ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలి

కలెక్టర్ అభిలాష అభినవ్

Oct 24, 2024 - 20:14
 0
ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలి
నా తెలంగాణ, నిర్మల్: ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం అర్హులైన ప్రతి ఒక్కరూ తమ పేరును నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ సూచించారు. గురువారం సాయంత్రం ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులతో ఆమె సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉపాధ్యాయులంతా విధిగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు కోసం తమ పేరును నమోదు చేసుకోవాలన్నారు. గత ఎన్నికల్లో ఓటరుగా తమ పేరు నమోదు చేసుకున్నప్పటికి, ఈ ఎన్నికల్లో కూడా కొత్తగా తమ పేరును నమోదు చేసుకోవాలన్నారు. వీలైనన్ని ఎక్కువ దరఖాస్తులు వచ్చేలా ప్రత్యేక చొరవ తీసుకోవాలన్నారు. ఆన్ లైన్, ఆఫ్ లైన్ విధానంలో ఓటరుగా తమ పేరును నమోదు చేసుకోవచ్చని, ఆఫ్ లైన్ విధానంలో అయితే తహసిల్దార్ లేదా ఆర్డీవో కార్యాలయాల్లో సంబంధిత దరఖాస్తులు పూర్తి చేసి అర్హత పత్రాలు జత చేసి కార్యాలయాల్లో అందజేయాలన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ పేరును నమోదు చేసుకోవడానికి నవంబర్ 6న గడువు ముగుస్తుందన్నారు. ఈలోగా అర్హులైన వారందరు ఓటరుగా తమ పేరును నమోదు చేసుకోవాలన్నారు. ఉపాధ్యాయుల సహకారంతోనే బాలశక్తి కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుందన్నారు. విద్యార్థులు చదువుతోపాటు సామాజిక అభివృద్ధి సాధించడం కోసమే బాలశక్తి కార్యక్రమాన్ని రూపొందించినట్లు వివరించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్ (రెవెన్యూ), డీఆర్ఓ భుజంగరావు, డీఈవో రవీందర్ రెడ్డి, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి పరుశురాం, ఎన్నికల విభాగం పర్యవేక్షకులు శ్రీనివాస్, పలు విద్యాసంస్థల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
 
పర్యాటక రంగ అభివృద్ధికి చర్యలు.. 
 పర్యాటకరంగ అభివృద్ధికి చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. జిల్లాలోని ప్రసిద్ధ దేవాలయాలు, చారిత్రాత్మక కట్టడాలు, పర్యాటకరంగ అభివృద్ధిపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా  మాట్లాడుతూ పర్యాటకరంగ అభివృద్ధికి పటిష్ట చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జిల్లాలోని పర్యాటక ప్రదేశాలను గుర్తించి అవసరమైన సౌకర్యాలు, సుందరీకరణ పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్రస్థాయి పురావస్తు, టూరిజం అధికారుల సమన్వయంతో జిల్లాలోని ప్రసిద్ధ దేవాలయాలు, చారిత్రాత్మక కట్టడాలు, పర్యాటక ప్రదేశాలు, ప్రాజెక్టులు, జలపాతాలను మరింత అభివృద్ధి చేసేలా ప్రణాళికలను సిద్ధం చేయాలని ఆదేశించారు. బాసర సరస్వతి దేవి, అడెల్లి పోచమ్మ, సదర్మాట్ బ్యారేజ్, స్వర్ణ, కడెం, గడ్డెన్న వాగు ప్రాజెక్టులను సందర్శించే పర్యాటకులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, పర్యాటక శాఖ అధికారి శ్రీకాంత్ రెడ్డి, సీపీఓ జీవరత్నం, మున్సిపల్ కమిషనర్ సివిఎన్ రాజు, బాసర ఆలయ ఈవో విజయరామారావు, ఈడియం నదీమ్, అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.