ఎనిమిది పాఠశాలలకు బాంబు బెదిరింపులు
ఉత్తిదే అన్న అహ్మాదాబాద్ డీసీపీ లవీనా సిన్హా
అహ్మాదాబాద్: బాంబు బెదిరింపులు నిత్యకృత్యమైపోయాయి. సోమవారం అహ్మాదాబాద్ లోని ఎనిమిది పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈ–మెయిల్ లు వచ్చాయి. పాఠశాలను పేల్చివేస్తామని హెచ్చరించారు. అయితే ఈ బెదిరింపులు కూడా ఢిల్లీ బెదిరింపులు వచ్చిన రష్యా హ్యాండర్ల నుంచి వచ్చినట్లుగా పలువురు పోలీసులు పేర్కొన్నారు. బెదిరింపుల తరువాత పాఠశాల యాజమాన్యాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా విద్యార్థులను త్వరగా పంపించి వేసి పాఠశాలల్లో సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు.
అయితే ఈ బెదిరింపులు ఉత్తిత్తివేనని పోలీసులు గుర్తించారు. పాఠశాలల్లో క్లూస్, బాంబు స్క్వాడ్ లతో రంగంలోకి దిగి అణువణువు గాలించారు. అహ్మాదాబాద్ డీసీపీ లవీనా సిన్హా మాట్లాడుతూ.. బాంబు బెదిరింపులపై పాఠశాల యాజమాన్యాలు తమకు సమాచారం అందించిన వెంటనే అప్రమత్తమయ్యామన్నారు. ఇవి కూడా ఢిల్లీ మాదిరే ఉత్తిత్తి బెదిరింపులేనని తెలిపారు. కాగా పాఠశాలల్లో తనిఖీలు నిర్వహించామని అక్కడ అనుమానాస్పద వస్తువులేమీ లభించలేదని పేర్కొన్నారు. బెదిరింపుపై విచారణ చేస్తున్నట్లు తెలిపారు. కాగా గుజరాత్ లోని మంగళవారం మూడోదశ ఎన్నికలు నిర్వహించనున్న విషయం తెలిసిందే.