Kishan Reddy: ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్
Union Minister Kishan Reddy said that the Modi government is going to come to power once again
- – బీజేపీ ప్రభుత్వమే దేశానికి రక్ష: కిషన్ రెడ్డి
- – మరోసారి మోదీని ప్రధానిగా గెలిపించుకుందాం
- – సికింద్రాబాద్ ఎంపీగా ఆశీర్వదించండి
- – జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కేంద్రమంత్రి ప్రచారం
నా తెలంగాణ, హైదరాబాద్:
బీజేపీ ప్రభుత్వమే దేశానికి రక్ష అని, మోదీని మరోసారి ప్రధానిగా గెలిపించుకుందామని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ మేరకు బుధవారం ఆయన జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో జీప్ యాత్రలో పాల్గొని ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘మే13న జరిగే పార్లమెంటు ఎన్నికల్లో దేశ ప్రధానమంత్రిగా ఎవరు ఉండాలో మనమందరం మన ఓటుతో నిర్ణయించుకుందాం. దేశంలో ఏ పార్టీ అధికారంలో ఉండాలో, ఎవరు ప్రధానమంత్రి అయితే దేశం సుభిక్షంగా, భద్రంగా, అభివృద్ధి చెంది మన పిల్లలకు ఉజ్వల భవిష్యత్తునిస్తుందో ఆలోచించాలి. నరేంద్ర మోదీ దేశానికి అనేక సేవలు చేశారు. ఆయనను మళ్లీ గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది”అని అన్నారు.
పేదల కష్టాలు తెలిసిన నాయకుడు
అత్యంత పేద కుటుంబంలో పుట్టిన మోదీ.. దేశ ప్రధానిగా పేదల కష్టాలు తొలగించేందుకు కృషి చేశారని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. ‘‘కరోనా కష్టకాలంలో ఉచిత వ్యాక్సిన్లు అందించి మోదీ మన ప్రాణాలు కాపాడారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు పేదలకు ఉచితంగా 5 కేజీల రేషన్ బియ్యం అందిస్తున్నారు. పేద ప్రజలకు ఉచితంగా బ్యాంకు అకౌంట్లు, ఎల్పీజీ సిలిండర్లు, ఆయుష్మాన్ భారత్ పథకంతో రూ.5 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తున్నారు. రానున్న రోజుల్లో రూపాయి లేకుండా వైద్యం అందించాలని మోదీ నిర్ణయించుకున్నారు. పొదుపు సంఘాలకు రూ.20 లక్షల వరకు రుణాలు అందిస్తున్నాం. బేటీ బచావో బేటీ పడావో పథకంతో గర్భంలోనే ఆడపిల్లను చంపే సంస్కృతిని తొలగించారు. కాంగ్రెస్ హయాంలో మతఘర్షణలు, బాంబు పేలుల్లు జరిగేవి. మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత దేశంలో బాంబు పేలుల్లు, మతకలహాలు లేవు. ప్రతీ ఒక్కరు వచ్చే నెల 13న ఓటు హక్కు వినియోగించుకోవాలి. కమలం పువ్వు గుర్తు మీద ఓటు వేసి మోదీని, సికింద్రాబాద్ ఎంపీగా నన్ను ఆశీర్వదించాలి”అని కిషన్ రెడ్డి ప్రజలను కోరారు.