మేడారం అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉన్నది: కిషన్​ రెడ్డి

Union Minister G. Kishan Reddy clarified that the Central Government is committed to the development of the Medaram Fair

Feb 22, 2024 - 15:43
Feb 22, 2024 - 15:51
 0
మేడారం అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉన్నది: కిషన్​ రెడ్డి
  • జాతర నిర్వహణకు కేంద్రం 3.14 కోట్లు ఇచ్చింది
  •  రూ.900 కోట్లతో సమ్మక్క, సారక్కల పేరుతో ట్రైబల్​ యూనివర్సిటీ ఏర్పాటు చేసింది
  •  ఈ ఏడాది నుంచే ప్రవేశాలు.. అత్యధిక సీట్లు గిరిజన బిడ్డలకే
  •   ఒక పండుగకు జాతీయ హోదా అనే విధానం ప్రభుత్వంలో లేదు
  •  మేడారం జాతర అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తున్నది
  •  వన దేవతలను దర్శించుకున్న బీజేపీ స్టేట్​ చీఫ్​
  •  స్వాగతం పలికిన రాష్ట్ర మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్​
  •  ఎత్తు బంగారం ఇచ్చి.. మొక్కు చెల్లించుకున్న కిషన్​ రెడ్డి

నా తెలంగాణ, ములుగు: మేడారం జాతర నిర్వహణకు, మౌలిక వసతుల కల్పన కోసం కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని కేంద్ర మంత్రి జి.కిషన్​ రెడ్డి తెలిపారు. ఈ ఏడాది జాతర నిర్వహణకు మోదీ ప్రభుత్వం రూ.3.14 కోట్లు రాష్ట్ర సర్కారుకు మంజూరు చేసిందని ఆయన వెల్లడించారు. ఈ మేరకు గురువారం హెలికాప్టర్​ లో బేగంపేట నుంచి మేడారం చేరుకున్నారు. ఈ మేరకు రాష్ట్ర మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్​ ఆయనకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కిషన్​ రెడ్డి ఎత్తుబంగారం ఇచ్చి సమ్మక్క, సారక్కలకు మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ కేంద్ర ప్రభుత్వం గతంలో మేడారం జాతరలో మౌలిక వసతుల కల్పన కోసం రూ.19 కోట్లు మంజూరు చేసింది. ఈసారి కూడా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్వయంగా సమ్మక్క, సారక్కల జాతర సందర్భంగా ప్రత్యేక శుభాకాంక్షలు చెప్పారు. రూ.900 కోట్లతో వనదేవతల పేరుతో ఏర్పాటు చేయనున్న గిరిజన యూనివర్సిటీ పనులు ఎంత వరకు వచ్చాయని ఆరా తీశారు. నేను రాష్ట్ర సీఎస్​ తో మాట్లాడి వివరాలు అందించాను. అంతర్జాతీయ స్థాయిలో అమ్మవార్ల  పేరిట యూనివర్సిటీ ఏర్పాటు చేయడం గర్వకారణం. ఇందులో ఈ ఏడాది నుంచే ప్రవేశాలు మొదలవుతాయి. అత్యధిక సీట్లు స్థానిక గిరిజన బిడ్డలకే దక్కుతాయి. తాత్కాలిక సిబ్బంది నియామకం చేపట్టేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. జాకారం యూత్ ట్రైనింగ్ ఇన్​ స్టిట్యూట్ లో తాత్కాలిక భవనంలో క్లాసులు జరుగుతాయి. ఈ వర్సిటీకి సలహాదారుగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో యూనివర్సిటీ నిర్మాణ పనులు జరుగుతాయి. ఎన్నికల తర్వాత శాశ్వత భవన నిర్మాణానికి భూమి పూజ చేస్తాం. ఇప్పటికే ఏజెన్సీలను గుర్తించాం. 337 ఎకరాల భూసేకరణ పూర్తయింది”అని పేర్కొన్నారు. 


జాతీయ హోదా అనే విధానం లేదు..

మేడారం జాతరకు కేంద్ర ప్రభుత్వం జాతీయ హోదా ఇవ్వడం లేదనే కొన్ని విషయాలు సోషల్​ మీడియాలో వ్యాప్తి చేస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్​ రెడ్డి అభ్యంతరం తెలిపారు. ఒక ఫెస్టివల్​ కు జాతీయ హోదా కల్పించడం అనే విధానం కేంద్ర ప్రభుత్వంలో ఎక్కడా లేదని ఆయన స్పష్టం చేశారు. టూరిజం, కల్చరల్​ మంత్రిగా తాను స్వయంగా ఈ విషయాన్ని మరోసారి స్పష్టం చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే ములుగు ప్రాంతంలో టూరిజం సర్క్యూట్​ ఏర్పాటు చేసినట్లు గుర్తు చేశారు. మేడారం అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని మరోసారి ఆయన పేర్కొన్నారు. దేశ ప్రజలు సుభిక్షంగా ఉండాలని, పాడిపంటలతో రైతులు, సబ్బండ వర్గాలు బాగుండాలని సమ్మక్క, సారక్కలను కోరుకున్నట్లు కిషన్​ రెడ్డి తెలిపారు.