ప్రతి ఒక్కరూ ఓటు వేయండి.. పోలింగ్ శాతం పెరగాలి: కిషన్ రెడ్డి
అంబర్ పేట నియోజకవర్గంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో కిషన్ రెడ్డి పాల్గొన్నారు.
- చేసిన అభివృద్ధి మీ ముందు పెట్టాను
- మీ బిడ్డగా ఆశీర్వదించి గెలిపించండి
- అంబర్ పేట ఎన్నికల ప్రచారంలో కేంద్ర మంత్రి
-
నా తెలంగాణ, హైదరాబాద్:
సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని, ఈసారి పోలింగ్ శాతాన్ని రికార్డు స్థాయిలో పెంచాలని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. సికింద్రాబాద్ ఎంపీగా తాను చేసిన అభివృద్ధి ప్రజల ముందు పెట్టానని, ప్రజలు మరోసారి ఎంపీగా ఆశీర్వదించాలని ఆయన కోరారు. ఈ మేరకు శుక్రవారం అంబర్ పేట నియోజకవర్గంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో కిషన్ రెడ్డి పాల్గొన్నారు. నల్లకుంట శంకర్ మట్ లోని సిరి సంపద అపార్ట్ మెంట్ వాసులతో సమావేశమై మాట్లాడారు.
దేశ భద్రత కోసం ఓటు వేయండి..
మే13న జరిగే ఎన్నికల్లో దేశం కోసం, దేశ భద్రత కోసం, సమగ్రత కోసం, రక్షణ కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం ఓటు వేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సూచించారు. ‘‘దేశంలో బీజేపీ, మోదీయేతర ప్రభుత్వాలు ఏర్పడితే ఆరు నెలలకు ఒకసారి ప్రధాని మారే పరిస్థితి ఉంటుంది. అభివృద్ధి కుంటుపడుతుంది. కాబట్టి ప్రజలు ఆలోచించి ఓటు వేయాలి. ఓటు హక్కు వినియోగించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. పాతబస్తిలో 80 % పోలింగ్ నమోదైతే మన ప్రాంతంలో 40 % మించడం లేదు. సామూహికంగా అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరుతున్నాను. మీరు ఓటు వేసిన తర్వాత మీ సోషల్ మీడియా వేదికగా మీ మిత్రులతో పంచుకోండి. ఎంపీగా, కేంద్ర మంత్రిగా గత ఐదేళ్లు నేనేం కార్యక్రమాలు చేశానో పుస్తకాల ప్రజెంటేషన్ ద్వారా మీ ముందు ఉంచాను. నన్ను మరోసారి గెలిపించాలి. మోదీని గెలిపించండి.. ఎంపీగా నన్ను ఆశీర్వదించండి”అని కోరారు.
బూత్ కమిటీ ప్రతినిధులతో భేటీ..
బీజేపీ హైదరాబాద్ నగర కార్యాలయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఖైరతాబాద్ నియోజకవర్గంలోని బూత్ కమిటీ అధ్యక్షులు, ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఎన్నికల ప్రచార సరళిపై సమీక్షించిన బీజేపీ స్టేట్ చీఫ్.. ఎన్నికల్లో కమలం పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని కోరారు. ఎల్బీ స్టేడియంలో జరిగే ప్రధాని మోదీ సభను విజయవంతం చేయాలని సూచించారు.