ఘనంగా గాంధీ జయంతి వేడుకలు

Grand Gandhi Jayanti celebrations

Oct 2, 2024 - 18:26
 0
ఘనంగా గాంధీ జయంతి వేడుకలు
నా తెలంగాణ, నిర్మల్: మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా బుధవారం కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ అభిలాష అభినవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ జానకి షర్మిల తమ సిబ్బందితో కలిసి గాంధీజీ త్యాగాలను కొనియాడారు. స్థానిక గాంధీ పార్క్ లో మునిసిపల్ చైర్మన్ ఈశ్వర్, డిసిసి అధ్యక్షుని క్యాంప్ కార్యాలయంలో అధ్యక్షులు శ్రీహరి రావు, బీజేపీ కార్యాలయంలో అధ్యక్షులు అంజు కుమార్ రెడ్డి నేతృత్వంలో జయంతి వేడుకలు నిర్వహించారు.
 
డిజిటల్ కార్డుల ప్రక్రియలో నిర్లక్ష్యం తగదు: కలెక్టర్​

అర్హులైన కుటుంబాలకు డిజిటల్ కార్డులకు సంబంధించిన సర్వేను పకడ్బందీగా చేపట్టాలని, నిర్లక్ష్యం తగదని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. డిజిటల్ కార్డుల సర్వేపై సంబంధిత అధికారులకు బుధవారం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గురువారం నుంచి చేపట్టనున్న డిజిటల్ సర్వేను పకడ్బందీగా చేపట్టాలని ఆదేశించారు. సర్వేలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్లి ప్రతి ఒక్కరికి డిజిటల్ నెంబర్ ను కేటాయించడంతో పాటు, కుటుంబానికి ఒక నంబర్ ను ఇవ్వాలని తెలిపారు. సర్వే ను ఐదు రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రతి నియోజకవర్గంలో ఒక గ్రామం, ఒక వార్డును పైలెట్ ప్రాజెక్టుగా సర్వే చేపట్టాలని సూచించారు. రోజువారీగా నిర్వహించిన డిజిటల్ సర్వేకు సంబంధించిన నివేదికలను తమకు అందజేయాలని అధికారులను ఆదేశించారు. 
 
ఈ సర్వేకు సంబంధించి నిర్మల్, ముధోల్ నియోజకవర్గాలకు ఆర్డీవోలు, ఖానాపూర్ నియోజకవర్గానికి జడ్పిసిఈఓ నోడల్ అధికారులుగా వ్యవహరిస్తారని తెలిపారు. ఈ అవగాహన కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిషోర్ కుమార్ లు, డిఆర్ఓ భుజంగ్ రావు, డిపిఓ శ్రీనివాస్, ఈడిఎం నదీం, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లు, అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.