ఉత్తమ నైపుణ్య శిక్షణతో విద్యార్థులకు ఉపాధి: కిషన్ రెడ్డి
Union Minister G. Kishan Reddy inaugurated the NIELIT Center in Secunderabad
- యువత సాధికారత కోసం మోదీ ప్రభుత్వం కృషి
- సికింద్రాబాద్ లో నీలిట్ కేంద్రం ప్రారంభం
- వచ్చే మూడేండ్లలో 5 వేల మందికి నైపుణ్య శిక్షణ
- తెలుగు రాష్ట్రాల యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచన
నా తెలంగాణ, హైదరాబాద్: ఉత్తమ నైపుణ్య శిక్షణతోనే విద్యార్థులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి తెలిపారు. యువత సాధికారత కోసం గత తొమ్మిదిన్నరేండ్లుగా మోదీ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నదని ఆయన గుర్తు చేశారు. ఈ మేరకు సికింద్రాబాద్‌లో కేంద్రప్రభుత్వ ఆధ్వర్యంలో ‘నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(నీలిట్) సెంటర్ ను కిషన్ రెడ్డి వర్చువల్ గా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘సికింద్రాబాద్‌లో ఇవాళ నీలిట్ సెంటర్ ప్రారంభం కానుండటం.. ఈ విద్యా సంవత్సరం నుంచే శిక్షణాతరగతులు మొదలు కానుండటం సంతోషకరం. ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యుగం నడుస్తోంది. ఇందులో.. భారత్ పూర్తిగా తన పట్టును పెంచుకుంటోంది. మన తెలుగు యువత అమెరికా, బ్రిటన్, యూరోపియన్ దేశాల్లో ఎలక్ట్రానిక్స్, ఐటీ రంగంలో సత్తాచాటుతున్నారు. అంతర్జాతీయంగా ఏ పెద్ద కంపెనీ సీఈవో అయినా.. మనదేశానికి చెందినవారో.. మన భారత సంతతికి చెందినవారే ఉంటున్నారు. ఈ రంగంలో మరింత ముందడుగు వేసేందుకు.. ప్రపంచ స్థాయిలో మన యువతను తీర్చదిద్దేందుకు అంతర్జాతీయ ప్రమాణాలతో ముందుకెళ్లేందుకు.. అవసరమైన రీతిలో యువతకు శిక్షణ, నైపుణ్యం అందించాలనే లక్ష్యంతో.. నీలిట్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నాం”అని కిషన్ రెడ్డి వెల్లడించారు.
నెల రోజుల్లోపే ప్రారంభం..
సికింద్రాబాద్, తిరుపతిల్లో నీలిట్ కేంద్రాల ఏర్పాటుకు ఆమోదం లభించిన నెల రోజులలోపే ఆ సెంటర్లను ప్రారంభించుకోవడం యువత సాధికారత దిశగా మోదీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నానికి ఒక నిదర్శనమని కిషన్ రెడ్డి అన్నారు. నీలిట్ సంస్థ.. ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇతర అనుబంధ కోర్సుల్లో మెరుగైన శిక్షణ అందిస్తుందని తెలిపారు. ‘‘ఆయా రంగాల్లో ఉపాధిని అన్వేషించే విద్యార్థులకు అవసరమైన నైపుణ్య శిక్షణను అందించి ఆయా కంపెనీలకు కావాల్సిన మానవ వనరులను అందుబాటులో ఉంచటంలో నీలిట్ కీలక పాత్ర పోషిస్తుంది. ఐటీ ఎగుమతుల్లో, ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల్లో భారత్ ప్రతి సంవత్సరం ఎంతో అభివృద్ధి సాధిస్తోంది. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం వల్ల భారత్ ను గమ్యస్థానంగా ఎంపిక చేసుకుని అనేక నూతన కంపెనీలు తమ సంస్థలను ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాయి. ఆయా ప్రాంతాల్లోని కంపెనీలు సంబంధిత రంగాలలో అత్యున్నతస్థాయి నైపుణ్యం కలిగిన మానవ వనరుల కోసం ఎంతగానో అన్వేషిస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో నూతనంగా ఏర్పాటు చేస్తున్న కంపెనీలకు ఆయా రంగాలలో అవసరమైన అత్యున్నత స్థాయి నైపుణ్య శిక్షణ కలిగిన మానవ వనరులను అందించే కేంద్రాల ఏర్పాటు కూడా ఆవశ్యకమైంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో వందల కొద్దీ నైపుణ్య శిక్షణ కేంద్రాలు ఉన్నప్పటికీ, ఆయా రంగాలలో అత్యున్నతస్థాయి ప్రమాణాలతో కూడిన నైపుణ్య శిక్షణను అందించే కేంద్రాలు తక్కువ సంఖ్యలోనే ఉన్నాయి. అందుకే.. ఇన్ఫర్మేషన్, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ టెక్నాలజీ సంబంధిత రంగాల్లో అత్యున్నతస్థాయి శిక్షణ సంస్థల ఏర్పాటు కోసం నేను కేంద్ర మంత్రి అశ్విణి వైష్ణవ్ ను కోరడం.. వారు అంగీకరించి.. ఏపీకి, తెలంగాణకు ఒక్కో నీలిట్ సంస్థను కేటాయించడం సంతోషకరం. వారికి నా ధన్యవాదాలు”అని పేర్కొన్నారు.
వేలాది మందికి మేలు
నీలిట్ కేంద్రం ద్వారా రాబోయే 3 సంవత్సరాల కాలంలో కనీసం 5,000 మందికి శిక్షణ ఇచ్చేలా ప్రణాళికలు రూపొందించబోతున్నట్లు కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి తెలిపారు. ‘‘తెలుగు రాష్ట్రాలలోని యువతకు, ఇంజనీరింగ్ విద్యార్థులకు, సంబంధిత రంగాల్లో ముందుకు వెళ్లాలని చూస్తున్న నిరుద్యోగులకు ఈ కేంద్రాలు ఒక చక్కటి అవకాశం. ఎంతో అత్యున్నతస్థాయి శిక్షణను అందించే ఈ కేంద్రాల్లో శిక్షణను పూర్తి చేసుకున్న వారికి సంబంధిత కంపెనీలలో మంచి ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తాయి. ఆయా రంగాలలో పరిశోధనలకు కూడా ఈ కేంద్రాలు చక్కని వేదికలుగా ఉపయోగపడతాయి. ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాలలో నూతన ఆవిష్కరణలకు, వ్యవస్థాపక స్ఫూర్తిని పెంపొందించడానికి కూడా ఈ కేంద్రాల ద్వారా కృషి జరుగుతుంది. మన తెలుగు రాష్ట్రాల యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచిస్తున్నాను”అని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి, టాస్క్ సీఈవో శ్రీకాంత్ సిన్హా, నీలిట్ చెన్నై డైరెక్టర్ శ్రీ కేఎస్ లాల్‌మోహన్ తదితరులు పాల్గొన్నారు.