నా తెలంగాణ, నిర్మల్: జిల్లాలోని నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి పొందేలా వృత్తి నైపుణ్య శిక్షణను అందించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. నిరుద్యోగ యువతకు శిక్షణపై జిల్లాస్థాయి వృత్తి నైపుణ్య సొసైటీ ప్రతినిధులతో శుక్రవారం ఆమె సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో నిరుద్యోగ యువతీ యువకులకు స్వయం ఉపాధి కల్పించేలా వృత్తి నైపుణ్య శిక్షణలు అందించాలని ఆదేశించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ పథకాల లబ్ధిని పొందేలా వసతితో కూడిన శిక్షణలు అందిస్తున్నాయని తెలిపారు. ఆసక్తి కలిగిన యువతను గుర్తించి వివిధ కోర్సులకు శిక్షణలు పొందేలా యువతను ప్రోత్సహించాలని సూచించారు. జిల్లాలోని ఐటీఐ, పాలిటెక్నిక్, ఇతర వృత్తి నైపుణ్య కేంద్రాల ద్వారా ఎలక్ట్రీషియన్, డీజిల్ మెకానిక్, సోలార్, ఏసీ టెక్నీషియన్, మార్కెటింగ్, బ్యూటీషియన్ తదితర రంగాల్లో శిక్షణను అందించాలన్నారు. వివిధ అంశాల్లో శిక్షణ అందించి జాబ్ మేళాలు నిర్వహించి స్వయం ఉపాధి పొందేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రభుత్వ వృత్తి నైపుణ్య కేంద్రాల ద్వారా శిక్షణను తీసుకున్నవారికి ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలలో మంచి అవకాశాలు ఉన్నాయని తెలిపారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, సీపీవో జీవరత్నం, డీఆర్డీవో విజయలక్ష్మి, ఇంటర్మీడియట్ విద్యాధికారి పరుశురాం, డీటీడీఓ ఆంబాజీ, ఉపాధి కల్పనా అధికారి శంకర్, మెప్మా పీడీ సుభాష్, వృత్తి నైపుణ్య సొసైటీ ప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.