జగన్నాథుని కొడుకొస్తున్నాడు దోచుకున్న వారి పనిపడతాడు
నిరుపేదల సంక్షేమమే తమకు ముఖ్యం రాష్ర్ట అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం జూన్ 6న సీఎం అభ్యర్థి ఎంపిక, 10న ప్రమాణ స్వీకారం ఒడిశా ప్రజలందరికీ ఇదే తన ఆహ్వానం రూ. 10 వేల కోట్లిస్తే సదుపాయాలు కల్పించలేదు మహిళా స్వావలంభన నిధులతో జేబులు నింపుకున్నారు బెర్హంపూర్ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ
న్యూఢిల్లీ: ఒడిశాకు జగన్నాథుని కుమారుడు త్వరలో రాబోతున్నాడని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈ ప్రాంతాన్ని దోచుకున్న వారి పని పడతాడని పేర్కొన్నారు. త్వరలో ఒడిశాలో డబుల్ ఇంజన్ ప్రభుత్వం తప్పక వస్తుందని ఈ ప్రాంత అభివృద్ధితోపాటు, నిరుపేదల సంక్షేమమే తమకు ముఖ్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు.
సోమవారం ఒడిశాలోని బెర్హంపూర్ లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు. విపక్షాల తీరును తూర్పారబట్టారు.
దేశంలో బలమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఒక యాగం లాంటిందన్నారు. ఆ యాగాన్ని బీజేపీ ఖచ్చితంగా పరిపూర్ణంగా నిర్వహించి తీరుతుందన్నారు. ఇక్కడి ప్రజల కలలు, ఆకాంక్షలకు అనుగుణంగా పాలన త్వరలో లభించనుందన్నారు. మహిళలు, కుమార్తెల సామర్థ్యాలను వెలికితీసి ప్రపంచంలో చాటిచెబుతామని తెలిపారు. ఒడిశా అభివృద్ధి కోసం బీజేపీ దూరదృష్టితో వ్యవహరిస్తూ పరిపాలన కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.
బిజూ జనతా దళ్ (బీజేడీ) ప్రభుత్వం గడువు జూన్ 4తో ముగియబోతుందని గుర్తుంచుకోవాలన్నారు. ప్రజాభీష్ట పాలకు మద్ధతు పలకాలని స్పష్టం చేశారు. త్వరలో రాబోతున్న బీజేపీ ప్రభుత్వ ప్రమాణస్వీకారోత్సవానికి అందరినీ ఆహ్వానించేందుకు ఇక్కడకు వచ్చానని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.
ప్రభుత్వం ఏర్పడగానే జూన్ 6న ఇక్కడి సీఎం అభ్యర్థిని ప్రకటిస్తామని 10న సీఎం ప్రమాణ స్వీకారోత్సవం జరుగుతుందని ఆ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులేనని తెలిపారు. మీ ఆశీర్వాదం తమకు అందించాలని ప్రధాని విజ్ఞప్తి చేశారు.
కాంగ్రెస్ ఇక్కడ ఓడిపోయిందని, బీజేడీ పతనమైపోయిందన్నారు. ప్రజలు బీజేపీపై పూర్తి నమ్మకంతో ఉన్నారని స్పష్టం చేశారు. ఉదయించే సూర్యుడిలా బీజేపీ ఉద్భవించనుందని తెలిపారు. ఒడిశా అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం రూ. 10 వేల కోట్లు ఇస్తే ఆ డబ్బును కూడా ఖర్చు చేయలేని చేతకాని దద్దమ్మ ప్రభుత్వం ఇక్కడ ఉందని విమర్శించారు. గ్రామాల్లో రోడ్లు, నీరు, విద్యుత్, విద్య, వైద్యం లాంటి మౌలిక సదుపాయాలు కల్పించలేక చతికిలపడ్డారని విమర్శించారు. నిరుపేదల కోసం ఉచిత బియ్యం పంపిణీ కార్యక్రమం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఆ కార్యక్రమం కూడా తమదే అని చెప్పుకుంటున్న సిగ్గులేని బీజేడీ ప్రభుత్వం ఇక్కడ ఉందని మండిపడ్డారు. మహిళా స్వావలంబనకు అనేక పథకాలు రూపకల్పన చేసి కేంద్ర ప్రభుత్వం నిధులు అందజేస్తుంటే ఆ నిధులను ఇతర రూపాల్లో ఖర్చు చేసుకుంటూ తమ జేబులు నింపుకుంటూ పబ్బం గడుపుకుంటున్న బీజేడీ, కాంగ్రెస్ లకు బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని ప్రధాని నరేంద్ర మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు.