ఇజ్రాయెల్ పై 180 క్షిపణులతో ఇరాన్ భారీ దాడులు
మూల్యం చెల్లించుకుంటారని నెతన్యాహు హెచ్చరికలు
ఇజ్రాయెల్ వైపేనన్న అమెరికా
భారతీయులు అప్రమత్తంగా ఉండాలి
జెరూసలెం: ఇరాన్ ఇజ్రాయెల్ పై మంగళవారం అర్థరాత్రి ఒకేసారి 180 క్షిపణులతో భారీ దాడులకు పాల్పడింది. దీంతో 90 దాడులను అడ్డుకున్నామని ఇజ్రాయెల్ ప్రకటించింది. పలు దాడులు పాఠశాలలు, జన సమ్మర్థ ప్రాంతాలపై పడ్డాయని ప్రకటించింది. పెద్దగా నష్టం వాటిల్లలేదని పేర్కొంది. ఈ దాడిలో ఒక్కసారిగా మధ్య ప్రాచ్య దేశాల్లో యుద్ధమేఘాలు అలముకున్నాయి. దాడిపై ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు. మరోవైపు అమెరికా మండిపడింది. ఉగ్రవాదంపై పోరులో ఇరాన్ జోక్యం చేసుకోవడంతో తాము ఇజ్రాయెల్ వైపు ఉన్నామని స్పష్టం చేసింది. అదే సమయంలో ఐక్యరాజ్యసమితి ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశాన్ని నిర్వహించి మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు తగ్గే చర్యలకు ప్రాధాన్యతనిచ్చింది.
దాడి అనంతరం ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పజాకియాన్ మాట్లాడుతూ.. ఇజ్రాయెల్ దురాక్రమణకు ధీటుగా బదులిచ్చామని ప్రకటించారు. ఇరాన్ ప్రయోజనాలను, పౌరులను రక్షించుకునేందుకు ఈ దాడులు అవసరమని అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఇరాన్ కు ప్రధాన ఆర్థిక వనరుగా నిలుస్తున్న చమురు నిల్వలపై ఇజ్రాయెల్ భారీ దాడులకు స్కెచ్ గీస్తున్నట్లు తెలుస్తోంది. నేడో రేపో దాడులను చేసే ఆస్కారం ఉందని అంతర్జాతీయ సమాజం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇదే గనుక జరిగితే మూడో ప్రపంచయుద్ధానికి కూడా పరిస్థితులు దారి తీయొచ్చని తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతోంది.
భారత్ హై అలర్ట్..
ఇరాన్–ఇజ్రాయెల్ మధ్య యుద్ధమేఘాలు కమ్ముకోవడంతో భారత్ అప్రమత్తమైంది. ఇరాన్ లో ఉన్న భారతీయులు టెల్ అవీవ్ లోని భారత రాయబార కార్యాలయంతో సంప్రదింపుల్లో ఉండాలని బయటికి వెళ్లవద్దని సలహా జారీ చేసింది. భారత్ నుంచి టెల్ అవీవ్ కు నడిచే అన్ని విమానాలను రద్దు చేసింది. మధ్యప్రాచ్యం ఆకాశమార్గం ద్వారా పయనించే విమానాల దారిని మళ్లించింది.