతున్నారు.

కృష్ణా నీళ్ల పాచిక పారలేదు

పదేండ్ల టీఆర్​ఎస్​/బీఆర్​ఎస్​ పాలనలో కృష్ణా నీళ్ల విషయంలో తెలంగాణకు అన్యాయం జరిగిందనే విషయాన్ని అధికార కాంగ్రెస్​ పార్టీతోపాటు భారతీయ జనతా పార్టీ బలంగా జనాల్లోకి తీసుకువెళ్లింది. రాయలసీమకు నీళ్లు ఇస్తామని కేసీఆర్​ ప్రకటించడం, ఎలాంటి అనుమతులు లేకుండా ఏపీ ప్రభుత్వం సంగమేశ్వరం వద్ద రాయలసీమ లిఫ్ట్​ ఇరిగేషన్​ ప్రాజెక్టు నిర్మాణం చేస్తుంటే.. పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేయడం, ఈ విషయాలను పలు పత్రికలు జనాల్లోకి తీసుకువెళ్లడం ద్వారా గులాబీ పార్టీ వైఖరి ప్రజలకు అర్థమైంది. ఇవన్నీ తెలిసిన ప్రజలకు కృష్​ణా నది ప్రాజెక్టులను రాష్ట్ర ప్రభుత్వం కేఆర్​ఎంబీకి అప్పగిస్తున్నదని, దీంతో రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందని కేసీఆర్​ పెట్టిన గగ్గోలుకు పెద్దగా స్పందన రాలేదు. నల్గొండలో భారీ బహిరంగ సభ పెట్టి ‘‘కృష్ణా నీళ్లపై ఉద్యమం చేస్తాం.. పోరాటం చేస్తాం.. తెలంగాణ కోసం కొట్లాడ్తాం.. కేంద్రం రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నది.. ప్రజల కోసం నా కట్టె కాలే వరకు పోరాడుతా’’ అనే డైలాగులు దంచినా.. జనాలుపెద్దగా పట్టించుకోలేదు. నల్గొండ సభ తర్వాత పార్టీ శ్రేణుల ద్వారా ప్రజల నుంచి ఫీడ్​ బ్యాక్​ తీసుకున్న గులాబీ అధినేతకు కృష్ణా నీళ్లపై తాను పెట్టిన లొల్లి పాచికలు పారలేదనే విషయం అర్థమైనట్లు తెలిసింది.



బీజేపీపై దుష్ప్రచారం

కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రాబోతున్నట్లు అనేక సర్వేలు చెప్తుండటం.. దేశమంతా మోదీ మేనియా నడుస్తుండటంతో బీజేపీ ఓట్లకు గండి కొట్టడం ద్వారా లబ్ధి పొందాలని బీఆర్​ఎస్​ పార్టీ భావిస్తున్నది. బీజేపీ, బీఆర్​ఎస్​ పొత్తు ఉందనే దుష్ప్రచారానికి తెర లేపారు. ఇటీవల మాజీ మంత్రి, మేడ్చల్​ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి మాట్లాడుతూ.. బీజేపీతో పొత్తు పెట్టుకుంటామని గాలికి ఒక బాణం వదిలారు. దాన్ని యూట్యూబ్​ చానెల్స్​ మొదలు.. బీజేపీపై మొదటి నుంచి విషం కక్కుతున్న ఓ పత్రిక కథనాల్లోనూ, సొంత వాక్యాల్లోనూ వల్లేవేసింది. పాతాళంలో ఉన్న కాంగ్రెస్​ ను జాకీలు పెట్టి మరీ లేపుతూ.. వచ్చిన ఆ పత్రిక, లిక్కర్​ స్కామ్​ కేసులో కవితను సీబీఐ అరెస్ట్​ చేయలేదు కాబట్టి.. బీజేపీ, బీఆర్​ఎస్​ ఒకటే అనే దుష్ప్రచారాన్ని నిస్సుగ్గుగా మొదటి పేజీలో అచ్చువేసింది. కాంగ్రెస్​ కు మేలు చేయడం కోసం ఓ కుటుంబ, అవినీతి పార్టీతో బీజేపీని జత కట్టింది. కాగా ఈ అంశాన్ని వాడుకొని.. ఓట్లు పొందాలని అటు కాంగ్రెస్​, ఎన్ని ఓట్లు వస్తే.. అన్నే చాలు అనేలా బీఆర్​ఎస్​ కుట్ర పన్నుతున్నాయి. 

తిప్పికొట్టిన బీజేపీ నేతలు

బీజేపీ జాతీయ నాయకత్వంతోపాటు, రాష్ట్ర నాయకులు బీఆర్​ఎస్​ తో పొత్తు విషయంలో చాలా స్పష్టంగా తేల్చిచెప్తున్నారు. కుటుంబ, అవినీతి, మునిగిపోయే పార్టీలతో పొత్తు ఉండదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి .కిషన్​ రెడ్డి ఇప్పటికే స్పష్టం చేశారు. బీజేపీ, బీఆర్​ఎస్​ పొత్తు ఉన్నదని ఎవరన్న అంటే.. చెప్పుతో కొట్టాలని ఓ నేత ఘాటుగా స్పందించగా.. బీఆర్​ఎస్​ కాళ్ల బేరానికి వచ్చినా పొత్తు పెట్టుకోబోమని మరో నేత తేల్చి చెప్పారు. దీంతో పొత్త దుష్ప్రచారం అంశమూ బీఆర్​ఎస్​ కు బెడిసి కొట్టింది. పోనీ కేంద్రంలోని మోదీ ప్రభుత్వాన్ని ఏ విషయంలోనైనా విమర్శించుదామని అనుకుంటే ఎక్కడా ఆ అవకాశం లేదు. పెట్రోల్​ ధరలు పెరిగాయని ధర్నా చేద్దామని అంటే.. అన్ని రాష్ట్రాలు వ్యాట్​ తగ్గించినా గతంలో బీఆర్​ఎస్​ తగ్గించలేదనే ప్రశ్న వస్తుంది. గ్యాస్​ ధర పెరిగిందని నిరసన తెలుపుదామంటే.. అధికారంలోకి వస్తే రూ.400కే సిలిండర్​ ఇస్తామని మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఎలా ఇచ్చారు? గత పదేండ్లు ఎందుకు తగ్గించలేదనే ప్రశ్న వెంటాడుతుంది? ఇవీగాక కేంద్ర రోడ్లు, రైల్వేలు, ప్రాజెక్టులకు, పేదల ఇండ్ల నిర్మాణానికి, గ్రామ పంచాయతీలకు, వ్యవసాయానికి, విద్య, వైద్యానికి, ఉచిత రేషన్​ ఇలా.. అనేక అంశాల్లో పెద్ద మొత్తంలో నిధులు ఇస్తున్నది. కాబట్టి కేంద్రాన్ని ప్రశ్నించే ఆస్కారం లేక గులాబీ పార్టీ ఏ ఎజెండాతో ముందుకు వెళ్లాలో తెలియక సతమతమవుతున్నది.

పార్టీ కేడర్​ ఇతర పార్టీలకు..

ఇంతకాలం గులాబీ పార్టీని నమ్ముకొని ఉన్న నాయకులు, కార్యకర్తలు ఇప్పుడు ఆ పార్టీకి భవిష్యత్​ లేదనే సంగతి గుర్తించి ఇతర పార్టీలకు క్యూ కడుతున్నారు. టీఆర్​ఎస్​ ను బీఆర్​ఎస్​ గా మార్చిన తర్వాత ఏపీలో, మహారాష్ట్రలో, మధ్యప్రదేశ్​ లో ప్రారంభించిన గులాబీ ఆఫీసులు ఇప్పటికే మూతపడగా.. రాష్ట్రంలోనూ కేడర్​ మొత్తంగా తగ్గిపోతున్నది. ప్రపంచంలోని అతిపెద్ద పార్టీ అయిన బీజేపీలో కొంత మంది బీఆర్​ఎస్​ నాయకులు చేరుతుండగా, ఆస్తులు, పరిశ్రమలు కాపాడుకునేందుకు రాష్ట్రంలోని అధికార కాంగ్రెస్​ పార్టీలో చేరుతున్నారు. మొత్తంగా బీఆర్​ఎస్​ పార్టీ ఎంపీ ఎన్నికల తర్వాత కనుమరుగు కాబోతున్నదనే సంకేతాలు వెలువడుతున్నాయి.