ఫోన్‌ట్యాపింగ్ కేసులో కేసీఆర్ పేరు
ఫోన్ ట్యాపింగ్ కేసులో తొలిసారి మాజీ సీఎం, బీఆర్‌ఎస్ చీఫ్ కేసీఆర్ పేరు వెలుగులోకి వచ్చింది.

- రాధాకిషన్ రావు వాంగ్మూలంలో బయటకు
- కేసీఆర్ వ్యవహారాలను చక్కబెట్టేందుకే అంతా పనిచేశాం
- బీఆర్‌ఎస్ డబ్బు రవాణాకు సహకరించేవాళ్లం
- ‘పెద్దాయన(కేసీఆర్)కు చిన్న విమర్శ ఎదురైనా చిరాకు పడేవారు
- అందుకే.. ప్రభుత్వానికి వ్యతిరేక నిరసనలను అణచివేసేవాళ్లం
- టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ కన్ఫెషన్ స్టేట్ మెంట్ లో వెల్లడి
నా తెలంగాణ, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో తొలిసారి మాజీ సీఎం, బీఆర్‌ఎస్ చీఫ్ కేసీఆర్ పేరు వెలుగులోకి వచ్చింది. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్(ఎస్‌ఐబీ) కేంద్రంగా సాగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆర్, ఆయన కుటుంబసభ్యులు, పార్టీలో ఆయన సన్నిహితుల వ్యవహారాలను చక్కబెట్టేందుకే తామంతా కలిసి పనిచేశామని టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ(ఓఎస్డీ) రాధాకిషన్‌రావు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ ద్వారా ప్రణీత్‌కుమార్ అందించే వివరాలతో.. కేసీఆర్ రాజకీయ ప్రత్యర్థులను, వారికి ఆర్థిక సాయం అందించేవారిని బెదిరించి లొంగదీసుకునేవారమని, సివిల్ తగాదాల్లో సెటిల్మెంట్లు చేసేవారమని, ఎన్నికల్లో వారి నగదు తరలింపును అడ్డుకునేవారమని చెప్పారు. బీఆర్‌ఎస్ డబ్బు రవాణాకు సహకరించేవారమని తెలిపారు. గత నెల 3 నుంచి 10వ తేదీ వరకు దర్యాప్తు అధికారులు రాధాకిషన్‌ను కస్టడీలోకి తీసుకుని, విచారించిన విషయం తెలిసిందే..! ఆ క్రమంలో గత నెల 9వ తేదీన సేకరించిన వాంగ్మూలంలో.. రాధాకిషన్ పలుమార్లు అప్పటి సీఎం కేసీఆర్ పేరును ప్రస్తావించారు. ‘‘పెద్దాయన(కేసీఆర్)కు చిన్న విమర్శ ఎదురైనా చిరాకు పడేవారు. అందుకే.. ఎక్కడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు, ఆందోళనలు జరగకుండా అణచివేసేవాళ్లం’’ అని వాంగ్మూలంలో రాధాకిషన్ పేర్కొన్నారు.
హైకోర్టును ఆశ్రయించిన బీఆర్ఎస్
లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్‌పై అసత్య ప్రచారాలు చేస్తున్నారంటూ తెలంగాణ హైకోర్టులో బీఆర్ఎస్ పిటిషన్ దాఖలు చేసింది. ఇప్పటికే ఎలక్షన్ కమిషన్‌కు ఈ వ్యవహారంపై ఫిర్యాదు చేశామని, అయినప్పటికీ పట్టించుకోవడం లేదని పిటిషన్‌లో బీఆర్ఎస్ పేర్కొంది. ఫోన్ టాపింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ నేతలపై ప్రచారం చేస్తున్న నేతలపై చర్యలు తీసుకోవాలని పిటిషనర్ కోరారు. పలు సందర్భాల్లో బీఆర్ఎస్ నాయకులపై చేసిన ఆరోపణలను పిటిషనర్ కోర్టుకు సమర్పించారు. తమ ఫిర్యాదుపై ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకునేలా ఆదేశించాలని కోరారు. అయితే ఈ ఫిర్యాదుపై శుక్రవారం స్పందిస్తామని ఎలక్షన్ కమిషన్ కోర్టుకు తెలిపింది.
ఇప్పుడే ఎలా బయటకు?
ఫోన్ ట్యాపింగ్ కేసులో టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ వాంగ్మూలంలో కేసీఆర్ ప్రస్తావన ఉన్న విషయం ఇంత స్పష్టంగా ఇప్పుడే ఎందుకు బయటకొచ్చింది? దీన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే.. పోలింగ్ కు వారం రోజుల ముందు లీక్ చేసిందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ కూడా ప్రభుత్వంపై గతంలో ఇలాంటి ఆరోపణలే చేసింది. ప్రభుత్వం లీకులు ఇస్తూ.. ఆరు గ్యారంటీల నుంచి ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తోందని ఆరోపించింది.