భారత్ లో ప్రపంచ సుందరి పోటీలు
ముంబై జియో కన్వెన్షన్ సెంటర్లో తళుక్కుమన్న 112 దేశాల మోడళ్లు. 28 ఏళ్ల తర్వాత భారత్ వేదికగా పోటీలు. హోస్ట్ గా కరణ్ జోహర్
ముంబై: 28 ఏళ్ల తరువాత శనివారం భారత్ లో ప్రపంచ సుందరి పోటీలు జరుగుతున్నాయి. ముంబైలోని జియో కన్వెన్షన్ సెంటర్లో శనివారం ఈ పోటీలు ప్రారంభమయ్యాయి. క్రికెటర్ హర్భజన్ సింగ్, మహారాష్ర్ట ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, కృతిసనన్, పూజా హెగ్డేలు హాజరయ్యారు. పోటీలకు హోస్ట్ గా ప్రముఖ సినీ నిర్మాత కరణ్ జోహర్ వ్యవహరిస్తున్నారు. 1996 తరువాత ప్రపంచ సుందరి పోటీలకు భారత్ మళ్లీ ఇన్నాళ్లకు ఆతిథ్యం ఇస్తున్నది. పోటీల్లో వంద దేశాలకు చెందిన మోడళ్లు పాల్గొన్నారు. 1996లో ప్రపంచ సుందరి పోటీలు బెంగళూరులో నిర్వహించేందుకు అనుమతి పొందగా, అక్కడ పెద్ద యెత్తున ఆందోళనలు, ఉద్యమాలు చేశారు. అన్ని ప్రతికూలతలను దాటుకొని ఈ పోటీలను నిర్వాహకులు విజయవంతంగా నిర్వహించారు. మిస్ వరల్డ్ పోటీలో విజేతల ఎంపికను ఆరు రౌండ్ల అనంతరం ప్రకటిస్తారు. శనివారం జరిగే పోటీల్లో మొదటి రౌండ్లో112 మంది పాల్గొననున్నారు. రెండో రౌండ్లో 40, మూడో రౌండ్లో 12, నాలుగో రౌండ్లో 8, ఐదో రౌండ్లో నలుగురు మిగులుతారు. 6వ రౌండ్లో విజేతను ప్రకటిస్తారు. ఇప్పటివరకు భారత్ నుంచి పోటీలో నిలిచి 1966లో రీతా ఫరియా, 1994లో ఐశ్వర్య రాయ్, 1997లో డయానా హెడెన్, 1999లో యుక్తాముఖీ, 2000లో ప్రియాంక చోప్రా, 2017లో మానుషి చిల్లర్ ప్రపంచ సుందరి కిరీటం సాధించారు.
సినిశెట్టి ప్రాతినిధ్యం..
ప్రపంచ సుందరి 2024 పోటీల కోసం ఫెమినా మిస్ ఇండియా-2022 విజేత సిని శెట్టి భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 71వ ప్రపంచ సుందరి కిరీటాన్ని గెలుచుకోవడానికి భారీ సంఖ్యలో సుందరీమణులు పోటీ పడుతున్నారు. జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లోని జాస్మిన్ హాల్‌లో ఏకకాలంలో 25 వేల మంది కూర్చునే సదుపాయం ఉన్నా సీట్లన్నీ నిండిపోవడం విశేషం.