కేసీఆర్ కంటే కేటీఆర్ దాదాగిరే ఎక్కువ
– బీజేపీ ఎంపీ బండి సంజయ్
నా తెలంగాణ, సిరిసిల్ల: బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ కంటే ఎక్కువగా అధికారం చెలాయించింది, దాదాగిరి చేసింది కేటీఆరే అని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ విమర్శించారు. సిరిసిల్లలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన శుక్రవారం మాట్లాడారు. కేసీఆర్ కంటే ఎక్కువ దాదాగిరి, గూండాగిరి కేటీఆరే చేశారని.. సిరిసిల్లలో సమస్యలు మాత్రం పరిష్కారం కాలేదని ఆరోపించారు. ఇక్కడి నేతన్నల దుస్థితికి వాళ్లిద్దరే కారణమన్నారు. ‘‘కరీంనగర్‌లో నేను ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తా.. అదే బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ ఓడిపోతే కేసీఆర్ రాజకీయ సన్యాసం తీసుకుంటారా’’ అని ఛాలెంజ్ చేశారు. హిందువుల మనోభావాలను కేసీఆర్, కేటీఆర్ దెబ్బతీశారని ఫైర్ అయ్యారు. కేటీఆర్ నోటీ నుంచి జై శ్రీరామ్ అనే మాటే రాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరు గ్యారెంటీల పేరుతో ప్రజలను కాంగ్రెస్ మోసం చేసిందని, బీఆర్ఎస్ మాదిరిగానే కాంగ్రెస్ కూడా పలు రూపాల్లో దోపిడీకి యత్నిస్తోందని మండిపడ్డారు. మరోసారి కాంగ్రెస్ మాయమాటలు నమ్మి మోసపోవద్దని విజ్ఞప్తి చేశారు.