లోయ మదిలో? అందలమెక్కిస్తారా? పుట్టిముంచనున్నారా?

Valley mind?

Aug 29, 2024 - 16:45
 0
లోయ మదిలో? అందలమెక్కిస్తారా? పుట్టిముంచనున్నారా?
స్థానిక పార్టీల్లో పెరుగుతున్న టెన్షన్​ 
మోదీ అభివృద్ధి ఏజెండాగానే దూసుకువెళుతున్న బీజేపీ
భారీ తాయిళాలతో పార్టీలు సిద్ధం.. ఆదరిస్తారా? హ్యాండిస్తారా?
జమ్మూలో మీడియా వార్​ రూమ్​ ప్రారంభం
నా తెలంగాణ, సెంట్రల్​ డెస్క్​: కాశ్మీర్​ లోయ ఓటర్ల మదిలో ఏముంది? ఎవరిని ఈసారి అందలమెక్కిస్తారు? ఎవరిని పుట్టిముంచనున్నారు? అనే టెన్షన్​ అన్ని పార్టీల్లోనూ నెలకొంది. ఉమర్​ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ, గులాంనబీ ఆజాద్​, కాంగ్రెస్​ పార్టీల్లో ఈ టెన్షన్​ ఎక్కువగా కనిపిస్తోంది.
 
ఎన్నికల శంఖారావం పూరించగానే బీజేపీ ఒకింత అడుగు ముందుకేసి మోదీ అభివృద్ధి మంత్రాన్నే భుజానికెత్తేసుకుంది. అదీగాక కేంద్రం ఈ ప్రాంతంలో చేస్తున్న అభివృద్ధి పనులు గతంలో ఏ ప్రభుత్వం చేపట్టకపోవడంతో కూడా ప్రజల ఆలోచనల్లో మార్పులు వచ్చినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. పర్యాటకం పెరుగుదల, రాళ్ల దాడులు పూర్తిగా తగ్గడం, ఉగ్రవాదాన్ని తరిమికొట్టడం, మహిళలు, యువత, విద్యార్థులకు స్వేచ్ఛాయుత వాతావరణం విద్య, వైద్యం, మౌలిక సదుపాయాల కల్పనతో కేంద్ర ప్రభుత్వం తమ పార్టీకి మరింత ఇమేజ్​ ను సొంతం చేసుకుంది. అదే సమయంలో పర్యాటకం అభివృద్ధి చెందుతుండడంతో స్థానిక వ్యాపారులు, దుకాణదారుల్లో కూడా హర్షం వ్యక్తం అవుతోంది. 
 
ఈ నేపథ్యంలో ఇక్కడి ఓటు బ్యాంకు భారీగా బీజేపీ వైపే బదిలీ అవకాశం ఉందని గుర్తించిన స్థానిక పార్టీలు భారీ తాయిళాలతో ప్రలోభాలకు రంగం సిద్ధం చేశారు. కానీ ఎంతోకాలంగా కాశ్మీర్​ లోయలో చేయలేని అభివృద్ధిని ఈ పార్టీలు ఏం చేస్తాయనే ఆలోచన చేస్తున్నారు. అదే సమయంలో స్థానిక నేతలిస్తున్న హామీలకు పైకం ఎలా సమకూరుతుందనే అనుమానాలను కూడా వ్యక్తం చేస్తున్నారు. అదే కేంద్ర పార్టీకి అధికారం ఇస్తే ఇంతకింతకు లోయలో పరిస్థితులు మరింత మెరుగుపడగలవనే ఆశిస్తున్నారు. 
 
ప్రస్తుతం లోయలో ఏ వ్యక్తిని కదిలించినా భిన్నవాదనలు చేస్తున్నప్పటికీ అభివృద్ధి నినాదం వచ్చే సరికి ‘అవునన్నా.. కాదన్నా’ బీజేపీకే మద్ధతిస్తుండడం గమనార్హం. ప్రజల మూడ్​ ను పసిగట్టిన పలువురు నాయకులు బీజేపీలోకి వచ్చి చేరుతున్నారు. అదే సమయంలో ప్రజల మద్ధతు ఉన్న నాయకుల వైపే కేంద్ర పెద్దలు మొగ్గు చూపుతున్నారు. శ్రీనగర్​ మేయర్​ జునైద్​ బీజేపీలో చేరే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు. కొత్తగా పార్టీ స్థాపించిన గులాంనబీ ఆజాద్​ పార్టీ పరంగా చేపట్టిన విశ్లేషణలో పలు విషయాలు తేటతెల్లం కావడంతో ఈ ఎన్నికల్లో ప్రచారం చేయబోనని చెప్పారు. దీని వెనుక ఉన్న అసలు కారణం కూడా ఇదేనని స్థానిక పార్టీలకు ఓటమి ఖాయమనే ప్రచారం జరుగుతోంది. 

 
మరోవైపు గురువారం బీజేపీ కేంద్రమంత్రి జి.కిషన్​ రెడ్డి, తరుణ్​ చుగ్​, జితేంద్ర సింగ్​, జుగల్​ కిశోర్​, రవీంద్ర రైనాలు జమ్మూకశ్మీర్​ లో పార్టీ మీడియా కార్యాలయాన్ని ప్రారంభించారు. ఇక ఇక్కడి నుంచే విస్తృత ప్రచారానికి తెర తీయనున్నారు. లోయలో బీజేపీ జెండా పాతాలనే ఉత్సుకతతో బీజేపీ పెద్దలున్నారు. ప్రజల అభీష్టం తమకు అనుకూలంగా ఉండడంతో ప్రచార సరళిలో కూడా మరింత ముందుకు దూసుకువెళ్లాలని నిర్ణయించారు. అదే సమయంలో పలు విషయాలపై ఆచి తూచి వ్యవహరించాలని నిర్ణయించారు. మోదీ నేతృత్వంలో అభివృద్ధే ఏజెండాగా జమ్మూలో కాషాయ జెండా పాతాలనే గట్టి ప్రయత్నాలను మొదలుపెట్టారు.