Kishanreddy: దేశం కోసం ఓటేయండి
Union Minister Kishan Reddy asked everyone to vote for Modi and for the country
- మోదీ పాలనపై ఎవరితోనైనా చర్చకు సిద్ధమే: కిషన్ రెడ్డి
- గత పదేండ్లలో ఉగ్రవాద దాడులు తగ్గాయి
- ఉదయం 10 లోపు ఓటు వేయండి
- దేశం కోసం మరోసారి మోదీని గెలిపిద్దాం
- 10న ప్రధాని సభను సక్సెస్ చేయాలి
- బీజేపీ యువ సమ్మేళనంలో కేంద్ర మంత్రి కామెంట్స్
నా తెలంగాణ, హైదరాబాద్: దేశం కోసం ప్రతి ఒక్కరూ వారి ఓటు హక్కును వినియోగించుకోవాలని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. గత పదేండ్లలో ఉగ్రవాద దాడులు బాగా తగ్గాయని, దేశం కోసం, సమాజం కోసం మరోసారి మోదీని గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ మేరకు సోమవారం సికింద్రాబాద్ పార్లమెంట్ ముషీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో నిర్వహించిన బీజేపీ యువ సమ్మేళనంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి, బీజేపీ ఎంపీ డా.కె. లక్ష్మణ్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ..‘‘10వ తేదీన ప్రధాని మోదీ హైదరాబాద్ వస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొని మోదీకి మద్దతు తెలియజేయాలని హైదరాబాద్ యువతను ఆహ్వానిస్తున్నాను. దేశం కోసం కోసం సమాజం కోసం మోదీని మరోసారి గెలిపించుకోవాలి. వారి నాయకత్వం దేశానికి చాలా అవసరం”అని పిలుపునిచ్చారు.
పోలింగ్ లో పాల్గొనండి..
13వ తేదీనాడు ఉదయాన్నే ప్రతి ఒక్కరూ పోలింగ్ లో పాల్గొనాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కోరారు. ‘‘బూత్ కు వెళ్లి మొదటి ఓటు వేయండి. అది మీకు మెమొరబుల్ గా ఉండాలి. మీ స్నేహితులు, మీ కుటుంబ సభ్యులతో కలిసి గ్రూప్ గా వెళ్లండి. పోయే ముందు ఫొటో తీసుకుని, ఓటు వేసిన తర్వాత ఫొటో తీసుకుని.. రెండు ఫొటోలు మీ సోషల్ మీడియాలో పోస్టు చేయండి. దేశం కోసం మోదీకి ఓటేస్తున్నం అనే విషయం గుర్తుంచుకోవాలి. మీ బంధువులు, స్నేహితులు వేరోచోట ఉన్నా ఫోన్ చేసి.. వారిని పోలింగ్ కేంద్రాలకు వెళ్లేలా ప్రోత్సహించాలి. మోదీకి అనుకూలంగా ఉన్న ఓటర్లంతా.. ఉదయం 10 గంటల్లోపు ఓటేయాలి. పేదవాడి టాయిలెట్ల నిర్మాణం నుంచి చంద్రయాన్ వరకు ప్రతిచోటా మనం ప్రగతి సాధిస్తున్నాం. దేశంలో ఉగ్రదాడులు తగ్గిపోయాయి. ఇది మోదీ ప్రభుత్వ ఘనత పదేళ్లలో మోదీ ప్రభుత్వం చేసిన పనులపై ఎవరితోనైనా చర్చించేందుకు సిద్ధమే”అని కిషన్ రెడ్డి సవాల్ విసిరారు.
యూసీసీ అమలు చేస్తం: డా.కె.లక్ష్మణ్
యూసీసీని అమలు చేసిన తొలి రాష్ట్రం ఉత్తరాఖండ్ అని, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి నేతృత్వంలో మొదటిసారి అమలు చేస్తున్నారని బీజేపీ రాజ్య సభ సభ్యుడు డా.కె. లక్ష్మణ్ అన్నారు. దేశమంతా యూసీసీ అమలు కోసం ఎదురుచూస్తోందని ఆయన పేర్కొన్నారు. ‘‘మూడోసారి మోదీ పీఎం అయ్యాక.. అమలు చేసి తీరతాం. దేశమంతా ఇవాళ మోదీ వైపు చూస్తోంది. మోదీకి సరిపోయే వ్యక్తి దేశంలో భూతద్దం పెట్టి వెతికినా కనిపించడం లేదు. యువశక్తి మన ప్రధాన బలం. మన యువతే మోదీ భవిష్యత్ భారత నిర్మాణంలో కీలకంగా మారనున్నారు. పెద్ద సంఖ్యలో ఓటు వేయడం ద్వారా మోదీకి అండగా నిలవాలని కోరుతున్నాను. అభివృద్ధి, సంక్షేమమే మోదీ పాలన ఎజెండా”అని అన్నారు.