ప్రతి రక్తపు బొట్టుకు ప్రతీకారం
జమ్మూకశ్మీర్ ఎల్జీ మనోజ్ సిన్హా హెచ్చరిక
శ్రీనగర్: ఉగ్రవాదులు చిందించే ప్రతి రక్తపు బొట్టుకు ప్రతీకారం తీర్చుకుంటామని జమ్మూకశ్మీర్ లెఫ్ట్ నెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా హెచ్చరించారు. శనివారం హమ్‌హమాలోని ఎస్‌టిసిలో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బిఎస్‌ఎఫ్) పరేడ్ లో పాల్గొని ప్రసంగించారు. ఉగ్రదాడులపై బీఎస్ఎఫ్ మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతీకారం తీర్చుకోవాలని భద్రతా బలగాలు నిర్ణయించుకున్నాయని ఎల్జీ తెలిపారు. లోయలో అమాయకుల ప్రాణాలు తీసే ఉగ్రవాదాన్ని పూర్తిగా అణగదొక్కేందుకు భద్రతా బలగాల సామర్థ్యాలను పూర్తిగా ఉపయోగిస్తామన్నారు. స్వాతంత్ర్య సిద్ధించినప్పటి నుంచీ పాక్ తన వక్రబుద్ధిని వీడడం లేదని, ఉగ్రవాద కార్యకలాపాలను కొనసాగిస్తూనే ఉందని మండిపడ్డారు. జమ్మూకశ్మీర్ అభివృద్ధికి ఆటంకం కలిగించే ఎలాంటి చర్యలను ఉపేక్షించబోమన్నారు. ఉగ్రవాదాన్ని నిర్మూలించడంలో జమ్మూకశ్మీర్ లోని ప్రతీ ఒక్కరూ కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలతో కలిసి రావాలన్నారు. జమ్మూకశ్మీర్ లో శాంతిని భగ్నం చేయాలని చూస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.