Mahabubabad: మానుకోట విజేత ఎవరు?
BJP, BRS and Congress are competing strongly in Mahabubabad
- మహబూబాబాద్ లో త్రిముఖ పోటీ
- బీజేపీ నుంచి సీతారాం నాయక్
- కాంగ్రెస్ నుంచి బలరాం నాయక్
- బీఆర్ఎస్ నుంచి మలోత్ కవిత
- మోదీ మేనియా, సీతారాం నాయక్ ఇమేజ్ బీజేపీకి ప్లస్
- ఎస్టీని రాష్ట్రపతి చేసిన మోదీ ప్రభుత్వంపై ఎస్టీల్లో సానుకూలత
- ఎమ్మెల్యేలను నమ్ముకున్న కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్
- సిట్టింగ్ స్థానంలో మరోసారి సత్తా చాటాలని బీఆర్ఎస్ ప్రయత్నం
మహబూబాబాద్.. పార్లమెంట్ ఎన్నికల రాజకీయం రసవత్తరంగా మారింది. ముగ్గురు ఉద్దండుల మధ్య హోరాహోరీ పోరు కనిపిస్తున్నది. వరుసగా రెండుసార్లు పరాజయం పాలైనా.. అసెంబ్లీ ఫలితాల జోరు.. రాష్ట్రంలోని దక్కిన అధికారం అండగా క్షేత్రస్థాయి బలం, బలగంతో ఈ సారి విజయం దక్కించుకోవాలని బలరాం నాయక్.. గిరిజన యూనివర్సిటీ అందించడమే కాదు.. గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపిన కేంద్ర సర్కార్ పనితీరే విజయం తెచ్చిపెడుతుందని.. బీజేపీ అభ్యర్థి అజ్మీరా సీతారాంనాయక్ సమరానికి సై అంటుండగా, మరోసారి సత్తా చాటాలని బీఆర్ఎస్ నుంచి మాలోతు కవిత ఆరాటపడుతున్నారు. ఇలా త్రిముఖ పోటీ నెలకొన్న మహబూబాబాద్ పార్లమెంట్ స్థానంలో గెలుపు ఎవరిదనేది ఆసక్తికరంగా మారింది.
నా తెలంగాణ, మహబూబాబాద్/డోర్నకల్:
మహబూబాబాద్ కు మానుకోట అనే పేరు కూడా ఉంది. ఎస్టీ జనాభా ఎక్కువ ఉన్న ఈ లోక్ సభ నియోజకవర్గం ఎస్టీ రిజర్వ్ డ్ కావడం గమనార్హం. మహబూబాబాద్ లోక్ సభ నియోజకవర్గ పరిధిలో లోక్‌సభ స్థానం పరిధిలో ఏడు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. వీటిలో వరంగల్ జిల్లాకు చెందిన నర్సంపేట ఒక్కటే జనరల్ స్థానం కాగా, ములుగు, మహబూబాబాద్, డోర్నకల్‌లతో పాటు ఖమ్మం జిల్లాలోని ఇల్లెందు, భద్రాచలం, పినపాక అసెంబ్లీ నియోజకవర్గాలు కూడా ఎస్టీలకు రిజర్వ్ చేసినవే. ప్రస్తుతం ఎంపీ ఎన్నికల బరిలో బీకజేపీ నుంచి అజ్మీరా సీతారాం నాయక్, కాంగ్రెస్ నుంచి బలరాం నాయక్, బీఆర్ఎస్ నుంచి మాలోత్ కవిత బరిలో ఉన్నారు. మహబూబాబాద్ లోక్‌సభ స్థానం నుంచి బలరాం నాయక్ నాలుగోసారి బరిలోకి దిగుతుండటం విశేషం.
మాజీలు వర్సెస్ సిట్టింగ్..
2009లో ఎంపీగా ఎన్నికైన బలరాం నాయక్, 2014, 2019 ఎన్నికల్లో వరుసగా ఓడిపోయారు. ఇప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. 2014లో బీఆర్ఎస్ తరఫున గెలిచిన సీతారాం నాయక్ కు 2019లో టికెట్ దక్కలేదు. ఇటీవల బీజేపీలో చేరిన ఆయన.. కమలం పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. 2019లో ఎంపీగా ఎన్నికైన కవిత బీఆర్ఎస్ తరఫున మళ్లీ బరిలోకి దిగుతున్నారు. ఇలా ఇద్దరు మాజీ ఎంపీలు.. సిట్టింగ్ ఎంపీతో అమీతుమీ తేల్చుకోడానికి సిద్ధమయ్యారు. 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం ఏర్పడింది. ఈ నియోజకవర్గానికి మూడు సార్లు ఎన్నికలు జరిగితే.. రెండుసార్లు బీఆర్ఎస్ అభ్యర్థులు అజ్మీరా సీతారాం నాయక్, మాలోతు కవిత విజయం సాధించారు. మహబూబాబాద్ కు తొలిసారి జరిగిన ఎన్నికల్లో బలరాం నాయక్ గెలువగా.. ఇప్పుడు ముగ్గురూ రెండోసారి ఎంపీగా లోక్ సభలో అడుగుపెట్టేందుకు ఎవరి ప్రయత్నాల్లో వారు ఉన్నారు. గతంలో ఒకసారి ఎంపీగా గెలిచిన ఎవరూ మళ్లీ మానుకోటలో గెలిచి లోక్‌సభలో అడుగుపెట్టకపోవడంతో ఇప్పుడు ఈ ముగ్గురిలో ఎవరిని అదృష్టం వరిస్తుందోనన్న ఆసక్తి నెలకొంది.
మోదీ హవాతో కమలం జోరు..
మానుకోట నియోజకవర్గంలో వివాదరహితుడిగా అజ్మీర సీతారాం నాయక్ కు పేరుంది. బీజేపీ నుంచి బరిలోకి దిగుతున్న ఆయన 2014లో ఇదే పార్లమెంట్ స్థానం నుంచి బీఆర్ఎస్ ఎంపీగా ఎన్నికయ్యారు. తన పాత పరిచయాలు, గతంలో ఎంపీగా ఉన్నసమయంలో చేసిన అభివృద్ధి, బీఆర్ఎస్తో ఉన్న అనుబంధం, ప్రధాని నరేంద్ర మోదీ చరిష్మా తనకు విజయాన్ని తెచ్చి పెడుతుందని ఆయన ధీమాతో ఉన్నారు. మోదీ పదేండ్ల పాలనలో దేశం కోసం, తెలంగాణ కోసం చేసిన పనులతో సమాజంలోని అన్ని వర్గాల ఓట్లు తనకే దక్కుతాయని ఆయన భావిస్తున్నారు. ములుగు, నర్సంపేట నియోజకవర్గాల్లో బీజేపీకి అనుకూల పవనాలు ఉన్నాయి. ఇక్కడ భారీ మెజార్టీ వస్తుందని ఓటర్ల మధ్య ఆసక్తికర చర్చ జరుగుతోంది. ములుగు జిల్లా వెంకటాపురం మండలం మల్లయ్యపల్లి గ్రామానికి చెందిన సీతారాం నాయక్ కేయూలో ప్రొఫెసర్ గా పనిచేశారు. తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా వ్యవహరించి.. ప్రత్యేక రాష్ట్రంలో తొలిసారి ఎంపీగా ఎన్నికయ్యారు. 2019 ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్ దక్కక, కొన్నాళ్లుగా సైలెంట్ అయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇల్లెందు టికెట్ ఆశించారు. కానీ, ఆయనకు బీఆర్ఎస్ చాన్స్ ఇవ్వకపోవడంతో ఇటీవల బీజేపీలో చేరారు. కమలం కండువా కప్పుకున్న మూడు రోజులకే ఆ పార్టీ ఎంపీ టికెట్ ఇచ్చి ప్రచారంలోకి వెళ్లాలని సూచించింది. ప్రధాని మోదీ ఇమేజ్ తో మహబూబాబాద్ లో సునాయాశంగా గెలుస్తానని ధీమాగా ఉన్నారు సీతారాం నాయక్. కాగా ములుగు జిల్లాలో కేంద్ర ప్రభుత్వం కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయడం, సమ్మక్క, సారక్క జాతరకు కేంద్రం నిధులు ఇవ్వడం, కాజిపేట కోచ్ ఫ్యాక్టరీ, వరంగల్ కు మెగా టెక్స్ టైల్ పార్క్ ఏర్పాటుతో ఉపాధి అవకాశాలు మెరుగుపడేందుకు ఆస్కారం ఏర్పడటం, వరంగల్ ఎయిర్ పోర్టు కోసం ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వేగంగా పనులు చేస్తుండటం మానుకోటలో బీజేపీ విజయానికి దోహదపడే అంశాలుగా ఉన్నాయి. అన్నిటికీ మించి ఒక ఎస్టీని రాష్ట్రపతిని చేసిన బీజేపీ పట్ల ఎస్టీల్లో సానుకూల దృక్పథం ఉన్నది. కాబట్టి సీతారాం నాయక్ విజయం దిశగా అడుగులు వేస్తున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఎమ్మెల్యేలే కాంగ్రెస్ కు బలమా..!
మహబూబాబాద్ లోక్ సభ ఎన్నికల్లో పోటీపడుతున్న ముగ్గురు ముఖ్యనేతల్లో కాంగ్రెస్ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ 2009లో మహబూబాబాద్ పార్లమెంటు స్థానం నుంచి విజయం సాధించి లోక్ సభలో అడుగు పెట్టారు. కేంద్ర సహాయమంత్రిగా బలరాం నాయక్ బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండటం, పలుమార్లు ఓటమిపాలైన సానుభూతి తనకు కలిసి వస్తుందని ఆయన భావిస్తున్నారు. ముఖ్యంగా మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎక్కువగా ఉండటం.. తనకే మేలు జరుగుతుందని బలరాం నాయక్ ధీమాగా ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఏడు అసెంబ్లీ స్థానాల్లో ఆరు చోట్ల ఘన విజయం సాధించింది కాంగ్రెస్ పార్టీ. బీఆర్ఎస్ నుంచి గెలిచిన భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కూడా తాజాగా హస్తం గూటికే చేరిపోవడంతో మహబూబాబాద్ లోక్ సభ నియోజకవర్గం మొత్తం స్వీప్ అయింది. అయితే కేంద్రంలో కాంగ్రెస్ పాలనలో ఎస్టీలకు పెద్దగా జరిగిన మేలు ఏమీ లేకపోవడం, ప్రస్తుతం కేంద్రంలో కాంగ్రెస్ వచ్చే అవకాశాలు ఉన్నట్లు ఎక్కడా కనిపించకపోవడం, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఆరు గ్యారంటీలను పూర్తిగా అమలు చేయకపోవడం బలరాం నాయక్ కు ప్రతికూల అంశాలుగా కనిపిస్తున్నాయి.
బలం కోల్పోయిన బీఆర్ఎస్ ..
2019లో మాలోత్ కవిత మహబూబాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి బీఆర్ఎస్ ఎంపీగా ఎన్నికయ్యారు. ఈ నియోజక వర్గం నుంచి పార్లమెంట్లో అడుగుపెట్టిన ఏకైన గిరిజన మహిళగా చరిత్ర సృష్టించారు. ఎంపీగా తాను అందించిన సేవలతోపాటు తన తండ్రి, సీనియర్ నేత రెడ్యానాయక్ ప్రభావం కలిసివస్తుందని ఆశించి మరోసారి బరిలోకి దిగారు. తన అత్తగారి కుటుంబం ఇల్లెందు కావడంతో రాజకీయాలకతీతంగా ఓట్లు పడతాయని ఆమె లెక్కలు వేసుకుంటున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి, సిట్టింగ్ ఎంపీ కవిత తన విజయంపై నమ్మకంతో కనిపిస్తున్నారు. అయితే వ్యక్తిగతంగా ఆమెకు కొంత ఇమేజ్ ఉండటం తప్పా.. పార్టీ పరంగా ఆమెకు ప్రతికూలతలే ఎక్కువగా ఉన్నాయి. మహబూబాబాద్ పార్లమెంట్ నియోజవర్గం పరిధిలోని ఏడు సెగ్మెంట్లలో గెలిచిన ఒక్క బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కూడా కాంగ్రెస్ లో చేరిపోవడం.. మాజీ ఎమ్మెల్యేలు ఎవరూ కవిత ప్రచారానికి సహకరించకపోవడం ఆమెను విజయానికి దూరం చేస్తున్న అంశాలుగా కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్ కేడర్ లో నిరాశ.. బీఆర్ఎస్ నాయకుల్లో నిర్లిప్తత.. వెరసి అసలు పార్లమెంట్ ఎన్నికలు ఎందుకు వచ్చాయన్నట్లుగా తయారైంది మానుకోటలో బీఆర్ఎస్ పరిస్థితి. అధికారం లేకపోవడం.. బీఆర్ఎస్ నుంచి భారీగా వలసలు.. ఈ కారణంగా గులాబీ ప్రచారం నిస్సారంగా సాగుతోంది. పోటీ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ మధ్య సాగే అవకాశం ఉన్నందున బీఆర్ఎస్ పార్టీకి పడే ఓట్లు ఎవరికి మైనస్ అవుతాయి? ఎవరికి ప్లస్ అవుతాయనే చర్చ నడుస్తున్నది.
మహబూబాబాద్ కు మోదీ ఇచ్చిన నిధులు..
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మహబూబాబాద్ కు పెద్ద ఎత్తున నిధులు ఇచ్చారు. పీఎం ఆవాస్ యోజన పథకంలో భాగంగా మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి రూ.12.09 కోట్ల ఖర్చుతో 665 ఇండ్లను కేటాయించింది నరేంద్ర మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం. రూ.19.89 కోట్ల నిధులు విడుదల కాగా.. ఇప్పటివరకు 529 ఇండ్ల నిర్మాణం పూర్తయింది. అమృత్ పథకంలో భాగంగా అటల్ మిషన్ పట్టణ పునరుద్ధరణ కింద రూ.544.85 కోట్ల వ్యయంతో నియోజకవర్గంలోని పట్టణ కేంద్రాలను అభివృద్ధి చేసింది. అమృత్ 2.0 లో నియోజకవర్గ అభివృద్ధి కోసం రూ. 173.18 కోట్లతో మరో 13 ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి స్వనిధి పథకం కింద నియోజకవర్గంలోని 1,402 మందికి రూ.29.98 కోట్ల రుణ సదుపాయం కల్పించింది మోదీ ప్రభుత్వం. దీన్ దయాళ్ అంత్యోదయ యోజన అమలులో భాగంగా పట్టణ జీవనోపాధి మిషన్ కింద 522 స్వయం సహాయక సంఘాల ద్వారా నియోజకవర్గంలోని 2,521 మందికి బ్యాంక్ రుణాలతో జీవనోపాధి మెరుగు పరిచింది. 546 మందికి ఉపాధి శిక్షణ అందించింది.