సనాతన ధర్మ రక్షణ కోసం వారాహి నరసింహ వింగ్
Varahi Narasimha Wing for Protection of Sanatana Dharma
ప్రకటించిన జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
అమరావతి: సనాతన ధర్మాన్ని కించపరిస్తే ఉరుకునేది లేదని, అదే సమయంలో ధర్మాన్ని అనుసరిస్తున్నప్పుడు కొన్ని విలువలను తప్పకుండా పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఆదివారం మీడియా సమక్షంలో ‘వారాహి నరసింహ వింగ్’ ప్రజాసైన్యంతో కూడిన గణాన్ని ప్రకటించారు. ధర్మాన్ని పరిరక్షించేందుకు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో ముందుకు వెళుతున్నట్లు ప్రకటించారు.
చర్చి, మసీదులను కూడా గౌరవించాలన్నారు. సనాతన ధర్మాన్ని దెబ్బతీసేలా వ్యాఖ్యలు, పోస్టులు పెట్టరాదన్నారు. అలా చేస్తే చట్టప్రకారం శిక్షార్హులవుతారని హెచ్చరించారు. తాను ఎన్డీయే తరఫున మాట్లాడడం లేదని జనసేన తరఫున తన అభిప్రాయాలు వినిపిస్తున్నానని తెలిపారు.
ప్రజలందరూ అన్ని మతాలను గౌరవించాలని సూచించారు. ఈ వింగ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తుందన్నారు.
హిందూ దేవాలయాలను సందర్శించేటప్పుడు నియమ నిబంధనలు తప్పక పాటించాలన్నారు. సనాతన ధర్మం లేకుండా దేశం లేదనే విషయాన్ని ప్రతీ ఒక్కరూ తెలుసుకోవాలన్నారు.ఆలయాల్లో ప్రసాదాల స్వచ్ఛత కోసం సనాతన ధర్మ ధృవీకరణ అమలు చేయాలని పేర్కొన్నారు.