లక్నో: ఉత్తరప్రదేశ్ లోని బహ్రెయిచ్ జిల్లాలో రెండు రోజుల హింసాకాండ తరువాత ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. మంగళవారం సీఎం యోగి ఆదిత్యనాథ్ కాల్పుల్లో మృతిచెందిన రామ్ గోపాల్ మిశ్రా కుటుంబాన్ని కలిశారు. హత్యకు కారకులైన వారిని, గొడవలకు కారకులైన వారిప కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
అయితే యూపీలోని బహ్రెయిచ్ హింసపై కొత్త కోణం తెరపైకి వస్తోంది. ప్రణాళిక ప్రకారమే అల్లర్లకు పాల్పడే ఉద్దేశ్యంతోనే రాళ్లు, కర్రలు, పిస్టోల్లతో నిందితులు సిద్ధంగా ఉన్నారనే ఆరోపణలపై పోలీసుల విచారణ నేపథ్యంలో బలం చేకూరుతోంది. దసరా రోజున అమ్మవారి విగ్రహాన్ని నిమజ్జనం చేసేందుకు వెళుతున్న హిందూ సంఘాలు డీజై పెట్టారని ఆరోపిస్తూ మసీదు నుంచి కొందరు యువకులు బయటకు వచ్చి అభ్యంతరం వ్యక్తం చేసినట్లుగా చెబుతున్నారు. అనంతరమే ఒక్కసారిగా ఈ విగ్రహా ఊరేగింపుపై రాళ్లదాడులు, కాల్పులకు పాల్పడ్డారు. దీంతో స్థానికంగా ఉన్న ఓ ఇంటిపై ఉన్న రామ్ గోపాల్ మిశ్రాకు బుల్లెట్ తగిలి మృతి చెందాడు. దీనిపై చర్యలు తీసుకోవాలని హిందూ సంఘాలు కోరినా పోలీసులు విచారణ పేరుతో అలక్ష్యం ప్రదర్శించారనే వాదనలున్నాయి. దీంతో హిందూ సంఘాలు కూడా పోటాపోటీగా ఆందోళనలు చేపట్టడంతో దుకాణాలు, వాహనాలు, ఇళ్లు అనే తేడా లేకుండా చాలా వాటిపై ఇరువర్గాలు ఒకరిపై మరొకరు దాడులు చేసుకున్నారు. వందలాది వాహనాలు కాలిబూడిదయ్యాయి. భారీ ఆస్థి నష్టం వాటిల్లింది. విషయం తెలుసుకున్న సీఎం ఆదేశాల మేరకు ఓ ఎస్డీ రంగంలోకి దిగి మూడు రోజులుగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయినా రాత్రిపూట పలు ప్రాంతాల్లో రాళ్లదాడులు కొనసాగుతున్నాయి. సీఎం యోగి ఈ దాడులకు ప్రధాన సూత్రధారులెవరో తెలుసుకోవాలని ఆదేశించారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు యంత్రాంగానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
స్థానిక బీజపీ ఎమ్మెల్యే సురేశ్వర్ సింగ మాట్లాడుతూ.. ఈ దాడులు ప్రణాళికతోనే జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారని తెలిపారు. ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నాడని తెలిపారు. వారి కోసం పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారని తెలిపారు. రాళ్లదాడులకు పాల్పడన ఏ ఒక్కరిని వదలవద్దని సీఎం స్పష్టమైన ఆదేశాలిచ్చారని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.