అండర్ పాస్ లో నీరు వాహనదారులకు తప్పని ఇక్కట్లు
అధికారులపై ఎమ్మెల్యే ఆగ్రహం డివైడర్లు తొలగించాలని ఎమ్మెల్యే ఆదేశం
నా తెలంగాణ, షాద్ నగర్: చిన్న వర్షం పడితే చాలు ఆదారి గుండా రాకపోకలు పూర్తిగా నిలిచిపోయినట్లే. సరైన ప్రణాళిక లేని అండర్ పాస్ నిర్మాణంతో వాహనదారులకు ఇక్కట్లు తప్పడం లేదు. షాద్ నగర్ నియోజకవర్గం కొత్తూరు మున్సిపాలిటీలోని వై జంక్షన్ సమీపంలో నిర్మించిన అండర్ పాస్ నిర్మాణం పూర్తిగా లోపభూయిష్టంగా ఉందని ఆదివారంనాడు షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మండిపడ్డారు. శనివారం సాయంత్రం కురిసిన వర్షానికి అండర్ పాస్ లో వరద నీరు చేరడం, ప్రయాణికుల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తాయి. వై జంక్షన్, పెంజర్ల కూడళ్ల మూసివేతతో వ్యాపారస్తులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.
ఈ విషయాన్ని స్థానిక కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే దృష్టికి స్థానికులు, కాంగ్రెస్ నాయకులు తీసుకువెళ్లారు. దీంతో ఆదివారం సంఘటనా స్థలాన్ని ఎమ్మెల్యే సందర్శించారు. భౌగోళిక స్థితిగతులను అంచనా వేయకుండా నిర్మించిన వియుపి ఇంజనీర్ల ప్రణాళిక లోపం కిందకే వస్తుందని అన్నారు. ఇటు ప్రజలకు అటు ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకుంటానని చెప్పారు. ఈ సమస్యను వెంటనే ఎన్ హెచ్ ఏ ఐ అధికారుల దృష్టికి తీసుకువెళ్లి శాశ్వత పరిష్కారం దిశగా కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. స్థానికుల సూచనలను పరిగణలోకి తీసుకుంటామని, నిపుణుల సలహాలతో వై జంక్షన్ నుంచి దర్గా కూడలి వరకు ఫ్లైఓవర్ నిర్మాణం సాధ్యాసాధ్యాలను పరిశీలించి చర్యలు తీసుకుంటామని ఆయన వివరించారు. అనంతరం కూడళ్ల వద్ద వెంటనే దిమ్మెలు తొలగించి ప్రజల రాకపోకలకు మార్గం సుగమం చేయాలని ఇన్స్పెక్టర్ నరసింహారావును ఆదేశించారు. దీంతో వెంటనే పోలీసులు దిమ్మెలను తొలగించారు. ఈ చర్యతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కు, స్థానిక కాంగ్రెస్ నేతలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సుదర్శన్ గౌడ్, కౌన్సిలర్ వీరమోని హేమ దేవేందర్, ఇందూరి శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు హరినాథ్ రెడ్డి, పెద్దిరెడ్డి, రాజశేఖర్ రెడ్డి, నవీన్ చారి, రమేష్, గోవింద్, ఆంజనేయులు గౌడ్, హసన్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.