మనశ్శాంతితో విశ్వశాంతి: కిషన్​ రెడ్డి

Union Minister Kishan Reddy said that Global Spiritual Mahothsavam will be organized in Shadnagar Kanha Shanti Vanam from March 14th to 17th

Mar 9, 2024 - 15:43
 0
మనశ్శాంతితో విశ్వశాంతి: కిషన్​ రెడ్డి
  •  మన సంస్కృతి, ఆధ్యాత్మికత వల్లే ప్రపంచం భారత్​ వైపు చూస్తున్నది

  •  మార్చి14 నుంచి17వ వరకు గ్లోబల్​ స్పిరిచువల్​ మహోత్సవ్​

  •  షాద్​ నగర్​ లో కాన్హా శాంతి వనంలో వేడుక చేపట్టబోతున్నం

  •  300కు పైగా స్పిరిచువల్ లీడర్స్ హాజరవుతారు

  •  కేంద్ర సాంస్కృతిక శాఖ, ‘వరల్డ్ హెడ్ క్వార్టర్స్ ఆఫ్ హార్ట్‌ఫుల్ నెస్’ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు వెల్లడి

నా తెలంగాణ, హైదరాబాద్​: మనశ్శాంతితోనే విశ్వశాంతి సాధ్యమవుతుందని, అదే భారత్​ లక్ష్యమని కేంద్ర మంత్రి జి.కిషన్​ రెడ్డి తెలిపారు. మన సంస్కృతి, ఆధ్యాత్మికత వల్లే ప్రపంచం మొత్తం భారత్​ వైపు చూస్తున్నదని ఆయన తెలిపారు. మన కల్చర్​, స్పిరిచువల్ గైడెన్స్ ద్వారా యావత్  ప్రపంచాన్ని మనం ప్రభావితం చేస్తున్నామని, ఓ సానుకూల మార్గం వైపు ప్రపంచాన్ని తీసుకెళ్తున్నామని అన్నారు. ఈ మేరకు మార్చి 14 నుంచి 17 వరకు హైదరాబాద్​ లోని షాద్​ నగర్​ కాన్హాశాంతి వనంలో గ్లోబల్​ స్పిరిచువల్​ మహోత్సవం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు శనివారం ఆయన రామచంద్ర మిషన్​ ప్రెసిడెంట్​ దాజీ కమలేశ్​ పటేల్​, చినజీయర్​ స్వామి, బోధమయానంద స్వామితో కలిసి తాజ్​ కృష్ణాలో మీడియాతో మాట్లాడారు. ‘‘స్వామి వివేకానంద మొదలుకుని.. అనేకమంది మహానుభావులు.. మన గొప్పతనాన్ని, మన సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పారు, చెబుతుతున్నారు. అందుకే యావత్ ప్రపంచం ఇవాళ భారతదేశం వైపు గౌరవ భావంతో చూస్తోంది. మనదేశంలో పుట్టిన అనేకమతాలు ప్రపంచమంతా విస్తరించాయి. శాంతిని బోధిస్తున్నాయి. ఆయా మతాల ఆచార వ్యవహారాలు, ఫిలాసఫీల కారణంగా.. భారతదేశం ఆధ్యాత్మిక భిన్నత్వంతో మరింత ప్రత్యేకతను సంతరించుకుంది. ఇవాళ యావత్ ప్రపంచం మన భారతదేశ శారీరక, మానసిక ఆరోగ్య విధానమైన ‘యోగా’ను ఉత్సాహంగా స్వీకరించింది”అని చెప్పారు.

స్పిరిచువల్​ టూరిజం..

మన పురాణ, ఇతిహాసాలను, గీతాసారాన్ని, వేదాలు, ఉపనిషత్తుల్లో దాగి ఉన్న జ్ఞానాన్ని తెలుసుకునేందుకు ప్రపంచంలోని కోట్లాదిమంది ప్రజలు ప్రయత్నిస్తున్నారని కిషన్​ రెడ్డి తెలిపారు. అందుకే ఇటీవలి కాలంలో భారతదేశంలో ‘స్పిరిచువల్ టూరిజం’ చాలా వేగంగా అభివృద్ధి చెందుతోందని అన్నారు. ‘‘మన ఆధ్యాత్మిక గురువుల మార్గదర్శనం కోసం విదేశాల నుంచి ఇక్కడకు వచ్చి ఆశ్రమాల్లో ఉంటున్న వారు భారతీయ ఆధ్యాత్మిక గొప్పతనానికి ఆకర్శితులవుతున్నారు. ఈ నేపథ్యంలో.. భారతదేశంతోపాటుగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న స్పిరిచువల్ గురువులందరినీ ఒక వేదికపైకి తీసుకొచ్చి.. ‘మనశ్శాంతి నుంచి విశ్వశాంతి వైపు’ బాటలు వేయడం ద్వారా.. ప్రపంచవ్యాప్తంగా ఓ సానుకూలమైన వాతావరణాన్ని ఏర్పాటు చేయాలనేది ప్రధానమంత్రి మోదీ ఆలోచన. దీనికి అనుగుణంగానే.. ప్రపంచంలోని అన్ని మతాల సారాన్ని ఒకచోట చేర్చి విశ్వశాంతి కోసం భారతదేశంలో ఒక మహత్తర కార్యక్రమం నిర్వహించాలని మోదీ సూచించారు. 

కాన్హాశాంతి వనంలో..

వచ్చే 25 ఏళ్లలో(అమృత్ కాల్) ప్రేమ, శాంతి, ఐకమత్యం భావనలను విశ్వవ్యాప్తం చేయాలనేదే మోదీ ఆలోచన​ అని కిషన్​ రెడ్డి తెలిపారు. దీనికి అనుగుణంగానే మార్చి14 నుంచి17వ తేదీ వరకు కేంద్ర సాంస్కృతిక శాఖ, ‘వరల్డ్ హెడ్ క్వార్టర్స్ ఆఫ్ హార్ట్‌ఫుల్ నెస్’ సంయుక్త ఆధ్వర్యంలో షాద్‌నగర్  సమీపంలోని కాన్హా శాంతి వనంలో ‘గ్లోబల్ స్పిరిచువల్ మహోత్సవ్’ నిర్వహించబోతున్నట్లు చెప్పారు. ‘‘ప్రముఖ ఆధ్యాత్మిక గురువు శ్రీ దాజీ.. ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ముందుకు రావడం గొప్ప విషయం. ఈ మహత్కార్యంలో దాదాపు 300కు పైగా స్పిరిచువల్ లీడర్స్ తోపాటుగా.. దాదాపు లక్షమంది వరకు పాల్గొంటారని అంచనా వేస్తున్నాం. గతేడాది భారతదేశం ఆధ్వర్యంలో జరిగిన జీ20 సమావేశాల కోసం మనం ఎంచుకున్న థీమ్ ‘వసుధైవ కుటుంబకం’ - వన్ వరల్డ్, వన్ ఫ్యామిలీ. ఇది జీ20లో పాల్గొన్న సభ్యదేశాలు, ప్రత్యేక ఆహ్వానిత దేశాలతోపాటు యావత్ ప్రపంచాన్ని ఆకర్షించింది. ఈ గ్లోబల్ స్పిరిచువల్ మహోత్సవ్ లక్ష్యం కూడా ఇదే. ఐకమత్య భావన పెంపొందించడం, సకలజన సమ భావనను ప్రోత్సహించడం. ఇందు కోసం ఆధ్యాత్మిక భావనను ముందుకు తీసుకెళ్తూ.. ‘వసుధైవ కుటుంబంకం’ ఆలోచన ప్రతి వ్యక్తి దగ్గరకు తీసుకెళ్లాలని, ఈ సందేశం ప్రపంచానికి పంపాలనే లక్ష్యంతో మన దేశంలో తొలిసారి ఇంత ఉత్సాహంగా ప్రపంచ నలుమూలల నుంచి వస్తున్న ఆధ్యాత్మిక గురువులు వారి మతాల సారాన్ని, అనుభవాలను, ఆధ్యాత్మిక, తాత్వికమైన ఆలోచనలను ఈ వేదిక ద్వారా పంచుకోనున్నారు. వీరందరి మధ్య ఆరోగ్యకరమైన చర్చ, తాత్వికమైన చర్చ జరిగి.. విశ్వశాంతి కోసం మార్గదర్శనం జరుగుతుందనే సంపూర్ణ విశ్వాసం నాకు ఉంది. రేపటి తరాల కోసం ఓ ఆరోగ్యకరమైన ప్రపంచాన్ని నిర్మించేందుకు అవసరమైన పర్యావరణ పరిరక్షణ, యోగా, మెడిటేషన్ లను మరింత ప్రోత్సహించేందుకు అవసరమైన సూచనలు కూడా ప్రపంచానికి అందనున్నాయి”అని పేర్కొన్నారు.

ప్రారంభించనున్న రాష్ట్రపతి

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మార్చి15వ తేదీన ఈ ‘గ్లోబల్ స్పిరిచువల్ మహోత్సవం’ను ప్రారంభించేందుకు అంగీకరించారని కేంద్ర మంత్రి కిషన్​ రెడ్డి తెలిపారు. ‘‘మార్చి16వ తేదీన ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌కర్ ముగింపు సమావేశంలో పాల్గొననున్నారు. 14న సాయంత్రం ప్రముఖ గాయకుడు శంకర్ మహదేవన్ మ్యూజిక్ కన్సర్ట్ ఉంటుంది.17 న.. ఆధ్యాత్మిక గురువులతో కొన్ని సెషన్స్ ఉంటాయి. ఇటీవలే ప్రధాని మోదీ..  కాన్హా శాంతి  వనాన్ని  సందర్శించారు. ఆధ్యాత్మిక మార్గాన్ని అలవర్చుకోవాల్సిన అవసరం, యోగా, ధ్యానం, సంగీతం అలవర్చుకోవాల్సిన అవసరం ఉంది. శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడంతో పాటుగా విశ్వశాంతికి బాటలు వేయాల్సిన అవసరాన్ని మనం అర్థం  చేసుకోవాలి. ప్రపంచంలోనే అతిపెద్ద మెడిటేషన్ సెంటర్ అయిన.. కాన్హా శాంతి  వనంలో జరుగుతున్న ఈ గొప్ప కార్యక్రమం.. సంకల్పిత లక్ష్యాలను చేరుకుంటుందని మనస్ఫూర్తిగా విశ్వసిస్తున్నాను. ఇది ఒక మతానికి సంబంధించిన కార్యక్రమం కాదు. సమాజ శ్రేయస్సు, మన విశ్వశాంతి కోసం నిర్వహిస్తున్నది. మోదీ ప్రధాన మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత.. భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడానికి కృషి చేస్తున్నారు. భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలను.. ఇక్కడి ఆధ్యాత్మిక భావనను పంచుకునే అన్ని దేశాలతో ఓ సుహృద్భావపూరిత వాతావరణాన్ని నిర్మించేందుకు మోదీ  ప్రత్యేక చొరవ చూపిస్తున్నారు. ఇందులో భాగంగానే.. ఈ ‘గ్లోబల్ స్పిరిచువల్ మహోత్సవ్’కు బాటలు పడ్డాయి. ఇలాంటి కార్యక్రమాలను సమయానుగుణంగా చేపడుతూ.. భారతదేశ కేంద్రంగా ప్రపంచానికి మార్గదర్శనం చేయాల్సిన అవసరముంది. ఇంత గొప్ప కార్యక్రమానికి ఆతిథ్యం ఇస్తున్న ‘గ్లోబల్ గైడ్ ఆఫ్ హార్ట్-ఫుల్-నెస్’ శ్రీ దాజీకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. అనేకమంది ఆధ్యాత్మిక గురువులు వస్తున్నారు. ఈ కార్యక్రమ లక్ష్యాలు ప్రజలందరికీ చేరడంలో మీడియా కూడా తమవంతు సహకారాన్ని అందించాలని కోరుతున్నాను”అని కిషన్​ రెడ్డి పేర్కొన్నారు.

కలిసి పనిచేస్తే.. అద్భుత ఫలితాలు: దాజీ కమలేశ్​

స్వామీ వివేకానంద  జీవితం, వారిచ్చిన సందేశాలే సమాజాన్ని, అందరినీ ముందుకు నడిపిస్తున్నాయని రామచంద్ర మిషన్​ అధ్యక్షులు దాజీ కమలేశ్​ తెలిపారు. “స్వామి వివేకానంద సర్వమత మహాసభల్లో పాల్గొని మాట్లాడిన అంశాల్లో..‘అన్ని  మతాల సారం’ ఒక్కటేనని చెప్పారు. మానవత్వాన్ని విభజించే మతాలకు అస్తిత్వమే ఉండదు. ఐకమత్యాన్ని, శాంతి, సమానత్వాన్ని బోధించడమే మన జీవన విధానం కావాలి. మనమంతా ఏకమై.. ప్రపంచానికి శాంతి సందేశాన్ని ఇవ్వాల్సిన తరుణమిది. సామాజిక బాధ్యత, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలపై చర్చించాలి. ప్రపంచానికి మార్గదర్శనం చేయాలి. మన జీవన విధానంలో మార్పులు చేసుకుంటే చాలా అంశాలకు పరిష్కారం దొరుకుతుంది. ఐక్యరాజ్యసమితి సూచించిన సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను చేరుకునేందుకు మనమంతా కష్టపడాలి. మనమంతా కలిసి పనిచేస్తే.. అద్భుత ఫలితాలు సాధించగలం”అని ఆయన పేర్కొన్నారు.

కిషన్​ రెడ్డి చొరవ అభినందనీయం: చినజీయర్ స్వామీజీ

ప్రపంచాన్ని ఐక్యం చేయడంలో ఈ మహోత్సవం ఒక ముందడుగు అని చినజీయర్​ స్వామీజీ అన్నారు. ఈ మహత్కార్యంలో భాగస్వామ్యం కావడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. ‘‘అన్ని మతాలను, అందరూ ఆధ్యాత్మికవేత్తలను ఒకతాటిపైకి తీసుకొచ్చి విశ్వశాంతికి బాటలు వేసేందుకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తీసుకున్న చొరవ అభినందనీయం. దాజీ కాన్హా శాంతి వనం వేదికగా ‘శాంతి’మంత్రాన్ని లక్షలాదిమందికి చేరవేస్తున్నారు. ప్రతి మతం, ప్రతి ఆధ్యాత్మిక సంస్థకు ప్రత్యేకంగా ఒకట్రెండు అంశాలుండొచ్చు. కానీ అన్ని సంస్థల లక్ష్యం దాదాపుగా ఒక్కటే. ప్రపంచాన్ని ఏకం చేసేందుకు కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ద్వారా ఈ ప్రయత్నం జరుగుతోంది. మన చేతిలోని ఐదువేళ్లు వేర్వేరుగా ఉన్నట్లే.. సమాజంలో భిన్నత్వం సహజమే. కానీ అందరి లక్ష్యం ఒక్కటే. ఒకరినొకరు గౌరవించుకుని, ఒకరితో ఒకరు కలిసి పనిచేసినపుడు. చాలా సమస్యలు పరిష్కారమవుతాయి. మనం అద్భుతాలు సాధించవచ్చు. మూడ్రోజులపాటు కాన్హా శాంతి వనంలో జరిగే ఈ కార్యక్రమం.. మనందరినీ ఏకం చేసేందుకు ఉద్దేశించినది. భవిష్యత్తుకు ఓ ప్లాన్ ఆఫ్ యాక్షన్ నిర్ణయించేందుకు ఉద్దేశించింది”అని చినజీయర్​ స్వామీజీ తెలిపారు.

విశ్వజనీన ఆధ్యాత్మిక సమ్మేళనమిది: బోధమయానంద

గ్లోబల్​ స్పిరిచువల్​ మహోత్సవం విశ్వజనీన ఆధ్యాత్మిక సమ్మేళనమని రామకృష్ణ మఠ్​ స్వామీజీ బోధమయానంద తెలిపారు. ‘‘ఇది మతానికి సంబంధించినది కాదు. ఇంగ్లీషులో రెలిజియన్ అనే పదం వాడుతున్నారు. అందుకే అపార్థాలు ఎక్కువవుతున్నాయి. మతం, ధర్మం, తత్వం ఈ మూడు అంశాలను మనం అర్థం చేసుకోవాలి. రెలిజియన్ అంటే స్పిరిచువాలిటీ(ఆధ్యాత్మికత) అనేది సరైన అర్థం. మేధోమథనం జరిగినపుడే.. అసలైన భావన మనకు అందుతుంది. మనలోని దైవత్వాన్ని మన ఆలోచనల్లో, మన వ్యవహారంలో ప్రతిబింబించాలి. వంద దేశాలనుంచి 300 మంది ఆధ్యాత్మిక గురువులు వస్తుండటం.. చాలా గొప్పవిషయం. ఆధ్యాత్మికతతో ప్రపంచాన్ని గెలవాలనేది స్వామి వివేకానంద వారి సందేశం. మానవ ప్రయత్నం, దైవ కృప రెండూ జరగాలి.. అప్పుడే ఫలితం వస్తుంది”అని ఆయన పేర్కొన్నారు.