ట్యాపింగ్​ కేసు రాధాకిషన్​రావుపై మరో ఫిర్యాదు

కోట్లు దండుకున్నారన్న బాధితుడు

Mar 31, 2024 - 20:46
 0
ట్యాపింగ్​ కేసు రాధాకిషన్​రావుపై మరో ఫిర్యాదు

నా తెలంగాణ, హైదరాబాద్: ఫోన్​ ట్యాపింగ్​ కేసులో అదనపు రాధాకిషన్​రావు బంజరాహిల్స్​ పోలీస్​ స్టేషన్​లో రియల్​ ఎస్టేట్​ వ్యాపారి ఫిర్యాదు చేశాడు. తన ఫోన్​ను రాధాకిషన్​రావు ట్యాప్​ చేసి తనను బెదిరించారని ఆదివారం ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. తనను బెదిరించడమే గాక భయపెట్టి తనతో కోట్ల రూపాయలు తీసుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపన్నల విచారణ మూడో రోజు కొనసాగుతోంది. పోలీసు ఉన్నతాధికారుల అరెస్టుతో బాధితులు ఒక్కరొక్కరుగా ధైర్యం చేస్తూ ఫిర్యాదు చేస్తున్నారు. దీంతో తీగ లాగితే డొంక కదిలిందన్నట్లు అధికారుల బండారం అంతా బయటపడుతోంది. అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపన్నల విచారణలో మరికొంతమంది పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వెస్ట్‌ జోన్‌ డీసీపీ విజయ్‌కుమార్‌ ఆధ్వర్యంలో కొనసాగుతున్న దర్యాప్తులో భాగంగా, రాధాకిషన్‌రావుతో పాటు భుజంగరావు, తిరుపతన్నలు వెల్లడించిన వివరాలను పోలీసులు దృష్టి సారించారు. ట్యాపింగ్‌ వ్యవహారం ఒక్కటే కాకుండా, టాస్క్‌ఫోర్స్‌లో సుదీర్ఘకాలం కీలకంగా ఉన్న రాధాకిషన్​రావుకు సంబంధించి మరిన్ని వివరాల కూపీ లాగుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు ఓ పార్టీ అభ్యర్థులకు, రాధాకిషన్‌రావు కనుసన్నల్లోనే టాస్క్‌ఫోర్స్‌ వాహనాల్లో ఇతర ప్రాంతాలకు డబ్బు తరలించినట్లు అధికారులు దర్యాప్తులో గుర్తించారు. ఈ నేపథ్యంలో మరోసారి ఆయన్ను కస్డడీకి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం పోలీసులు రాధాకిషన్‌రావును 10 రోజుల కస్టడీకి అనుమంతించాలని నాంపల్లి కోర్టులో పిటిషన్‌ వేయనున్నారు. ఇద్దరు అదనపు ఎస్పీల కస్టడీ ముగిసేలోపు, రాధాకిషన్‌రావు కస్టడీకి కోర్టు అనుమతిస్తే ముగ్గురిని కలిపి విచారించాలని అధికారులు భావిస్తున్నారు. మరోవైపు ఫోన్‌ ట్యాపింగ్‌తో అక్రమంగా కోట్ల రూపాయలు కూడబెట్టారంటూ కొంతమంది బాధితులు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదులు ఇచ్చేందుకు సిద్ధమైనట్లు సమాచారం.