వెన్నుపోటు పొడవడమే ఇందిరమ్మ రాజ్యమా?: కిషన్ రెడ్డి
Union Minister G. Kishan Reddy was angry with Congress' behavior in Rythu Diksha
- రైతు డిక్లరేషన్, రుణమాఫీ, రూ.500 బోనస్ అన్నీ బోగసేనా?
- కాంగ్రెస్ తెచ్చిన మార్పు ఏమిటి.. హామీలు ఇచ్చి మోసం చేయడమేనా!
- తెలంగాణలో ఒక కుటుంబ పాలన పోయి.. మరో కుటుంబ పాలన వచ్చింది
- రైతులారా.. ఓట్ల కోసం వచ్చే కాంగ్రెస్ నేతలను నిలదీయండి
- రుణాలు మాఫీ చేయాలని, బోనస్ ఇవ్వాలని ప్రశ్నించండి
- వడ్లకు రూ.1400 ఉన్న మద్దతు ధరను మోదీ రూ.2200 చేశారు
- ఏటా రూ.26 వేల కోట్లు ఖర్చు చేసి కేంద్రం ధాన్యం కొంటున్నది
- రైతు దీక్షలో రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్
నా తెలంగాణ, హైదరాబాద్: ప్రజలకు, రైతులకు డిక్లరేషన్లు, గ్యారంటీల పేరుతో వెన్నుపోటు పొడవడమే ఇందిరమ్మ రాజ్యమా? అని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు జి.కిషన్ రెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ప్రకటించిన రైతు డిక్లరేషన్, రుణమాఫీ, రైతు భరోసా, రూ.500 పంట బోనస్ అన్నీ బోగసేనా అని నిలదీశారు. ఈ మేరకు సోమవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో చేపట్టిన రైతు దీక్షలో పాల్గొన్న కిషన్ రెడ్డి అనంతరం మాట్లాడారు. ‘‘బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నపుడు రాష్ట్రంలో అనేక రకాలుగా రైతులకు అన్యాయం చేసింది. కేసీఆర్ మాటలు కోటలు దాటేవి.. కానీ పనులు మాత్రం ఫాంహౌస్ దాటేవి కాదు. రైతు రుణమాఫీ చేస్తామని, ప్రతి నియోజకవర్గంలో లక్ష ఎకరాల సాగు చేస్తామని చెప్పి రైతు వ్యతిరేక విధానాలతో ఇబ్బందిపెట్టారు. అందుకే, రైతులను మోసం చేసిన కేసీఆర్ ప్రభుత్వానికి గత ఎన్నికల్లో ప్రజలు బుద్ధిచెప్పారు”అని తెలిపారు.
మభ్యపెట్టిన కాంగ్రెస్
కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్లు, గ్యారంటీలు, మేనిఫెస్టో పేరుతో అసెంబ్లీ ఎన్నికల ముందు 400కు పైగా హామీలు ఇచ్చిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ‘‘కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు, రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చే పరిస్థితి లేదు. ప్రజలకు వెన్నుపోటు పొడవడమే ఇందిరమ్మ రాజ్యమా? రైతుల కష్టాలు తీరుస్తామని, అనేక రకాల ఆశలు రైతు సమాజంలో రేకెత్తించి.. గ్యారంటీల పేరుతో మభ్యపెట్టారు. వంద రోజుల్లోనే ఇచ్చిన గ్యారంటీలు అమలు చేస్తామని కాంగ్రెస్ నాయకులు సోనియా, రాహుల్, ప్రియాంక, మల్లికార్జున ఖర్గే, రేవంత్ రెడ్డి వంటి వారు అనేక ప్రాంతాల్లో చెప్పారు. కానీ, ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. కాంగ్రెస్ గ్యారంటీ అంటే... ప్రజలను మభ్యపెట్టే, మోసం చేసే గ్యారంటీ. రైతులకు వెన్నుపోటు పొడిచే, దగా చేసే గ్యారంటీ. సోనియమ్మ పాలన రాగానే డిసెంబరు 9న తక్షణమే రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. కానీ ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేదు. ఏ ఒక్కరు కూడా బ్యాంకులకు అప్పులు కట్టొద్దని, కొత్తగా రుణాలు తీసుకోండని రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఆయన మాటలను నమ్మి కాంగ్రెస్ కు ఓటేస్తే రైతులను మోసం చేశారు. నేడు రైతులకు బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదు. రైతులు దళారీల దగ్గర మిత్తీలకు అప్పులు తెచ్చుకొని పంటలు పండిస్తే రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల ధాన్యం కొనుగోలు చేయడంలో శ్రద్ధ లేదు. వారికి వసూళ్లకు పాల్పడి ఆ పైసలను ఢిల్లీకి పంపడం పైనే శ్రద్ధ ఉన్నది. ఇచ్చిన హామీలు అమలు చేసేందుకు ఎలాంటి కార్యాచరణ ప్రణాళిక ఉందో కాంగ్రెస్ వద్ద ఉందో రేవంత్ రెడ్డి స్పష్టం చేయాలి”అని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు.
ఒక కుటుంబం పోయి..
రాష్ట్రంలో ఒక కుటుంబ పాలన పోయి.. మరొక కుటుంబ పాలన వచ్చిందని, ఒక వసూలు రాజ్యం పోయి.. మరొక వసూలు రాజ్యం వచ్చిందని కిషన్ రెడ్డి విమర్శించారు. ‘‘రాష్ట్రంలో మార్పు తీసుకొస్తామని కాంగ్రెస్ నాయకులు చెప్పారు. మార్పు అంటే మతిమరుపు మార్పా..? ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడమే మార్పా? రూ. 2 లక్షల లోపు రైతు రుణాలను తక్షణమే మాఫీ చేసి, రూ.15 వేలు రైతు భరోసా, రైతు కూలీలకు రూ. 12 వేలు, వరికి క్వింటాలుకు రూ. 500 చొప్పున బోనస్ వంటి హామీలు ఇచ్చారు. ఇంతవరకు అమలు చేయలేదు. ఓడ్లు అడిగేందుకు గ్రామాలకు వచ్చే కాంగ్రెస్ నాయకులను వీటిపై నిలదీయాలి. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి 2014 వరకు ధాన్యం క్వింటాలుకు గరిష్టంగా రూ.1400 మద్దతు ధర మాత్రమే ఉండేది. నరేంద్ర మోదీ ప్రభుత్వం రూ. 2200 మద్దతు ధరతో ధాన్యం కొనుగోలు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఏటా రూ. 26 వేల కోట్ల ఖర్చుతో ధాన్యం కొనుగోలు చేస్తోంది. ప్రతి బస్తాకు ఇచ్చే సుతిల్, కూలీ, ట్రాన్స్ పోర్ట్ చార్జీలు, రైస్ మిల్లులకు చార్జీలు.. రైతు కల్లాల నుంచి మొదలు బియ్యం ఎఫ్ సీఐ గోదాంలకు చేరే వరకు అన్ని రకాలుగా కేంద్ర ప్రభుత్వమే ఖర్చు భరిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ధాన్యం కొనుగోలు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తోంది. మోదీ ప్రభుత్వం కాంగ్రెస్ చేసిన ఎరువుల బ్లాక్ మార్కెట్ కు అరికట్టి.. నీమ్ కోటెడ్ యూరియాను అందిస్తోంది. ఒక ఎకరానికి ఏడాదికి రూ.18 వేలు ఎరువుల సబ్సిడీ రైతులకు అందిస్తోంది. కూరగాయల పంటలు, ఫామాయిల్ ఉత్పత్తులను ప్రోత్సహించేలా అగ్రికల్చర్ క్లస్టర్లను ఏర్పాటు చేసేలా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. గత సర్కారు పంటల బీమా అమలు చేయక రైతులను ముంచింది. ఇప్పుడు కాంగ్రెస్ సర్కారు పంట నష్ట పరిహారం ఇవ్వడం లేదు”అని కిషన్ రెడ్డి మండిపడ్డారు.
మోదీ గ్యారంటీ.. అంటే అమలుచేసే గ్యారంటీ..
జాతీయ రహదారుల నిర్మాణం, ఉగ్రవాదం నిర్మూలన, ఆర్టికల్ 370 రద్దు, అయోధ్యలో రామమందిరం నిర్మాణం వంటి అనేక హామీలు ఇచ్చి.. వాటిని మోదీ నెరవేర్చారని కిషన్ రెడ్డి తెలిపారు. ‘‘మోదీ గ్యారంటీ అంటే అమలు చేసే గ్యారంటీ. పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచాకే ఇచ్చిన హామీలు అమలు చేస్తామని రేవంత్ రెడ్డి అంటున్నారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేది లేదు. రాహుల్ గాంధీ తన జీవితంలో ప్రధానమంత్రి కాలేరు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలయ్యే పరిస్థితి లేదు. అనేక హామీలు ఇచ్చి అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించేలా అన్ని మండల కేంద్రాల్లో రైతులకు అండగా ఉండేలా బీజేపీ నిరసన దీక్ష చేపట్టింది. రైతులకు అండగా బీజేపీ ఉంటుంది. ఇచ్చిన హామీలను అమలు చేసేంతవరకు పోరాటం చేస్తుంది”అని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.