భారత్ కు స్పెయిన్ అధ్యక్షుడు
27 నుంచి 29 వరకు పర్యటన
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: భారత్ తో ద్వైపాక్షిక బంధాలు మరింత బలోపేతం చేసుకోవాలన్న దిశగా స్పెయిన్ అధ్యక్షుడు పెడ్రో శాంచెజ్ 27 నుంచి 29 వరకు భారత్ లో పర్యటించనున్నారు. ఈ విషయాన్ని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో శనివారం తెలిపింది. 18యేళ్ల సుధీర్ఘ సమయం తరువాత స్పెయిన్ అధ్యక్షుడు భారత్ లో పర్యటించడం విశేషం. అంతకుముందు అంతర్జాతీయంగా పలు వేదికలపై ప్రధాని నరేంద్ర మోదీతో పెడ్రో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ స్పెయిన్ అధ్యక్షుడిని భారత్ రావాలని కోరారు. ఈ పర్యటనలో ప్రధాని మోదీ ప్రతినిధి స్థాయిలో చర్చలు జరపనున్నారు. టాటా అడ్వాన్స్ డ్ సిస్టమ్, ఎయిర్ బస్ స్పెయిన్ తో విమానయాన రంగంలో ‘మేక్ ఇన్ ఇండియా’ కింద ఫ్లాగ్ షిప్ కార్యక్రమాన్ని వడోదరలో ప్రారంభించనున్నారు. విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్ కూడా అధ్యక్షుడు పెడ్రోతో భేటీ కానున్నారు. అధికారిక కార్యక్రమాల అనంతరం పెడ్రో ముంబాయిని కూడా సందర్శించనున్నట్లు మంత్రిత్వ శాఖ స్పష్టం చేశారు. ఇరుదేశాల ప్రతినిధి స్థాయి చర్చల్లో వాణిజ్యం, పరిశ్రమలు, చలనచిత్ర పరిశ్రమ తదితర రంగాలపై చర్చలు నిర్వహించి ఒప్పందాలు ఖరారు చేసుకుంటారని మంత్రిత్వ శాఖ వెల్లడించింది.