అవినీతి, అనుకూల వ్యక్తులను కాపాడే ప్రయత్నం
రాజీనామా లేఖను సీఎం మమతకు పంపిన సర్కార్
కోల్ కతా: మెడికో హత్య అనంతరం టీఎంసీ ప్రభుత్వం తీసుకుంటున్న వరుస నిర్ణయాలకు కలత చెందిన ఆ పార్టీ ఎంపీ రాజ్యసభకు రాజీనామా చేశారు. ఆదివారం రాజీనామా లేఖను తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మమత బెనర్జీకి ఎంపీ జవహర్ సర్కార్ పంపారు. ఈ లేఖలో పలు విషయాలపై ఆవేదన వ్యక్తం చేశారు.
మెడికో హత్య నేపథ్యంలో సీఎం మమత కఠిన చర్యలు తీసుకుంటారని భావించినా ప్రజాభీష్టం మేరకు ఆమె చర్యలు తీసుకోలేదన్నారు. ప్రతిపక్షాలు, ప్రజలు, విద్యార్థులు ఆందోళనలు ఉధృతమయ్యాకే ఆమె చర్యలు చేపట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ర్టంలో శాంతిభద్రతలు నెలకొల్పాలని, నిందితులను వెంటనే కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉందని అన్నారు.
టీఎంసీ ప్రభుత్వం అవినీతిపరులు, తమకు అనుకూలమైన వ్యక్తులను కాపాడేందుకు ప్రయత్నిస్తుందన్న ఆరోపణలే ప్రజల ఆగ్రహానికి గురయ్యాయని అన్నారు.
గ్రామ పంచాయితీల నుంచి మున్సిపాలిటీలు, నగరాలు వరకు టీఎంసీ నాయకులు అవినీతి ద్వారా భారీగా ఆస్తులను కూడబెట్టారని ఎంపీ జవహర్ సర్కార్ మండిపడుతూ రాజీనామా లేఖను సీఎం మమతకు పంపారు.