రిమ్స్ రోగులకు సక్రమంగా అందని మెనూ
కలెక్టర్ చెప్పిన మారని తీరు కనిపించని బోర్డులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కాంట్రాక్టర్ పట్టించుకోని డైరెక్టర్
నా తెలంగాణ, ఆదిలాబాద్: ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు మెనూ సమస్య తీవ్రంగా వేధిస్తోంది. నిబంధనల ప్రకారం పోషకాలతో కూడిన మెనూ అందించాల్సిన కాంట్రాక్టర్ ఇష్టం వచ్చిన మెనూ పెడుతున్నారు. రిమ్స్ కాంట్రాక్టర్ తీరును పట్టించుకునే వారే లేరు. దీంతో ఎవరికి చెప్పినా ఏం లాభం లేదని, ఎవరూ పట్టించుకోలేరని రోగులు వారి వెంట ఉండే కుటుంబసభ్యులు పట్టించుకోవడం లేదు. ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రిలో రోగులతో పాటు వారి బంధువులకు కలిపి మొత్తం సంవత్సరానికి ప్రభుత్వం ఆరు కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. కానీ రోగులకు నాణ్యమైన మెనూ అందించడం లేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
జిల్లా కేంద్రానికి తలమానికంగా నిలుస్తున్న రిమ్స్ ఆస్పత్రిలో కాంట్రాక్టర్ హిస్టరీ తీరుపై పట్టించుకునే వారే కరవయ్యారు. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి నాణ్యమైన భోజనం అందించాల్సి ఉండగా నాసిరకం మెనుతో భోజనాలు పెట్టి సరిపెడుతున్నాడనే ఆరోపణలున్నాయి. ఈ విషయం తెలిసినా ఆయన వంక చూసేందుకు కూడా అధికారగణం సాహింసించకపోవడం కారణం ఏమై ఉంటుందా? అనే వాదనలు వినబడుతున్నాయి.
700మందికి రోజుకు మూడు పూటలా మెనూ అందించేందుకు గాను ఏడాదికి ప్రభుత్వం రూ. 6 కోట్లను ఖర్చు చేస్తోంది. ఈ విషయంపై కలెక్టర్ కు పలువురు ఫిర్యాదు చేయడంతో ఆయన ఓమార్లు ఈ వ్యవహారంపై ఆరా తీసి కాంట్రాక్టర్ పై గరమయ్యారు. మరోసారి ఇలాంటి చర్యలు పునరావృతం కాకూడదని హెచ్చరించారు.
ఓ వారం రోజులపాటు మంచి భోజనం వడ్డించి తిరిగి షరామామూలే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. విషయంపై రిమ్స్ డైరెక్టర్ జై సింగ్ రాథోడ్ కూడా కాంట్రాక్టర్ ను హెచ్చరించినట్లు తెలుస్తోంది.
ఆసుపత్రిలో మెనూ బోర్డులను ఏర్పాటు చేయాల్సి ఉన్నా అది కూడా ఏర్పాటు చేయలేదు. అడిగిన వారిపైనే జులుం ప్రదర్శించేలా వ్యవహరిస్తున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు ఆసుపత్రిలో అందుతున్న మెనూను సక్రమంగా అందించాలని, అదే సమయంలో కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.