సర్వే ఫలితాల్లోనూ ఇద్దరి ఆధిపత్యం
తేల్చలేమంటున్న నిపుణులు
అమెరికన్లు ఎటువైపు మొగ్గు చూపనున్నారో?
నా తెలంగాణ, సెంట్రల్ డెస్క్: అమెరికా అధ్యక్ష ఎన్నికలంటే ఆషామాషీ విషయమేం కాదు. ఈ సీటు కోసం దిగ్గజాల పోటీ కూడా రసవత్తరంగా, హోరాహోరీగానే కొనసాగుతుంది. ఇప్పటికే 70 మిలియన్లకు పైగా ఓటర్లు ఓటు వేశారు. కాగా ఈ విజయంలో ఏడు స్వింగ్ రాష్ర్టాలపైనే ప్రముఖుల దృష్టి ఉండగా, ఈసారి లెక్కలు తప్పే అవకాశం కూడా లేకపోలేదనే వాదనలున్నాయి.
అమెరికాలో ప్రధాన సమస్యలపై ట్రంప్, హారీస్ వాగ్ధానాలు..
యూఎస్ లో అబార్షన్, ఇమ్మిగ్రేషన్, ఎకానమీ, ఫారిన్ పాలసీ, స్థానికత, నిరుద్యోగం, మధ్యప్రాచ్యంలో యుద్ధం, రష్యా–ఉక్రెయిన్ యుద్ధం, వంటివి ప్రధాన సమస్యలుగా ఉన్నాయి. ఈ సమస్యలపై డోనాల్డ్ ట్రంప్, కమలా హారీస్ ల వాగ్ధానాల పరంపర కొనసాగింది. ఈ నేపథ్యంలో ఇరువురి మధ్య గట్టి పోటీ నెలకొంది. అభ్యర్థులిద్దరూ ర్యాలీలు, బహిరంగ సభల్లో ఓటర్లను ఆకట్టుకునేందుకు విభిన్న వాగ్ధానాలతో శక్తియుక్తులన్నీ వినియోగిస్తున్నారు.
ఇరువురి వాగ్ధానాలు, హామీలు..
డోనాల్డ్ ట్రంప్..
ట్రంప్ హయాంలో సంపన్నులకు పన్నుల భారాన్ని గణనీయంగా తగ్గించారు. మరోమారు పన్నుల భారం మోపబోమన్నారు. అదే సమయంలో అమెరికాను క్రిప్టో క్యాపిటల్ ఆఫ్ ది ప్లానెట్ గా మారుస్తానని హామీ ఇచ్చారు. ఇమ్మిగ్రేషన్ ను పటిష్ఠపర్చి అక్రమ వలసదారులను పూర్తిగా బహిష్కరిస్తానని తెలిపారు. అబార్షన్ లపై తమది తటస్థ వైఖరి అని ట్రంప్ తెలిపారు. కుటుంబ వ్యవస్థలో పురుషులు, మహిళలు కలిసి నిర్ణయించుకోవాల్సిన అంశమన్నారు. తాను అధ్యక్షుడినైతే ఈ విధానంలో మార్పులు తీసుకువస్తానని తెలిపారు. పునరుత్పాదకత, ఎలక్ర్టిక్ వాహనాలకు సబ్సిడీలను తొలగించడమే తమ లక్ష్యమన్నారు. అదే సమయంలో స్వచ్ఛమైన వాతావరణాన్ని ప్రజలకు అందించేందుకు సమగ్ర వ్యూహాన్ని రూపొందిస్తామన్నారు. పారిస్ వాతావరణ ఒప్పందం నుంచి వైదొలగుతానన్నారు. మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలను పూర్తిగా తొలగిస్తానని హామీ ఇచ్చారు. ఎలా ఉద్రిక్తతలను తగ్గిస్తారనే దానిపై స్పష్టతనీయలేదు. ఇక ఇజ్రాయెల్ యుద్ధం ఆపాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. తాము అధికారంలోకి వస్తే యుద్ధం ఆపేలా చర్యలు తీసుకుంటామన్నారు.
కమలా హ్యారీస్..
దేశ ఆర్థిక వ్యవస్థకు ఆయువు పట్టుగా నిలుస్తున్న ధనవంతులు ఆశించిన స్థాయిలోనే పెంపు ఉంటుందన్నారు. అదే సమయంలో పేద, మధ్యతరగతి వర్గాలకు ఆర్థిక చేయూతనందిస్తామన్నారు. పిల్లలు, గృహ కొనుగోలుదారులు, చిన్న వ్యాపారులపై పన్నుభారం మోపబోమన్నారు. అక్రమ వలసలను కట్టడి చేస్తూనే స్థానికతకు పెద్దపీట వేస్తామన్నారు. ఇమ్మిగ్రేషన్ విధానాలలో మార్పులు తీసుకువస్తామన్నారు. సరిహద్దు భద్రతను అమలు చేయడంతోపాటు మాదకద్రవ్యాల అక్రమ రవాణాను అరికడతామన్నారు. అబార్షన్ లపై అంతిమ నిర్ణయం సదరు మహిళలదే అన్నారు. ఈ విషయంలో పురుషుల నిర్ణయాలను పరిగణనలోకి తీసుకోబోమన్నారు. ఇది మహిళా స్వేచ్ఛకు విరుద్ధమన్నారు. అబార్షన్ హక్కులను పునరుద్ధరిస్తానని అమెరికన్లకు హామీ ఇచ్చారు. అంతర్జాతీయంగా గ్రీన్ ఎనర్జీకి ప్రోత్సాహం ఇస్తుందన్నారు. స్వచ్ఛమైన వాతావరణం ప్రపంచానికి అందజేసేందుకు అమెరికా నాయకత్వం కొనసాగిస్తుందని హారీస్ తెలిపారు. రష్యాకు వ్యతిరేకంగా ఉక్రెయిన్ కు తమ పూర్తి మద్ధతు కొనసాగుతుందని ప్రకటించారు. ఇజ్రాయెల్ దాడులు అమాయక ప్రజల ప్రాణాలు బలిగొంటున్నాయని, వారిని కష్టాల పాలు చేస్తున్నాయని కమలా హారీస్ అన్నారు. యుద్ధం ఆపేందుకు ఉన్న అన్ని చర్యలను తీసుకుంటానని హామీ ఇచ్చారు.